మ్యాంగో బే క్లబ్‌లో పట్టుబడిన పేకాటరాయుళ్లు , మంత్రి లోకేశ్‌తో క్లబ్ నిర్వాహకుడు కాట్రగడ్డ అశోక్ (ఫైల్)
రిక్రియేషన్ ముసుగులో భారీ క్లబ్ నడుపుతున్న టీడీపీ నేత
చినబాబు మనుషులమంటూ హడావుడి
హైకోర్టు ఆర్డర్ ఉందంటూ ఫ్లెక్సీ ఏర్పాటు
రెండు నెలలుగా ఆగిరిపల్లిలోని మామిడి తోటలో పేకాట దందా
పోలీసుల దాడిలో 281 మంది జూదరుల అరెస్టు
రూ.32 లక్షల నగదు స్వాదీనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/నూజివీడు: తెలుగు తమ్ముళ్ళు పేకాట డాన్లుగా మారిపోయారు. పచ్చని మామిడి తోటల మధ్య రిక్రియేషన్ క్లబ్ ముసుగులో భారీ జూద శిబిరం నిర్వహణకు తెరతీశారు. స్థానికుల నిరసనలు, ఇతరత్ర అంశాలను లెక్కచేయకుండా లోకేశ్ బాబు టీమ్ అంటూ హడావుడి చేశారు. స్థానిక మంత్రి నుంచి లోకేశ్ వరకు అందరి అండదండలతోనే క్లబ్ నిర్వహిస్తున్నామంటూ జూదరుల వద్ద ప్రచారం చేశారు. పోలీసుల దాడులు, కేసులు ఉండవని చెప్పడంతోపాటు హైకోర్టు ఉత్తర్వులకు లోబడి పేకాట నిర్వహిస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరీ నిర్వహిస్తున్న క్లబ్‌పై ఆదివారం సాయంత్రం పోలీసులు మెరుపుదాడి చేశారు. కట్ చేస్తే.. 4 జిల్లాలకు చెందిన 281 మంది జూదరులు అరెస్టయ్యారు.
130 కార్లు, 40 బైక్‌లను సీజ్ చేసిన పోలీసులు చివరికి రూ.32 లక్షలు నగదును మాత్రమే గుర్తించినట్టు ప్రకటించారు. ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో 20 ఎకరాల మామిడి తోటలో మ్యాంగో బై కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ కిలారు అప్పారావు అధ్యక్షుడిగా ఏర్పాటైంది. 2011 నుంచి 2018 వరకు రిక్రియేషన్ ముసుగులో అడపాదడపా పేకాట శిబిరాలు నిర్వహించారు. 2019 ప్రారంభంలో రెండు మూడు సార్లు పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేయడంతో క్లబ్‌ను మూసివేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో రిట్ పిటిషన్ 18807/2019 నంబర్‌తో పేకాటకు అనుమతించాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చారు. ఉత్తర్వులను సాకుగా చూపి భారీ జూద శిబిరం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు.
అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జూదశిబిరం ప్రారంభం కాకుండా ఉక్కుపాదం మోపింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్లబ్ ప్రారంభించడానికి భారీ లాబీయింగ్‌కు తెర తీశారు. ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్న కాట్రగడ్డ అశోక్ కుమార్ రింగ్ లీడర్‌గా మారి పేకాట క్లబ్‌ను ఈ ఏడాది అక్టోబర్ 28న ప్రారంభించడానికి సన్నాహాలు చేశాడు. ఈ క్రమంలో ఆగిరిపల్లి యువకులు నిరసనలు, ఆందోళనలు చేయడంతో నిలిచిపోయింది. మళ్ళీ వారం రోజుల వ్యవధిలో నవంబర్ మొదటి వారంలో ప్రారంభించారు. ప్రారంభానికి ముందే నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి మొదలుకొని స్థానిక పోలీసుల వరకు అందరితో మాట్లాడేసి అందరినీ చక్కబెట్టామని చెప్పి పేకాట ప్రారంభించారు. జూదరులు క్లబ్‌కు రావడానికి వీలుగా క్లబ్ వద్ద హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కల్చరల్ రిక్రియేషన్ సొసైటీ నడుస్తోందంటూ కోర్టు కేసుల నంబర్ల వివరాలు సహా క్లబ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి జూదరులకు ప్రత్యేకంగా సమాచారమిచ్చి క్లబ్‌కు వచ్చేలా ఏర్పాటు చేసి దాదాపు 55 రోజులకుపైగా నిర్వహిస్తున్నారు. రూ.10 వేల నుంచి లక్ష వరకు వారాంతాల్లో వీటితో పాటు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 26 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నగదు స్వీకరించి కాయిన్స్ ఇవ్వడానికి వీలుగా ఏడు డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేసి రోజూ కోట్లలో పేకాట నిర్వహిస్తున్నారు. దీనికి గాను స్థానిక ఎస్‌ఐ నుంచి మంత్రి వరకు నెలవారీ ముడుపులు చెల్లిస్తున్నామని క్లబ్‌లో బహిరంగంగా చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేసి సొసైటీ అధ్యక్షుడు కిలారు అప్పారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాట్రగడ్డ అశోక్‌కుమార్‌తోపాటు 281 మంది జూదరులను అరెస్టుచేశారు.
లోకేశ్ సన్నిహితుడిగా ప్రచారం
విజయవాడ నగరానికి చెందిన కాట్రగడ్డ అశోక్‌కుమార్ టీడీపీలో క్రియాశీలక నాయకుడు. మంత్రి లోకేశ్ సొంత మనిషినంటూ ఆగిరిపల్లిలో విస్తృత ప్రచారం చేసుకున్నాడు. గతంలో యువగళం పాదయాత్రలో కూడా పాల్గొన్నాడు. అరెస్టు నేపథ్యంలో 15 రోజుల్లో మళ్ళీ క్లబ్ ప్రారంభిస్తానని, అందరికీ తన సంగతి తెలుసునంటూ పోలీసుల వద్ద మాట్లాడినట్టు సమాచారం. ఆదివారం రాత్రి మెరుపు దాడి నిర్వహించి రూ.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరుల పూర్తి వివరాలు అన్నీ క్లబ్‌లోనే పూర్తి చేసి సోమవారం రాత్రి కోర్టుకు హాజరుపరిచారు.
జూదరుల తరఫున ఆందోళన
జూదరులపై సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. అక్కడ ఉన్న సామగ్రిని స్వాధీనం చేసుకుని కోర్టు ముందు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ మ్యాంగో బే క్లబ్ వద్దకు వచ్చి ఐదు బస్సుల్లో జూదరులను నూజివీడు కోర్టుకు తరలించారు. కాగా, అంతకముందు 24 గంటలు గడిచినా మ్యాంగో బే క్లబ్‌లో పేకాట ఆడుతూ పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరచకపోవడంపై జూదరుల తరఫున కొందరు రోడ్డుపై ఆందోళనకు దిగారు.


