పంట పీకేసి నిప్పుపెట్టి ఆగ్రహం
మోంథా తుపానుకు దెబ్బతిన్నా ఆదుకోని సర్కారు
నేనూ టీడీపీ మనిషినే
30 ఏళ్లుగా ఆ పార్టీ సభ్యత్వం ఉంది
పరిహారంపై న్యాయంచేయని చంద్రబాబు సర్కారు
తగలబడిపోతున్న పంటకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది
నిగ్గదీసి అడిగిన కర్షకుడు
ప్రత్తిపాడు: మోంథా తుపాను పత్తి రైతును ఆగమాగం చేసేసింది. పైకి పైరు పచ్చగా కళకళలాడుతున్నట్లు కనిపిస్తున్నా, భూమి లోపల మొక్కల వేర్లు కుళ్లి పోవడంతో క్రమేపీ మొక్క నశించిపోతోంది. అయినా ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. కడుపు మండిన కర్షకుడు సాగు చేసిన పత్తి పైరును పీకేసి నిప్పు పెడుతున్నాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడుకు చెందిన కమ్మ సురేష్ బాబు ఏడు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. తుపాను తరువాత వేర్లు కుళ్లిపోయి పంట కృశించిపోయింది.
పత్తి తీతలు తీస్తే ఎకరాకు 50 నుంచి 60 కిలోలు మాత్రమే వచ్చింది. దీంతో ఇక లాభం లేదనుకున్న రైతు సోమవారం కూలీలను పెట్టి పత్తి మొక్కలను పీకేశాడు. వాటిని కుప్పలుగా పోసి పొలంలోనే నిప్పుపెట్టాడు. తానూ టీడీపీ మనిషినేనని, 30 ఏళ్లుగా సభ్యత్వం ఉందని, అయినా చంద్రబాబు సర్కారు పంట నష్టపరిహారం అందించడం లేదని విమర్శించాడు.
ఏ అధికారీ పొలాన్ని పరిశీలించలేదని, పరిహారం ఇస్తున్నామంటూ టీవీల్లో ఘనంగా చెప్పుకుంటున్న సర్కారు పొలంలోనే తగలబడిపోతున్న ఈ పత్తి పంటకు ఏం సమాధానం చెబుతుందని నిలదీశాడు. కనీసం సగం రాయితీపైన అయినా విత్తనాలను అందించాలని డిమాండ్ చేశాడు. తమ గ్రామంలో అందరూ దాదాపుగా పంటను పీకేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
పత్తిపైరును పీకేసి పొలంలోనే నిప్పుపెట్టిన దృశ్యం(ఇన్‌సెట్) రైతు సురేష్‌బాబు


