ఎంతటి విపత్తు వచ్చినా ఆదుకోవాలి | Revanth reddy orders relief operations on war footing in cyclone montha affected districts | Sakshi
Sakshi News home page

ఎంతటి విపత్తు వచ్చినా ఆదుకోవాలి

Oct 31 2025 6:17 AM | Updated on Oct 31 2025 6:17 AM

Revanth reddy orders relief operations on war footing in cyclone montha affected districts

మంత్రి తుమ్మలతో కలిసి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

యంత్రాంగానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

తుపాను ప్రభావిత జిల్లాల్లో మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలి 

ముంపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి 

ఉద్యోగుల సెలవులు రద్దు చేయండి 

ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి 

16 జిల్లాలపై తుపాను ప్రభావం ఉందని వెల్లడి 

నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు.. వాడుకోండి: డిప్యూటీ సీఎం భట్టి  

సాక్షి, హైదరాబాద్‌: మోంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, ఆ జిల్లాల్లోని ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఎంతటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఉద్యోగులు, అధికారులు, ఇన్‌చార్జి మంత్రులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉండాలని నిర్దేశించారు.

వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన సహాయం అందించాలని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రేవంత్‌ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వానల వల్ల ప్రధానంగా వరి, పత్తి పంటకు నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు సీఎం దృష్టికి తెచ్చారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలతోపాటు, హుస్నాబాద్‌ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనాకు వచ్చారు.  

కొనుగోళ్లపై రోజూ నివేదికలు  
వరి కోతలు మొదలయ్యాయని, అనుకోని ఉపద్రవం ఏది వచ్చినా రైతులకు ఆవేదన మిగులుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘వర్షంతో చాలాచోట్ల ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోవటం, రైతులు నష్టపోవటం ఆందోళన కలిగించింది. కళ్లాల్లో, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే దగ్గర్లోని గోదాములు, మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి.

అవి అందుబాటులో లేని చోట దగ్గరలోని ఫంక్షన్‌ హాళ్లలో నిల్వ చేయాలి’అని రేవంత్‌ కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోళ్లకు సంబంధించి రోజూ సాయంత్రం రిపోర్టు తెప్పించుకోవాలని, రిపోర్ట్‌ ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షాలకు ధాన్యం తడవకుండా తగినన్ని టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని, విధానపరమైన నిర్ణయాలు అవసరమైతే వెంటనే సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్, సీఎస్‌ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు.  

హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయండి 
వరంగల్‌లో వరద బాధితులకు అందించే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రస్థాయిలోనూ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే హైదరాబాద్‌ నుంచి హైడ్రా బృందాలను, అవసరమైన సామగ్రిని పంపించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. వెంటనే అవసరమైనన్ని పడవలను అక్కడికి పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్‌ఎఫ్‌సిబ్బందిని తక్షణమే తరలించాలని చెప్పారు. ఎక్కడైనా వరదలో ఇళ్లపై కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగునీరు, ఆహార ప్యాకెట్లు సరఫరా చేయాలని ఆదేశించారు. శుక్రవారం ఉదయం వరంగల్, హుస్నాబాద్‌ వరద ప్రాంతాల్లో రేవంత్‌ రెడ్డి ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు.  
విద్యుత్‌శాఖ అప్రమత్తంగా ఉండాలి 
ఈదురు గాలులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్‌శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చెప్పారు. రోడ్లపై బ్రిడ్జిలు, లో లెవల్‌ కాజ్‌వేల వద్ద, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించాలని సూచించారు. అవసరమైనచోట అత్యవసర వైద్య సేవలు అందించేలా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ప్రకృతి విపత్తుల శాఖను ఆదేశించారు. వర్షాలతో ఖమ్మం జిల్లాలో డీసీఎం వ్యాన్, డ్రైవర్‌ వాగులో కొట్టుకుపోవటం దురదృష్టకరమని సీఎం అన్నారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌ రావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌ రెడ్డి, విపత్తుల నిర్వహణ విభాగం స్పెషల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

నిధుల సమస్య లేదు: డిప్యూటీ సీఎం భట్టి  
సహాయ, పునరావాస చర్యలు చేపట్టడానికి నిధుల సమస్య లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు వినియోగించుకుని 30 రోజుల్లోగా ర్యాటిఫై చేయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేబినెట్‌ సహచరులు ముందుగానే హెచ్చరించడం వల్ల ప్రాణ, భారీ ఆస్తినష్టం జరగకుండా నివారించామని చెప్పారు. రాబోయే 24 గంటలు కలెక్టర్లు, ఇతర అధికారులు తుపాను మాన్యువల్‌ దగ్గర పెట్టుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తమై పత్తి తడవకుండా టార్పాలిన్లు కప్పడం, గోదాముల్లోకి పత్తి పంటను షిఫ్ట్‌ చేయడంతో పంటను కాపాడుకోగలిగామన్నారు. విద్యుత్‌ శాఖ మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమైందని తెలిపారు. దెబ్బతిన్న సబ్‌స్టేషన్లను వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్‌ సరఫరా ఇబ్బంది లేకుండా చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement