సాక్షి, కృష్ణా జిల్లా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మహిళా రైతులు మండిపడ్డారు. కోడూరు మండలంలో మోంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పవన్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఆదర్శ రైతులను పట్టించుకోని పవన్ కళ్యాణ్.. దెబ్బతిన్న పంటలను తూతూ మంత్రంగా పరిశీలించారు.
తమ కష్టాలను వినకుండా.. తమకు కలిసే అవకాశం ఇవ్వకపోవడంపై మహిళలు మండిపడ్డారు. కేవలం ఒకే రైతు కుటుంబంతో మాట్లాడితే అందరి సమస్యలు ఎలా తెలుస్తాయంటూ మండిపడ్డారు. మా ఓట్లు కావాలి.. కానీ మా సమస్యలు మీకు పట్టవా అంటూ నిలదీశారు.
మరోవైపు, పవన్ కల్యాణ్ జిల్లా పర్యటన వేళ.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోడూరు-అవనిగడ్డ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. ట్రాఫిక్ మళ్లింపుపై జనాలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, పైగా చుట్టు తిరిగి రావాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కోడూరు మండలంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించారు. అయితే.. ఆయన పర్యటన కోసం పోలీసులు విధించిన డైవర్షన్ జనాలు 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.


