మహబూబ్‌నగర్ జిల్లా: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి (22) ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన విష్ణు మాట్లాడాలని చెప్పి ఆ యువతిని రైతువేదిక వద్దకు తీసుకెళ్లాడు.
అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అధిక రక్తస్రావం కావడంతో ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే అతను ఇతరుల సాయంతో స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. చుట్టు పక్కల వారు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా అక్కడకు వచి్చంది. అప్పటికే ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్‌లో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువతి మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ఘటనా స్థలాన్ని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్‌ఐ వేణు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో గ్రామంలో విచారణ జరిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అత్యాచారం, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ వేణు చెప్పారు. యువకుడు ఒక్కడే అత్యాచారం చేశాడా... ఇతరుల ప్రమేయం ఉందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


