రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు చాన్స్
రెండు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం ఏపీలోని అంతర్వేదిపాలెం వద్ద మోంథా తీరాన్ని తాకింది. ఈ తుపాను ప్రభావం తెలంగాణపైనా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. ఈమేరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని చాలాప్రాంతాల్లో భారీ వర్షాలు, అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది.
రాష్ట్రంలో మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ జిల్లాలో తక్షణ సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. బుధవారం కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఎక్కడెక్కడ ఏ అలర్ట్?
రెడ్ అలర్ట్: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం
ఆరెంజ్ అలర్ట్: మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్,
ఎల్లో అలర్ట్: కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్
36 విమానాలు రద్దు
శంషాబాద్: మోంథా తుపాను ప్రభావం విమానాల రాకపోకలపై పడింది. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి మంగళవారం రాకపోకలు సాగించే 36 విమానాలు రద్దయినట్లు ఎయిర్‌పోర్టువర్గాలు వెల్లడించాయి. ఎయిరిండియా, ఇండిగో విమానాలు సర్వీసులను రద్దు చేసినట్లు ముందస్తు సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.
మూసీకి పెరుగుతున్న వరద
మణికొండ: హైదరాబాద్‌లో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లకు పైనుంచి వరద పెరుగుతోంది. భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు జలాశయాల గేట్లు తెరచి మూసీనదికి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.

సాయంత్రానికి గండిపేటకు పైనుంచి 1,600 క్యూసెక్కుల వరద వస్తుండగా 2,732 క్యూసెక్కుల నీటిని మూసీకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్‌కు పైనుంచి 1,600 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 3,963 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.


