 
															శ్రావ్య(ఎడమ పక్క..), రాచ కృష్ణవేణి-ప్రభాకర్(కుడి)
సాక్షి, నెట్‌వర్క్: మోంథా తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాగులు, వంకలు ఉప్పొంగటంతో ఆరుగురు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) బుధవారం సాయంత్రం హనుమకొండలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రామానికి వెళ్లే కల్వర్టు వద్ద వరదనీటిలో పడి చనిపోయాడు.
వరంగల్ నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన అడపా కృష్ణమూర్తి అనే వృద్ధుడు వరదనీటిలో పడి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులో కోల రామక్క (80) ఇంట్లో పడుకోగా వర్షానికి గోడ కూలి చనిపోయింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గట్టుకిందిపల్లెకు చెందిన పులి అనిల్ (30) ఖిలావరంగల్ సమీపం చింతల్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై బైక్‌పై వెళ్తుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు.
ప్రేమికుడిని కాపాడే ప్రయత్నంలో.. 
హైదరాబాద్ నుంచి బైక్‌పై వస్తున్న ఓ ప్రేమజంట జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలో వరదలో చిక్కుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడేపల్లికి చెందిన బరిగెల శివకుమార్ కలిసి బైక్‌పై వెళ్తుండగా తిమ్మంపేట గ్రామ శివారులోని బోల్ల మత్తడి కల్వర్టు వద్ద ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి శివకుమార్ బైక్‌తో సహా కొట్టుకుపోతుండగా శ్రావ్య అతన్ని కాపాడేందుకు వరదలోకి రావడంతో ఆమె కూడా కొట్టుకపోయింది.
శివకుమార్ చెట్టుకొమ్మల సహాయంతో ప్రాణం కాపాడుకోగా, గల్లంతైన శ్రావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమదేవరపల్లి మండలానికి చెందిన ప్రణయ్ (28), కల్పన (24) దంపతులు బుధవారం బైక్‌పై సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు వెళ్తుండగా మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రస్తుతం కల్పన గర్భవతిగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి ఆరా తీశారు. దంపతుల బాధిత కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓదార్చారు. మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్ (30) జంపన్నవాగు (చిన్నవాగు) కల్వర్టుపై వరదలో కొట్టుకుపోయిన మరణించాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో తన ఇంటిలో పడుకున్న గద్దల సూరమ్మ (58)పై గురువారం తెల్లవారుజామున గోడ కూలి పడడంతో చనిపోయింది.
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన రాచ కృష్ణవేణి (45) తన భర్త ప్రభాకర్‌తో కలిసి గురువారం బైక్‌పై వెళ్తుండగా మజీద్‌పూర్– బాటసింగారం గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వరద కాల్వలో పడిపోయారు. స్థానికులు ప్రభాకర్‌ను కాపాడగా, కృష్ణవేణి నీట మునిగి మృతిచెందింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్లలోని కోళ్ల ఫారాల్లో వర్షాలతో సుమారు 15 వేల కోళ్లు మృతి చెందాయి.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన బోళ్ల కుమారస్వామికి చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో పొలానికి వెళ్లిన రైతులు బుధవారం దుందుభి వాగు మధ్యలో చిక్కుకుపోయారు. తాడు సహాయంతో పోలీసు సిబ్బంది అవతలి ఒడ్డుకు చేరుకొని గురువారం రైతులకు ఆహారం అందజేశారు. వారు రెండు రోజులు అక్కడే ఉండనున్నారు. కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తడంతో మానకొండూర్ రూరల్ మండలం శ్రీనివాస్‌నగర్ శివారులో వాగు ఒడ్డున ఉన్న 16 వేల బాతులు కొట్టుకుపోయాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
