 
															జలదిగ్బంధంలో హనుమకొండలోని టీఎన్‌జీఓస్ కాలనీ ఫేజ్–2, జవహర్ కాలనీలు
చెరువులను తలపించిన కాలనీలు
ఇళ్లలోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు
పడవల సాయంతో కాపాడిన డీఆర్‌ఎఫ్ బృందాలు
లోతట్టు ప్రాంతాల్లో మంత్రి, ఎంపీ, కలెక్టర్‌ల పర్యటన
చెరువులు, నాలాల ఆక్రమణలతోనే ఏటా ఈ పరిస్థితి
వర్షాలకు పలు జిల్లాల్లో ఆరుగురు మృతి.. పలువురు గల్లంతు
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం ఏరియల్ సర్వే
సాక్షి, నెట్‌వర్క్: మోంథా తుపాను దెబ్బకు వరంగల్ నగరం కన్నీరు పెడుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కురిసిన కుంభవృష్టితో వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని 141 కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. గురువారం కూడా కాలనీలు, రహదారులపై మోకాలిలోతు నీళ్లు నిలిచి ఉండటంతో జనజీవనం స్తంభించింది. ఇళ్లలోకి వరద నీరు చేరి నిత్యావసరాలు, విలువైన వస్తువులన్నీ తడిసిపోవటంతో ప్రజలు ఆకలిదప్పులతో అలమటించే పరిస్థితి ఏర్పడింది. 
ముంపు బాధితులను డీఆర్‌ఎఫ్, ఎస్‌జీఆర్‌ఎఫ్, పీజీ ఎఫ్‌టీ బృందాలు పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించాయి. ఇళ్ల పైకప్పులపై తలదాచుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు. గురువారం సాయంత్రానికి వరదనీరు తగ్గినా బురద ఉండడంతో దుర్వాసనతో ప్రజలకు తిప్పలు తప్పలేదు. ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ఇంట్లోకి వరద నీరు చేరడంతో అనారోగ్యానికి గురై మంచంలో ఉన్న వ్యక్తి నీటిలో పడి చనిపోయాడు.  
ప్రముఖుల పర్యటన: వరంగల్‌లోని ఎన్‌ఎన్ నగర్, బీఆర్ నగర్‌లో మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ సత్యశారద గురువారం పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. రామన్నపేటలో మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ అలంకార్ జంక్షన్‌లో వరదనీటి ప్రవాహ తీరును కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. నయీంనగర్ బ్రిడ్జి, జవహర్ కాలనీ, దేవరాజ్ కాలనీ, వడ్డెపల్లి శ్యామల గార్డెన్ ప్రాంతాల్లో బల్దియా కమిషనర్ పర్యటించారు. ఎంపీ కడియం కావ్య లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిచ్చారు.  
ఒక్కసారిగా తన్నుకొచ్చిన వరద: ఐనవోలు మండలం కొండపర్తి చెరువు కట్టకు గండిపడంతో ఆ నీళ్లంతా కొత్తపల్లి, భట్టుపల్లి చెరువు నుంచి నేరుగా బొందివాగు నాలా ద్వారా హంటర్ రోడ్డు పరిసరాలను ముంచెత్తింది. బంధం చెరువు, బెస్తం చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువుల మత్తళ్లు పొంగి నగరాన్ని ముంచెత్తాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి వచ్చిన నీళ్లలో యువకులు వలలు వేసి చేపలు పట్టారు. 
ఆక్రమణలే సమస్యకు కారణం.. 
వరంగల్ నగరం ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతోంది. ముఖ్యంగా బెస్తం చెరువు, ఉర్సు రంగ సముద్రం, బంధం చెరువు, వడ్డెపల్లి చెరువు, గోపాల్‌పూర్ చెరువు, చిన్నవడ్డెపల్లి చెరువు, బొందివాగు నాలా, కట్టమల్లన్న నుంచి చిన్నవడ్డెపల్లికి వచ్చే నాలా, అగర్తాలా నాలా, సాకారాశి కుంట నాలా తదితర నీటి వనరులు అక్రమణకు గురికావడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. సరైన మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ లేకపోవడం కూడా ముంపునకు కారణమవుతోంది. 
రూ.100 కోట్లతో నయీంనగర్ నాలాను పటిష్టం చేయటంతో కొన్ని కాలనీలు వరద ముంపు నుంచి తప్పించుకున్నాయి. 2020 సెపె్టంబర్‌లో భారీ తుపాన్‌కు వరంగల్ నగరంలో వరద ముంచెత్తి ఏడుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. 171 కాలనీలు వారం రోజులపాటు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఐదేళ్ల తరువాత మోంథా తుపాను వరంగల్‌ను అతలాకుతలం చేసింది. నగరంలోని 141 కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి.  
నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే...  
నీట మునిగిన వరంగల్ మహానగరం సహా ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అకాల వర్షం, వరదలపై ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ లో పర్యటిస్తానని తెలిపారు.  
భయం గుప్పిట్లోనే పరీవాహకం 
మోంథా తుపాన్ ప్రభావంతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాల్వ ఒడ్డు వద్ద మున్నేటి వరద ప్రవాహం గురువారం సాయంత్రం 5 గంటలకు 25.80 అడుగుల మేర నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం లేకున్నా మున్నేరుకు వరద పెరుగుతుండడంతో పరీవాహక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 
వరద ఉధృతి దృష్ట్యా బుధవారం సాయంత్రం నుంచే కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గురువారం వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లి గుడి వెనుక రోడ్డు, ధంసలాపురం కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఖమ్మం నయాబజార్ కళాశాలకు 100 కుటుంబాలు, ధంసలాపురం పాఠశాలకు 30 కుటుంబాలను తరలించారు. ఖమ్మం–బోనకల్ రహదారిపై నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి.
 
ఐదుగురు మృతి.. పలువురు గల్లంతు 
మోంథా తుపాన్ ప్రభావంతో వాగులు, వంకలు ఉప్పొంగటంతో ముగ్గరు వ్యక్తులు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) బుధవారం సాయంత్రం హనుమకొండలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రామానికి వెళ్లే కల్వర్టు వద్ద వరదనీటిలో పడి చనిపోయాడు. వరంగల్ నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన అడపా కృష్ణమూర్తి అనే వృద్ధుడు వరదనీటిలో పడి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులో కోల రామక్క (80) ఇంట్లో పడుకోగా వర్షానికి గోడ కూలి చనిపోయింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గట్టుకిందిపల్లెకు చెందిన పులి అనిల్ (30) ఖిలావరంగల్ సమీపం చింతల్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై బైక్‌పై వెళ్తుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. హైదరాబాద్ నుంచి బైక్‌పై వస్తున్న ఓ ప్రేమజంట జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలో వరదలో చిక్కుకుంది. 
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడేపల్లికి చెందిన బరిగెల శివకుమార్ కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి శివకుమార్ బైక్‌తో సహా కొట్టుకుపోతుండగా శ్రావ్య అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి వరదలో పడిపోయింది. శివకుమార్ చెట్టుకొమ్మల సహాయంతో ప్రాణం కాపాడుకోగా, గల్లంతైన శ్రావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
భీమదేవరపల్లి మండలానికి చెందిన ప్రణయ్ (28), కల్పన (24) దంపతులు బుధవారం బైక్‌పై సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు వెళ్తుండగా మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రస్తుతం కల్పన గర్భవతిగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి ఆరా తీశారు. దంపతుల బాధిత కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓదార్చారు. 
మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్ (30) జంపన్నవాగు (చిన్నవాగు) కల్వర్టుపై వరదలో గల్లంతయ్యాడు. గురువారం గాలింపు చేపట్టగా వాగుకు కొంతదూరంలో సంపత్ మృతదేహం లభ్యమైంది. అదేవిధంగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో తన ఇంటిలో పడుకున్న గద్దల సూరమ్మ (58)పై గురువారం తెల్లవారుజామున గోడ కూలి పడడంతో చనిపోయింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్లలోని కోళ్ల ఫారాల్లో వర్షాలతో సుమారు 15 వేల కోళ్లు మృతి చెందాయి. 
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన బోళ్ల కుమారస్వామికి చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో పొలానికి వెళ్లిన రైతులు బుధవారం దుందుభి వాగు మధ్యలో చిక్కుకుపోయారు. తాడు సహాయంతో పోలీసు సిబ్బంది అవతలి ఒడ్డుకు చేరుకొని గురువారం రైతులకు ఆహారం అందజేశారు. వారు రెండు రోజులు అక్కడే ఉండనున్నారు.  
హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై వాహనాల దారిమళ్లింపు 
నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు కుడి భాగంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న అలుగు నీటి ప్రవాహం ధాటికి హైద్రాబాద్–శ్రీశైలం హైవేపై బ్రిడ్జి వద్ద రోడ్డు బుధవారం అర్థరాత్రి కొట్టుకుపోయింది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపి వేశారు. వాహనాలను నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మీదుగా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా నుంచి శ్రీశైలం, అచ్చంపేటకు పంపిస్తున్నారు. కొట్టుకపోయిన రోడ్డు పునరుద్ధరణ పనులు గురువారం ప్రారంభించారు.  
మరోసారి తెరపైకి ‘లైడార్ సర్వే’
హైదరాబాద్ నగరంలోని జలాశయాలు, చెరువులు, నాలాల అక్రమణదారులపై హైడ్రా ద్వారా ఉక్కుపాదం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే తరహాలో వరంగల్‌లోనూ ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. హైడ్రా తరహాలో వాడ్రాను తీసుకురావాలని ఇప్పటికే సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, వరంగల్‌లోని చెరువులపై లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ (లైడార్) సర్వే చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 
గతంలోనే ఈ సర్వే చేయాలనుకున్నా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా మోంథా తుపానుతో నగరం మొత్తం నీట మునగటంతో మళ్లీ లైడార్ సర్వే తెరపైకి వచ్చింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని 75 చెరువులపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) సహకారంతో సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు.  

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
