 
													సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుతున్న వారిలో విద్యార్థులు మొదలు విద్యాధికులూ..
రైతుల నుంచి వయో వృద్దుల వరకు అందరూ బాధితులే..
కాలు కదపకుండా కష్టార్జితం స్వాహా చేస్తున్న నేరగాళ్లు
సాక్షి, హైదరాబాద్: కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టుగా.. కారెవరూ మోసం చేసేందుకు అనర్హం అన్నచందంగా మారింది సైబర్ నేరగాళ్ల సరళి. వృత్తి, వయస్సు, లింగభేదాలు, విద్యార్హతలు అన్న తేడా లేకుండా మాయ మాటలు చెప్పి తమ వలలోకి లాగుతున్నారు. అందినకాడికి వారి బ్యాంకు ఖాతాల నుంచి హాంఫట్ చేస్తున్నారు. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్న వారిలో విద్యార్థులు మొదలు వయోవృద్ధుల వరకు... గృహిణుల నుంచి బిజినెస్ మ్యాన్‌ల వరకు అన్ని వర్గాల వారు ఉంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సైబర్ మోసగాళ్ల చేతిలో అందరూ బాధితులవుతున్నారు.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) గణాంకాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఫిర్యాదు చేస్తున్న బాధితుల వయసు, వృత్తులను సైతం అధికారులు క్షుణ్ణంగా విశ్లేíÙస్తున్నారు. ఇలా ఇటీవల జరిపిన విశ్లేషణలో పలు ఆసక్తికరమైన అంశాలు గుర్తించారు. 2024 జనవరి నుంచి సెపె్టంబర్ వరకు నమోదైన కేసులు.. 2025 జనవరి నుంచి సెపె్టంబర్ వరకు కేసులతో పోలిస్తే పెట్టుబడి మోసాల్లో చిక్కుతున్న వారిలో విద్యార్థులు సైతం ఉన్నట్టు తేలింది. ఈ తరహా కేసుల్లో 6 శాతం పెరుగుదల నమోదైంది. అదేవిధంగా చుట్టాలు, స్నేహితుల ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌ల పేరిట చేసిన సైబర్ మోసాల బాధితుల్లో గృహిణులే 25 శాతం మంది ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
