ధరలేక, బాబు సర్కారు ఆదుకోక దగా
3 తీతల పంట ఉన్నా ట్రాక్టర్లతో దున్నేస్తున్న రైతులు
తీవ్ర వర్షాలు, మోంథా తుపానుతో తగ్గిన దిగుబడి, నాణ్యత.. పంట నష్టం అంచనాల్లో చంద్రబాబు సర్కారు దారుణంగా కోత
పల్నాడు జిల్లాలో 54,145 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా
చివరికి.. 3,912 ఎకరాలేనని కుదింపు.. తేమ శాతం, నాణ్యత పేరుతో పంటను తిరస్కరిస్తున్న సీసీఐ బయ్యర్లు
తొలి తీత అమ్ముకోవడానికి నానా అవస్థలు
ప్రైవేట్ దళారులకు క్వింటాల్ రూ.5 వేలకే విక్రయం
దిగుబడి, గిట్టుబాటు ధర రాకపోవడంతో పత్తి రైతు కుదేలు
ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టం
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు షేక్ మాబు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండల కేంద్రం. మూడెకరాలు కౌలుకు తీసుకుని ఖరీఫ్‌లో పత్తి సాగుచేశాడు. కౌలుకు రూ.45 వేలతో పాటు సాగు, ఎరువులు, విత్తనాలు, మందులకు మొత్తం రూ.1.50 లక్షల దాకా పెట్టుబడి పెట్టాడు. మోంథా తుపాను, అంతకుముందు వ చ్చిన అధిక వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపగా, ఉన్న అరకొర కాయలో నీరుచేరి పత్తి నాణ్యత లోపించింది.
కూలీలకు రూ.30 వేల వరకు ఖర్చుచేసి ఇటీవల మొదటి తీత పత్తి తీయగా మూడెకరాలకు 11 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వ చ్చింది. పత్తిని విక్రయించేందుకు సత్తెనపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే నాణ్యతలేదని తిరస్కరించారు. దీంతో.. మాబు ప్రైవేట్ దళారులకు క్వింటా కేవలం రూ.5,700కు అమ్ముకున్నాడు. మూడెకరాలకు వ చ్చింది కేవలం రూ.63 వేలే. మిగిలిన 2, 3 తీతలకు కూలీ డబ్బులు కూడా రావని మాబు బుధవారం పొలంలోని పత్తి పంటను దున్నించేశాడు.
సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు రాష్ట్రంలో రైతుల్ని కుదేలు చేస్తున్నాయి. ఇప్పటికే మామిడి, ఉల్లి, టమోటా, అరటి రైతులు తమ ఉత్పత్తులను రోడ్లపై పారబోసి పంటలను దున్నేయగా తాజాగా ఆ జాబితాలో పత్తి రైతులూ చేరుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో కురిసిన భారీ వర్షాలకు పల్నాడు జిల్లాలో పత్తి పంట బాగా దెబ్బతింది. పత్తి కాయల్లోకి వర్షపునీరు చేరడంతో అవి నల్లగా మారిపోయాయి.
పత్తి నాణ్యతతో పాటు దిగుబడిపైనా వర్షాల ప్రభావం ఎక్కువగా పడింది. తుపానుకు ముందు ఎకరాకు 8–10 క్వింటాళ్ల పత్తి ఆశించిన రైతులకు వర్షాలవల్ల 5–6 క్వింటాళ్లు కూడా దిగుబడి రాని దుస్థితి. ఇలా పల్నాడు జిల్లా వ్యాప్తంగా 54,145 ఎకరాల్లో పత్తి పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాలు వేసిన చంద్రబాబు ప్రభుత్వం.. చివరకు 3,912 ఎకరాలు మాత్రమే నష్టపోయినట్లు తుది లెక్కలను కుదించి మిగతా పంట పరిహారాన్ని ఎగ్గొట్టేస్తోంది. నిబంధనల పేరిట నష్టపోయిన రైతులను జాబితా నుంచి తొలగించింది.
విసుగు చెంది దున్నేస్తున్న రైతులు
ఇలా ప్రకృతి ప్రకోపాలు, చంద్రబాబు సర్కారు దగాతో నష్టపోయి మిగిలిన అరకొర పంటనైనా అమ్ముకుందామని చూసిన పత్తి రైతును సీసీఐ నిబంధనలు కూడా చిత్తుచేస్తున్నాయి. నిజానికి.. పత్తి తేమ శాతం 8 నుంచి 12 శాతం మధ్య ఉండాలి, ఎనిమిది శాతం ఉంటే పూర్తిస్థాయిలో మద్దతు ధర రూ.8,110 దక్కగా, తేమ శాతం పెరిగితే రూ.7,710 దాకా ఇస్తున్నారు. 12 శాతం దాటితే తిరస్కరిస్తున్నారు.
అయితే, తుపాను ప్రభావం, మారిన వాతావరణ పరిస్థితులవల్ల పత్తిలో తేమ శాతం 18 నుంచి 22 వరకు ఉంటోంది. దీంతో.. బయ్యర్లు కొనుగోలు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. సీసీఐ కేంద్రాలకు పత్తిని తీసుకొ చ్చి, వెనక్కి తీసుకెళ్లడంతో రవాణా, కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రైవేట్ దళారులు క్వింటా పత్తి రూ.5 వేలకే కొనుగోలు చేస్తున్నారు.
ఆ డబ్బులు కూలీలు, రవాణా ఖర్చులకు కూడా మిగలకపోవడంతో రైతులు విసుగుచెంది పత్తిపంటను దున్నేస్తున్నారు. నష్టపోయిన రైతుల్లో అత్యధికంగా కౌలు రైతులున్నారు. వీరికి నష్టపరిహారం, అన్నదాత
సుఖీభవ వంటి సదుపాయాలేవీ చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడంలేదు.
రూ.లక్షకు పైగా నష్టపోయా..
మూడెకరాల్లో పత్తి పంట సాగుచేయగా ఇప్పటికి ఏడు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వ చ్చింది. మిగిలిన తీతలలో పెద్దగా వచ్చేలా లేదు. అధిక వర్షాలకు నీరు ఎక్కువ రోజులు నిలిచి మొక్కలు ఎండిపోయాయి. చేసేదిలేక పంటను దున్నేశా. ఎకరాకు రూ.35 వేల చొప్పున రూ.లక్షకు పైగా నష్టపోయా. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే సాగు కష్టం. – గోగులపాటి కన్నయ్య, పత్తి రైతు, పెదకూరపాడు
తుపాను పరిహారం అందలేదు
ఈ ఏడాది ఎకరాన్నర భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశా. అధిక వర్షాలకు తెగులు, కాయలకు పుచ్చు ఎక్కువగా వచ్చి దిగుబడి పడిపోయింది. కేవలం ఒకటిన్నర క్వింటా పత్తి మాత్రమే వచ్చింది, దాన్ని అమ్మడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. పంటను తీయడానికి మళ్లీ అప్పులుచేయాల్సి వస్తుండడంతో ట్రాక్టర్‌తో పంటను దున్నేశా. తుపాను పరిహారం కూడా అందలేదు. ప్రభుత్వం సాయం చేయకపోతే కౌలు రైతులు సాగుచేసే పరిస్థితి ఉండదు. – దొడ్డా బాబురావు, పత్తి రైతు, పెదకూరపాడు


