 
													కాంగ్రెస్ పార్టీ సిగ్గులేకుండా అజహరుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది
జూబ్లీహిల్స్ ఉపఎన్నికప్పుడే ప్రభుత్వానికి మంత్రి పదవి ఇవ్వాలని గుర్తొచ్చిందా?
మైనారిటీలను సంతృప్తిపరిచేందుకు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోంది
మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశ పరువుప్రతిష్టలను దెబ్బతీస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై గతంలో నిషేధానికి గురైన మాజీ క్రికెటర్ అజహ రుద్దీన్‌ను కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి దుయ్య బట్టారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన్ను ఇప్పుడు హడావుడిగా ఎవరిని ఉద్ధరించేందుకు మంత్రిని చేస్తున్నారని నిలదీశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వడం చట్ట విరుద్ధమైనప్పటికీ అధికార కాంగ్రెస్ దిగజారి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత 22 నెలలుగా లేనిది జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముందే మైనారిటీల సంక్షేమం కోసం మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వానికి గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ కక్కుర్తి పడుతోందని.. మైనారిటీలను సంతృప్తిపరిచేందుకు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కనపడితే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు వంగి వంగి సలాం కొడుతున్నారని.. కుహనా లౌకికవాదం, బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్–బీఆర్‌ఎస్ మజ్లిస్‌కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్నాయని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉపఎన్ని కలో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ అభ్యర్థే పోటీ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.
స్లాటర్‌హౌస్‌ల మాఫియాను వదిలి గోరక్షకులపై అక్రమ కేసులా?
గోరక్షణ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పశువుల రవాణా, స్లాటర్ హౌస్‌ల నిర్వహణ విషయంలో కఠిన నిబంధనలున్నా పోలీసులు పూర్తిగా మాఫియా చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. స్లాటర్ హౌస్ మాఫియా పశువుల అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తోందని.. దీన్ని అరికట్టడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని విమర్శించారు. ఘట్‌కేసర్‌లో గోరక్షక్ సేవకుడు ప్రశాంత్ కుమార్ (సోనూసింగ్)పై తుపాకీతో కాల్పులకు పాల్పడిన మజ్లిస్ నేత మహ్మద్ ఖురేషీపై గతంలోనే అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు.
పోలీసుల బాధ్యతను గోరక్షకులు నిర్వహిస్తుంటే చట్టాన్ని ఉల్లంఘించి గోవులను అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకోకపోగా గోరక్షకులపైనే అక్రమ కేసులు బనాయించి బెదిరిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ న్యూ బోయిగూడ, గోల్నాక ప్రాంతాల్లోని స్లాటర్‌హౌస్‌లను వెంటనే నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో 39 అక్రమ స్లాటర్ హౌసులపై తాను గతంలో సీఎం, సీఎస్‌లకు లేఖలు రాశానని, వాటిపై తీసుకున్న చర్యలు ఏమిటో వెల్లడించాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు కూడా అక్రమ స్లాటర్ హౌసుల్లో భాగస్వాములని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
