breaking news
Employment Act
-
26న కొత్త ‘ఉపాధి’ చట్టంపై ప్రత్యేక గ్రామసభలు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్రం కీలక మార్పులు చేసి కొత్తగా వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ పేరుతో చేపట్టే కార్యక్రమంపై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు 26న అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభ నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సూచించారు.మార్పులతో కూడిన కొత్త ఉపాధి చట్టానికి రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర గ్రామీణాభిృద్ధి శాఖ అధికారులు రాష్ట్రాల ప్రతినిధులకు కొత్త చట్టంలోని ప్రధాన ప్రతిపాదనలను గురించి వివరించారు. ప్రతి కుటుంబానికి ఏటా ప్రస్తుతం వంద పనిదినాలకు మాత్రమే అవకాశం ఉండగా, కొత్త చట్టంలో ఏడాదికి 125 పనిదినాలకు అవకాశం ఉన్న అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త ఉపాధిహామీ పథకంపై 26న రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. -
చెరువులకు అమృత్ యోగం
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో అమృత్ సరోవర్ పథకం ద్వారా కొత్త చెరువుల తవ్వకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకం ద్వారా వీటి తవ్వకం జరగనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఎకరా స్థలంలో కొత్త చెరువుల నిర్మాణం జరగనుంది. నీటి ఒరవ ఉన్న ప్రాంతంలో ఇలాంటి వాటిని తవ్వనున్నారు. కొత్త చెరువుల తవ్వకానికి స్థలం దొరకని చోట ఉన్న పాతవి ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే 50 నుంచి 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల పరిధిలోని 96 చెరువులను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ పనులకు సంబం«ధించిన ప్రతిపాదనలు సైతం జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. ఇప్పటికే 86 చెరువులకు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. మిగిలిన వాటిని త్వరలోనే మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో జంగిల్ క్లియరెన్స్, పూడికతీత, బౌండరీల నిర్మాణం, చెరువు సరిహద్దు వెంబడి మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ప్రభుత్వం పూడికతీతలో భాగంగా తవ్వే మట్టిని అవసరమైన రైతులు తమ సొంత ఖర్చులతో పొలాలకు తరలించుకునే వెసలుబాటు కల్పించారు. చెరువు కమిటీల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. రూ. 8.24 కోట్ల నిధులతో చెరువుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే 81 చెరువుల పరిధిలో పనులు మొదలయ్యాయి. మిగిలిన చోట త్వరలోనే మొదలు కానున్నాయి. ఉపాధి హామీ కూలీలతోనే చెరువుల నిర్మాణ పనులు జరగనున్నాయి. కూలీల కోసం రూ. 7.47 కోట్ల నిధులు వెచ్చించనున్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ. 77.296 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే పనులు మొదలుకాగా 2022 ఆగస్టు నాటికి కొన్ని చెరువు పనులను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 2023 ఆగస్టు నాటికి మిగిలిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చెరువుల అభివృద్ధితో జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతోపాటు పెద్ద ఎత్తున భూగర్బ జలాలు పెంపొందనున్నాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చెరువుల నిర్మాణ పనులు జరగనున్నాయి. 8అటవీశాఖ పరిధిలో 126 పనులు అమృత్ సరోవర్‌లో భాగంగా అటవీశాఖ పరిధిలో పెద్ద ఎత్తున పనులు చేపట్టనున్నారు. ప్రధానంగా అట్లూరు, సిద్దవటం, కాశినాయన, సీకే దిన్నె, పెండ్లిమర్రి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇప్పటికే 16 ట్యాంకులను గుర్తించారు. ఇవి కాకుండా మరో 110 పర్కులేషన్, మినీ పర్కులేషన్ ట్యాంకులను సైతం గుర్తించారు. వీటికి సంబంధించి అటవీశాఖ అంచనాలను రూపొందించి జిల్లా కలెక్టర్‌కు పంపనుంది. అనంతరం సదరు పనులను మంజూరు చేయనున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతోనే ఈ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం సుమారు రూ. 3 కోట్లకు పైగా నిధులను వెచ్చించనున్నారు. జిల్లాలో చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం శ్రీకారం చుట్టడం, తద్వారా ఉపాధి హామి కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించే చర్యలు చేపట్టడంతో రైతులు, కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు అమృత సరోవర్ పథకం కింద ఉపాధి హామీ నిధులతో జిల్లాలో 96 చెరువులను అభివృద్ది చేస్తున్నాం. ఎకరా విస్తీర్ణంలో కొత్తవి నిర్మిస్తున్నాం. స్థలం అందుబాటులో లేని దగ్గర ఉన్న పాత చెరువులను అభివృద్ధి చేస్తున్నాము. వీలైనంత త్వరగా చెరువుల పనులను పూర్తి చేయనున్నాం. దీనివల్ల మరింత ఆయకట్టు సాగులోకి రానుంది. – విజయరామరాజు, జిల్లా కలెక్టర్ ఉపాధిహామీ నిధులతో చెరువుల అభివృద్ధి పనులు ప్రభుత్వం అమృత్ సరోవర్ కింద కొత్త చెరువుల నిర్మాణంతోపాటు పాతవి అభివృద్ది చేస్తోంది.డ్వామా ఆధ్వర్యంలో ఉపాధి కూలీల ద్వారా ఈ పనులు చేపట్టాం. ఇందుకోసం రూ. 8.24 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. చెరువుల అభివృద్ధితో భూగర్భజలాలు పెరగనున్నాయి. – యదుభూషణరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, కడప -
‘ఉపాధి’పై బాబు దబాయింపు
♦ ఉపాధి చట్టంపై వక్రభాష్యాలు... ప్రతిపక్ష నేతపై వ్యాఖ్యలు ♦ కూలీల వేతనాలకు కనీసం 60% ఖర్చు చేయాలంటున్న చట్టం ♦ చట్టంలో గరిష్ట పరిమితి లేదు... ♦ మెటీరియల్ కాంపొనెంట్ గరిష్టంగా 40% మించరాదు ♦ వైఎస్ హయాంలో 97 శాతం నిధులు వేతనాలకే.. ♦ 100 శాతం నిధులు కూలీలకే ఖర్చుచేస్తున్న తమిళనాడు సాక్షి, హైదరాబాద్: కరువు చుట్టుముట్టిన కష్టకాలంలో రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల విషయంలో చట్టాలు, కండిషన్లు మాట్లాడడం పాలకులకు విదాయకమేనా? కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఉపాథిహామీ నిధులలో కూలీల వేతనాలకు 60శాతం, మెటీరియల్ ఖర్చులకు 40శాతం ఖర్చుపెట్టాల్సి ఉందని ఆయన వాదించడం ఈ కోవలోకే వస్తుంది. ముఖ్యమంత్రి పేదలకు హామీ ఇచ్చే రీతిలో కాకుండా ప్రతిపక్షంపై దబాయింపునకు దిగడం విశేషం. ఉపాధి హామీ పథకం ప్రస్తావనలో భాగంగా 40 శాతం మెటీరియల్ కాంపొనెంట్‌పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ...ఇది కేంద్రం తెచ్చిన చట్టమని, ప్రతిపక్షనేతకు ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అని అన్నారు. దీనికి జగన్మోహన్రెడ్డి ఒక్కసారి క్లారిఫికేషన్ చదివి వినిపించారు. ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలకు కనీసం 60 శాతం ఖర్చు చేయాలనేది నిబంధన అని, అంటే గరిష్టంగా దానికి మించి ఎంతైనా ఖర్చు చేయవచ్చునని అన్నారు. దానర్థం 40 శాతం మెటీరియల్ కాంపొనెంట్ విధిగా వాడుకోవాలని కాదని అన్నారు. ఓవైపు క్లారిఫికేషన్ ఇస్తూండగానే స్పీకర్ మైక్ కట్‌చేశారు. ఉపాధి చట్టం ఏం చెబుతోంది? నిజానికి చట్టం అలాంటి కండిషన్ ఏదీపెట్టలేదు. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికిచ్చే నిధులలో కూలీల వేతనాలకే గరిష్టభాగం ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం -2005లోని లేబర్ బడ్జెట్ ఛాప్టర్ 8.4.4 నిబంధనలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధన ప్రకారం ఉపాథి నిధులలో కూలీలకు కనీసం 60 శాతం (గరిష్టంగా ఎంతయినా కావచ్చు), మెటీరియల్ అవసరాలకు గరిష్టంగా 40 శాతం (అంతకు మించరాదు) ఖర్చు పెట్టుకోవచ్చని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇది పూర్తిగా తిరగబడుతోంది. ఈ ఏడాది కేంద్రం మన రాష్ట్రానికిచ్చిన నిధులలో ఎక్కువ భాగం మెటీరియల్ వినియోగం పేరిట సిమెంట్‌రోడ్లు, నీరు- చెట్టు పథకానికి కేటాయించారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ఎత్తిచూపారు. సీసీ రోడ్ల నిర్మాణానికి బదులు కేంద్ర నిధులలో అధికభాగాన్ని కూలీల వేతనాలకు ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అయితే అధికారపక్షం మాత్రం యథాప్రకారం ఎదురుదాడికి దిగింది. తమిళనాడులో పదేళ్లుగా వంద శాతం నిధులు పేదలకే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉపాధి పథకంలో కేంద్రం ఆ రాష్ట్రానికిచ్చే నిధులలో వంద శాతం పేదల కూలీల వేతనంగా చెల్లిస్తున్నారు. ఎక్కడైనా మెటీరియల్ అవసరాలకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులుంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరుగా నిధులు కేటాయించి ఈ పథకంలో మెటీరియల్ అవసరాలకు ఉపయోగిస్తున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు.


