చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న మామిడి రైతులు
చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన చిత్తూరు మామిడి రైతులు
పోలీసులను ఉసిగొల్పి తమను అణచివేస్తోందని ఆగ్రహం
40 ఫ్యాక్టరీల కోసం 40 వేలమందిని రోడ్డున పడేశారు
4.30 లక్షల టన్నుల పంట తోలి 7 నెలలైనా అతీగతి లేని వైనం
నేతలకు చెప్పినా.. ఫ్యాక్టరీల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం
విసుగెత్తి చిత్తూరు కలెక్టరేట్‌ను ముట్టడించిన మామిడి రైతులు
మోసగిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిక... ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్
మామిడి రైతులంటే ఎందుకింత చులకన?
మామిడి రైతుల పట్ల బాబు ప్రభుత్వానికి చులకన భావం తగదు. కష్టాన్ని నమ్ముకుని చెమటోడ్చి పంటలు పండించే అన్నదాతలను పట్టించుకోకపోవడం దారుణం. మామిడి రైతులకు పరిశ్రమలు ఇవ్వాల్సిన డబ్బు ఇప్పించకపోవడం ఎంతవరకు సబబు? వెంటనే నగదును చెల్లించేలా చర్యలు చేపట్టాలి. – మునిరత్నంనాయుడు, మామిడి రైతు
చిత్తూరు కలెక్టరేట్: ‘‘ఆశించిన స్థాయిలో పంట చేతికొస్తే గిట్టుబాటు ధర లేకుండా చేశారు. తోతాపురి కిలోకు ఫ్యాక్టరీలు రూ.8, ప్రభుత్వం రూ.4 చొప్పున మొత్తం రూ.12 చెల్లిస్తామని మాటిచ్చాయి. 4.30 లక్షల టన్నుల పంటను ఫ్యాక్టరీలకు పంటను తోలి ఏడు నెలలవుతోంది. ఇంకా బకాయిలు చెల్లించలేదు. నాయకులకు చెప్పినా, ఫ్యాక్టరీల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. బకాయిలు అడుగుతుంటే ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి గొడవలు పెట్టుకునేలా చేస్తోంది. ఇది ఎంతవరకు సమంజసం చంద్రబాబూ?’’ అని మామిడి రైతులు మండిపడ్డారు. వెంటనే బకాయిలు చెల్లించాలంటూ రైతు సంఘం నాయకులు, రైతులు సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు.
మిన్నంటేలా నినాదాలు చేశారు. సమస్య చెప్పుకొనేందుకు ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకునేందుకు ప్రయతి్నంచడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మైక్ పెట్టకుండా అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. అనంతరం రైతులు మాట్లాడుతూ... మళ్లీ మామిడి సీజన్‌కు పెట్టుబడుల సమయం వచ్చిందని, పరిశ్రమలు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడు నెలలుగా ఇవ్వకపోవడం దుర్మార్గంగా అభివరి్ణంచారు. కిలోకు రూ.8 ఇవ్వని ఫ్యాక్టరీలను సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారని గుర్తుచేశారు. ఇప్పటికి ఆరుసార్లు కలెక్టర్‌కు వినతిపత్రాలు సమరి్పంచామని పేర్కొన్నారు.
ఫ్యాక్టరీలకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
చిత్తూరు జిల్లాలోని 40 మామిడి ఫ్యాక్టరీలకు కొమ్ముకాస్తూ 40 వేల మందిని చంద్రబాబు ప్రభుత్వం రోడ్డున పడేసిందని రైతులు నిప్పులు చెరిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు కచ్చితంగా కిలోకు రూ.8 ఇస్తాయని చిత్తూరు కలెక్టర్ ఉత్తర్వులిచ్చారని, అవి అమలుకు నోచుకోనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నంచారు. 40 ఫ్యాక్టరీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయా? అని నిలదీశారు. తమను మోసగిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు.. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నాకు పలు
ప్రాంతాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా మామిడి రైతుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మునీశ్వరరెడ్డి, మురళీ, ఉపాధ్యక్షులు హేమలత, నాయకులు రామానాయుడు రైతులతో పాటు ఆందోళనలో పాల్గొన్నారు. పరిశ్రమల వద్ద నిల్వ ఉన్న మామిడి పల్ప్‌ను టీటీడీ, విద్యార్థులు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు సూచించారు. రైతులను మోసగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాం«దీకి వినతిపత్రం అందజేశారు.
సంక్రాంతి వరకు సమయం ఇస్తున్నాం
ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన రూ.8 నగదు చెల్లించేందుకు సంక్రాంతి వరకు సమయం ఇస్తున్నామని రైతులు తెలిపారు. ఆలోపు డబ్బు వేయకపోతే గ్రామాల్లో ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయిస్తామని హెచ్చరించారు. ‘‘మామిడి పంటను నమ్ముకున్న మేము దారుణ స్థితిలో ఉన్నాం. పంటను అమ్ముకోలేక, అమ్మిన పంటను డబ్బు చేసుకోలేక తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ ఏడాది గిట్టుబాటు ధర పొందలేకపోయాం. ఫ్యాక్టరీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అజమాయిషీ చేయడం లేదు?రూ.350 కోట్లకు పైగా ఉన్న ఫ్యాక్టరీల బకాయిలపై ఎందుకు నోరు మెదపడం లేదు. పంటను తోలాక 15 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించాలి. దానిని పాటించకుండా మా కష్టాన్ని దోచుకుంటున్నారు’’ అని వాపోయారు.
నగదు ఎందుకివ్వరు..?
ఫ్యాక్టరీ యజమానులు నగదును ఎందుకు చెల్లించరు? ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో ఫ్యాక్టరీల యజమానులు డబ్బు వేయలేదు. మరి ఇంకెప్పుడు ఇస్తారు...? మొదట్లో ఒక మాట మామిడి పంట ఫ్యాక్టరీలకు తోలిన తర్వాత మరో మాట చెప్పి మోసగించడం దారుణం. ఏటా ఇదే తంతు. పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కలెక్టర్ చొరవ తీసుకోవాలి. – త్యాగరాజులురెడ్డి, మామిడి రైతు
నెలలు గడుస్తున్నా స్పందించరా?
కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారంరైతులకు ఫ్యాక్టరీ యజమానులు కిలోకు రూ.8 ఇచ్చి తీరాల్సిందే. తక్కువైతే సహించేది లేదు. నెలలు గడుస్తున్నా నగదు ఇవ్వకపోవడంతో ఆందోళన చేపడుతున్నాం. సంక్రాంతిలోగా బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం. – మురళి, మామిడి రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
ఊరుకునేది లేదు
రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు. మాకు ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా రూ.8 చొప్పున ఇవ్వాలి. ర్యాంపులలో అతి తక్కువగా రేట్లు ఇచ్చారు. వాటన్నింటినీ పరిశీలించి రూ.8 చెల్లించేలా చర్యలు చేపట్టాలి. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం. జిల్లాలోని 40 ఫ్యాక్టరీల యజమానులు నగదు చెల్లించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. – ఉమాపతినాయుడు, మామిడి రైతు


