చెరువులకు అమృత్ యోగం | Digging Of Ponds Under Amrit Sarovar Scheme Started In Kadapa | Sakshi
Sakshi News home page

చెరువులకు అమృత్ యోగం

Published Sat, Jun 18 2022 11:29 PM | Last Updated on Sun, Jun 19 2022 8:22 AM

Digging Of Ponds Under Amrit Sarovar Scheme Started In Kadapa - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో అమృత్‌ సరోవర్‌ పథకం ద్వారా కొత్త చెరువుల తవ్వకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకం ద్వారా వీటి తవ్వకం జరగనుంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఎకరా స్థలంలో కొత్త చెరువుల నిర్మాణం జరగనుంది. నీటి ఒరవ ఉన్న ప్రాంతంలో ఇలాంటి వాటిని తవ్వనున్నారు.

కొత్త చెరువుల తవ్వకానికి స్థలం దొరకని చోట ఉన్న పాతవి ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే 50 నుంచి 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల పరిధిలోని 96 చెరువులను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ పనులకు సంబం«ధించిన ప్రతిపాదనలు సైతం జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.

ఇప్పటికే 86 చెరువులకు జిల్లా కలెక్టర్‌ పరిపాలన అనుమతులు ఇచ్చారు. మిగిలిన వాటిని త్వరలోనే మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో జంగిల్‌ క్లియరెన్స్, పూడికతీత, బౌండరీల నిర్మాణం, చెరువు సరిహద్దు వెంబడి మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ప్రభుత్వం పూడికతీతలో భాగంగా తవ్వే మట్టిని అవసరమైన రైతులు తమ సొంత ఖర్చులతో పొలాలకు తరలించుకునే వెసలుబాటు కల్పించారు.

చెరువు కమిటీల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. రూ. 8.24 కోట్ల నిధులతో చెరువుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే 81 చెరువుల పరిధిలో పనులు మొదలయ్యాయి. మిగిలిన చోట త్వరలోనే మొదలు కానున్నాయి. ఉపాధి హామీ కూలీలతోనే చెరువుల నిర్మాణ పనులు జరగనున్నాయి. కూలీల కోసం రూ. 7.47 కోట్ల నిధులు వెచ్చించనున్నారు. మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద మరో రూ. 77.296 లక్షలు ఖర్చు చేయనున్నారు.

ఇప్పటికే పనులు మొదలుకాగా 2022 ఆగస్టు నాటికి కొన్ని చెరువు పనులను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 2023 ఆగస్టు నాటికి మిగిలిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చెరువుల అభివృద్ధితో జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతోపాటు పెద్ద ఎత్తున భూగర్బ జలాలు పెంపొందనున్నాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చెరువుల నిర్మాణ పనులు జరగనున్నాయి. 

8అటవీశాఖ పరిధిలో 126 పనులు 
అమృత్‌ సరోవర్‌లో భాగంగా అటవీశాఖ పరిధిలో పెద్ద ఎత్తున పనులు చేపట్టనున్నారు. ప్రధానంగా అట్లూరు, సిద్దవటం, కాశినాయన, సీకే దిన్నె, పెండ్లిమర్రి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇప్పటికే 16 ట్యాంకులను గుర్తించారు. ఇవి కాకుండా మరో 110 పర్కులేషన్, మినీ పర్కులేషన్‌ ట్యాంకులను సైతం గుర్తించారు. వీటికి సంబంధించి అటవీశాఖ అంచనాలను రూపొందించి జిల్లా కలెక్టర్‌కు పంపనుంది.

అనంతరం సదరు పనులను మంజూరు చేయనున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతోనే ఈ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం సుమారు రూ. 3 కోట్లకు పైగా నిధులను వెచ్చించనున్నారు. జిల్లాలో చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం శ్రీకారం చుట్టడం, తద్వారా ఉపాధి హామి కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించే చర్యలు చేపట్టడంతో రైతులు, కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు  
అమృత సరోవర్‌ పథకం కింద ఉపాధి హామీ నిధులతో జిల్లాలో 96 చెరువులను అభివృద్ది చేస్తున్నాం. ఎకరా విస్తీర్ణంలో కొత్తవి నిర్మిస్తున్నాం. స్థలం అందుబాటులో లేని దగ్గర ఉన్న పాత చెరువులను అభివృద్ధి చేస్తున్నాము. వీలైనంత త్వరగా చెరువుల పనులను పూర్తి చేయనున్నాం. దీనివల్ల మరింత ఆయకట్టు సాగులోకి రానుంది. 
– విజయరామరాజు, జిల్లా కలెక్టర్‌ 
 
ఉపాధిహామీ నిధులతో చెరువుల అభివృద్ధి పనులు 
ప్రభుత్వం అమృత్‌ సరోవర్‌ కింద కొత్త చెరువుల నిర్మాణంతోపాటు పాతవి అభివృద్ది చేస్తోంది.డ్వామా ఆధ్వర్యంలో ఉపాధి కూలీల ద్వారా ఈ పనులు చేపట్టాం. ఇందుకోసం రూ. 8.24 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. చెరువుల అభివృద్ధితో భూగర్భజలాలు పెరగనున్నాయి.     
– యదుభూషణరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, కడప  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement