సాక్షి, అమరావతి: ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్రం కీలక మార్పులు చేసి కొత్తగా వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ పేరుతో చేపట్టే కార్యక్రమంపై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు 26న అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభ నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సూచించారు.
మార్పులతో కూడిన కొత్త ఉపాధి చట్టానికి రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర గ్రామీణాభిృద్ధి శాఖ అధికారులు రాష్ట్రాల ప్రతినిధులకు కొత్త చట్టంలోని ప్రధాన ప్రతిపాదనలను గురించి వివరించారు. ప్రతి కుటుంబానికి ఏటా ప్రస్తుతం వంద పనిదినాలకు మాత్రమే అవకాశం ఉండగా, కొత్త చట్టంలో ఏడాదికి 125 పనిదినాలకు అవకాశం ఉన్న అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త ఉపాధిహామీ పథకంపై 26న రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు.


