 
													కేబినెట్ విస్తరణలో ఆయన ఒక్కరికే చోటు
మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్‌భవన్‌లో కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని శుక్రవారం విస్తరిస్తున్నారు. మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ ఒక్కరినే కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి సీఎస్‌కు లేఖ రాశారు. 
ఈసీ ఉత్తర్వులనుబట్టే.. 
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకే అజహరుద్దీన్‌ను ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని అడ్డుకోవాలని.. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. 
గతంలో గోవాలో ఇలాగే ప్రమాణస్వీకార ఏర్పాట్లు జరుగుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నట్లు పేర్కొంది. బీజేపీ నేతల ఫిర్యాదుపై సుదర్శన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు. ఈసీ ఇచ్చే ఉత్తర్వులను అనుసరించి ఆయన కార్యాచరణ ఉండనుంది. 
ఏ శాఖ ఇస్తారో?
అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నాక ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయనకు కీలకమైన పదవిని అప్పగిస్తారా లేక మైనారిటీ సంక్షేమ శాఖతో సరిపుచ్చుతారా అనే చర్చ జరుగుతోంది. 
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి మహమూద్ అలీకి రెండు దఫాల్లోనూ కీలకమైన హోం, రెవెన్యూ శాఖలను కేసీఆర్ అప్పగించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన దగ్గర ఉన్న శాఖలను ఇచ్చే పక్షంలో పెద్దగా మంత్రుల శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చని.. లేదంటే మంత్రుల శాఖలు స్వల్పంగా మారే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.   

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
