పంట నష్టం అంచనాలు భారీగా కుదించిన కూటమి ప్రభుత్వం
రైతన్నల గోడు ఏమాత్రం పట్టించుకోని వైనం
మోంథా తుపాను దెబ్బకు అన్నదాత కుదేలు
క్షేత్ర స్థాయిలో 15 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
కానీ 4.17 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట నష్టమని తేల్చిన ప్రభుత్వం
2,279 పశువులు, జీవాలు దుర్మరణం..155 పశువుల షెడ్లు నేలమట్టం
బోట్లు, వలలకు అపార నష్టం జరిగితే స్వల్పంగా నిర్ధారణ.. ఆక్వా రంగంలో 50 వేల ఎకరాల్లో నష్టం అంటూ కేవలం 5 వేల ఎకరాలకే పరిమితం
సుంకు రాలిపోయిన పంట పొలాలను పరిశీలించని బృందాలు
తుపాను తుది అంచనాల నివేదిక తయారు చేసిన యంత్రాంగం
రేపు కేంద్ర బృందం ముందు ఉంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం
మొక్కుబడి తంతుగా ముగిసిన క్షేత్ర స్థాయి పరిశీలన
సాక్షి, అమరావతి: అంతా అనుకున్నట్టుగానే చేశారు. ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపలేదు. నిబంధనలను పక్కన పెట్టి పుట్టెడు కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఉదారంగా ఆదుకోవల్సిన ప్రభుత్వం వారి నోట్లో మట్టికొట్టేందుకు ఎన్యుమరేషన్ (పంట నష్టం మదింపు)ను మమ అనిపించింది. రైతులను ఆదుకునేందుకు పారదర్శకంగా ఎన్యుమరేషన్ చేయాలని యంత్రాంగం ఎంతగా శ్రమించినా, పచ్చ నేతల కనుసన్నల్లోనే తుది జాబితాలు తయారు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలను, రైతులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ అస్తవ్యçస్తంగా సాగింది. గత నెల 31వ తేదీ సాయంత్రంలోగా తుది జాబితాలు తయారు చేయాలని ఆదేశిస్తూ ఒక్క రోజు ముందు అంటే 30వ తేదీన సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. తుది అంచనాల తయారీకి కేవలం 24 గంటలు మాత్రమే గడువు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. గడువు పెంచాలని రైతులు, రైతు సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి.
అయినప్పటికీ ప్రభుత్వం గడువు పెంచుతున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా పంట నష్టం అంచనాల పరిశీలన, సామాజిక తనిఖీలు, విజ్ఞప్తుల స్వీకరణ, పరిష్కారం, ఉన్నతాధికారుల సూపర్ చెకింగ్, పునః పరిశీలన, తుది జాబితాల తయారీ అంతా సమాంతరంగా జరిగిపోతుందంటూ బిల్డప్ ఇచ్చారు. దీంతో తుది అంచనాల తయారీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ జాబితాలన్నీ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే, స్థానిక టీడీపీ నేతల సిఫార్సుల మేరకు తయారవుతున్నాయన్న విమర్శలు విన్పించాయి. అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు.
అంచనాలు కుదించి..
మోంథా తుపాను ప్రభావం 24 జిల్లాల్లో 15 లక్షల ఎకరాలకు పైగా సాగైన పంటలపై తీవ్రంగా ఉంటుందని తొలుత ప్రభుత్వమే అధికారికంగా అంచనా వేసింది. అయితే తుపాను ఆగిపోయిన మర్నాడు నష్ట తీవ్రతను తగ్గించేందుకు తొలుత 4.40 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు ముంపునకు గురైనట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఆ సంఖ్య 3.45 లక్షల ఎకరాలే అంటూ చెప్పుకొచ్చింది. తీవ్ర విమర్శలు రావడంతో చివరకు తుది అంచనాలు కొలిక్కి వచ్చే సమయానికి 4.17 లక్షల ఎకరాలుగా నిర్ధారించింది. 
దాంట్లో 4.11 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 16 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు లెక్క తేల్చారు. క్షేత్ర స్థాయిలో వాస్తవంగా ఆరు నుంచి 8 లక్షల ఎకరాల్లో వరి పంటకు అపార నష్టం వాటిల్లగా, తుది అంచనాల్లో మాత్రం కేవలం 3.25 లక్షల ఎకరాల్లోనే వరి పంట దెబ్బ తిన్నట్టుగా నిర్ధారించింది. దాదాపు 50 వేల ఎకరాల్లో అరటి పంట నేలమట్టమైనట్టు తెలుస్తుండగా, ప్రభుత్వం మాత్రం కేవలం 9,700 ఎకరాల్లోనే నష్టం వాటిల్లినట్టు తేల్చింది.
పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మినుము, సజ్జ, కందితో సహా ఇతర పంటల నష్టాన్ని కేవలం 90 వేల ఎకరాలకు పరిమితం చేసింది. ప్రధానంగా ఐదారు లక్షల ఎకరాల్లో వరి పంట నేలకొరిగి పూర్తిగా దెబ్బతినగా, మరో రెండు లక్షల ఎకరాల వరకు పంట నిలబడినప్పటికీ సుంకు (పుప్పొడి) విరిగి ఫలదీకరణ చెందక తాలు గింజలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావంతో ఎకరాకు 20–25 బస్తాలకు మించి దిగుబడి రాని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాల మేరకు ర్యాండమ్ చెక్ చేస్తూ మండలానికి ఒకటి రెండు గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి అధికారులు ఎన్యుమరేషన్‌ను మమ అనిపించారు. సుంకు విరిగిపోవడం వల్ల దెబ్బతిన్న పంట పొలాల వైపు కన్నెత్తి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమకు చెందిన పంటలకు సంబంధించి పెట్టుబడి రాయితీగా రూ.875 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని లెక్క తేల్చారు.
అక్టోబర్ 31 లోపు పంట నష్టం వివరాలను తెలపాలంటూ రైతులకు ప్రభుత్వం పంపిన మెసేజ్
చనిపోయింది 2,279 పశువులు,జీవాలేనట!
మోంథా తుపాను వల్ల క్షేత్ర స్థాయిలో వాస్తవంగా ఐదారు వేల జీవాలు మృత్యువాత పడినట్టుగా రైతులు చెబుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం 94 ఆవులు, గేదెలు, 393 మేకలు, గొర్రెలు, 17 ఎద్దులు, దున్నలు, 82 దూడలు, 1,693 కోళ్లు మృత్యువాత పడినట్టుగా ప్రకటించారు. 155 పశువుల షెడ్లు నేల కూలినట్టుగా నిర్ధారించారు. తొలుత వీటికి రూ.5 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేయగా, చివరికి రూ.1.05 కోట్లకు పరిమితం చేశారు.
ఆక్వా రంగానికి తొలుత రూ.514 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టుగా ప్రకటించిన ప్రభుత్వం, తుది అంచనాలకొచ్చేసరికి కేవలం 33.23 కోట్లకు పరిమితం చేయడం పట్ల ఆక్వా రైతులు మండిపడుతున్నారు. తొలుత 50 వేల ఎకరాలకు పైగా దెబ్బతిన్నట్టుగా చెప్పుకొచ్చిన ప్రభుత్వం చివరికి 5 వేల ఎకరాలకు పరిమితం చేసింది. తొలుత 10 వేల మంది ఆక్వా రైతులకు నష్టం వాటిల్లినట్టు చెప్పగా, చివరికి 2,541 మంది రైతులకు చెందిన ఆక్వా చెరువుల్లో ఇసుక మేటలు వేయడం, పూర్తిగా దెబ్బతిన్నట్టు నిర్ధారించారు.
మత్స్యశాఖకు సంబంధించి 9 మోటరైజ్డ్ బోట్లు పూర్తిగా, మరో 304 బోట్లు పాక్షికంగా, 41 నాన్ మోటరైజ్డ్ బోట్లు, సంప్రదాయ బోట్లు మరో 18 పూర్తిగా దెబ్బ తిన్నాయని, అలాగే 121 వలలు పూర్తిగా, మరో 241 వలలు పాక్షికంగా దెబ్బతిన్నాయని నిర్ధారించారు. తుపాను వల్ల దాదాపు 20 రోజులుగా వేట లేక పస్తులతో గడిపిన మత్స్యకారులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి, వారికి బోట్లు, వలలకు కేవలం రూ.1.06 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చారు. ఇలా అన్ని విధాలుగా కోతలు వేస్తూ తుది అంచనాలను కుదించేశారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర బృందం ముందు ఈ నివేదికలు ఉంచేందుకు సన్నద్ధం చేస్తున్నారు.


