పడిపోయిన పంటలను చూడమన్నా.. ఒక్కరూ రావట్లేదు
దెబ్బ తిన్నట్లు రాసుకుంటే.. తర్వాత ధాన్యం కొనబోమంటున్నారు
వరి పొలాల్లో వైఎస్ జగన్ ఎదుట అన్నదాతల ఆక్రోశం
సాక్షి ప్రతినిధి, విజయవాడ, నెట్‌వర్క్: ‘తుపాను వల్ల దెబ్బతిన్న మా పంటలను చూడటానికి రావాలని కోరినా.. ఎవరూ రావట్లేదు. ఇప్పుడు దెబ్బతిన్న పంటలను జాబితాలో రాసుకుంటే.. రేపు ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నారు. బయట వ్యాపారులకు అమ్ముకోమంటున్నారు. గత 17 నెలల కాలంలో ఒక్క రూపాయి ఇన్‌పుట్ సబ్సిడీ వేసింది లేదు. తాలు ధాన్యంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గంలో చేపట్టిన పర్యటన రోడ్ షోలా సాగిందే గానీ రైతులకు ఒనగూడింది ఏమీ లేదు..’ అంటూ అన్నదాతలు నిర్వేదం వ్యక్తం చేశారు.

రైతుకు కష్టమొచ్చినపుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే.. వ్యాపారులు పట్టించుకుంటారా? అని ఆక్రోశించారు. వైఎస్ జగన్ హయాంలో క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించి, విపత్తులతో పంటలు దెబ్బతిన్న ప్రతిసారి సహాయం అందించిందని.. ఇప్పుడు కూటమి సర్కారు రైతులనే కట్టుకోమంటోందని, వంద మంది రైతుల్లో ఎనిమిది మంది కూడా ఇన్సూరెన్స్ కట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమను పట్టించుకున్న వారే లేరని, మీరే యాత్రల ద్వారా ఈ ప్రభుత్వం మెడలు వంచి కనువిప్పు కలిగించాలని వేడుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా తుపాన్ బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెడన నియోజకవర్గం రామరాజుపాలెం, ఆకుమర్రు లాకుల వద్ద రైతులతో మాట్లాడారు. పంట పొలాల్లోకి దిగి స్వయంగా నష్టాన్ని పరిశీలించి వారిని ఓదార్చారు.

రైతు పరసా వెంకటేశ్వరరావుతో వైఎస్ జగన్
రైతు: నమస్తే సార్... నాకు మూడు ఎకరాలుంది
వైఎస్ జగన్: మూడు ఎకరాల పరిస్థితి ఏమిటి?
రైతు: ఎకరానికి రూ.35 వేలు పెట్టుబడి పెట్టా... యూరియా అందలా
వైఎస్ జగన్: యూరియా బ్లాక్‌లో కొనుక్కోవాల్సి వచ్చింది!
రైతు: ఇన్‌పుట్ సబ్సిడీ రావట్లేదు...
వైఎస్ జగన్: ఇన్‌పుట్ సబ్సిడీ రావటం లేదు. ఈ రెండేళ్ల కాలంలో చంద్రబాబు వచ్చాక ఇన్సూరెన్సు ఇచ్చిందీ లేదు.
రైతు: చేను పడిపోతే వచ్చి చూసిన అధికారి లేడు
వైఎస్ జగన్: చేను పడిపోయినా ఏ ఒక్క అధికారీ వచ్చి చూడలేదు. పొలంలోకి వచ్చి చూసింది లేదు.
రైతులు: లోపలకు అయితే అనుకోవచ్చు... రోడ్డు పక్కనే ఉన్నా వచ్చి రాసింది లేదు.
రామరాజుపాలెంలో వరి పొలంలో దిగి రైతులకు వైఎస్ జగన్ ఓదార్పు..
వైఎస్ జగన్: పంట నష్టం నమోదు చేశారా?
రైతు ఓడుబోయిన బ్రహ్మకృష్ణ: రాయలేదు సార్..
వైఎస్ జగన్: సుంకు విరిగి పోయింది. దాని వల్ల పాలు పోసుకునే పరిస్థితి లేదని చెప్పినా కూడా రాయలేదా..?
రైతు: రాయలేదు సార్...! నాకు మీ ప్రభుత్వంలో 3.18 ఎకరాలకు రూ.66,780 డబ్బులు పడ్డాయి
వైఎస్ జగన్: మన ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఉండటం వల్ల మీకు రూ.66,780 పడ్డాయి. ఈ రోజు కనీసం పొలాలకు వచ్చి ఎన్యూమరేషన్ చేసేవాడు లేడు. ఎన్యూమరేషన్ అనేది జరగలేదు. సుంకు పోయిందని చెప్పినా కూడా ఎవరూ రాలేదా?
రైతు: రాలేదు సార్...
వైఎస్ జగన్: ఎన్యూమరేషన్ ఎందుకు చేస్తారంటే.. సుంకు ఉందా లేదా? ఇవన్నీ చూడటానికే..! సుంకు పోయింది కాబట్టి దిగుబడి రాదు. అందుకు ఎన్యూమరేషన్ చేయాలి.
రైతు: ఎకరానికి రూ.30 వేలు పెట్టుబడి అయింది సార్...యూరియా బస్తా బ్లాక్‌లో రూ.500 పెట్టి కొన్నా. మీ ప్రభుత్వంలో రూ.270కి ఎక్కడ పడితే అక్కడ యూరియా కట్టలు దొరికాయి సార్.
వైఎస్ జగన్: రూ.260...270 పెట్టి కొనాల్సింది... రూ.500 పెట్టి కొనుక్కున్నారు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు చొప్పున అన్నదాతా సుఖీభవ ఇస్తామన్నారు. ఎంత ఇచ్చారు? రెండేళ్లకు రూ.40 వేలకు ఎంత వచ్చింది?
రైతు: రూ.5 వేలు ఇచ్చారు సార్.
వైఎస్ జగన్: రూ.40 వేలు అని చెప్పి.. రూ.5 వేలు ఇచ్చారు. ఈ 18 నెలలు కాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఏమైనా ఇచ్చారా..? ఒక్కసారైనా వచ్చిందా?
రైతులు: ఏమీ రాలేదు సార్.
వైఎస్ జగన్: ఒక్కసారి కూడా రాలా..? ఈ క్రాప్ కూడా చేయడం లేదు!
రైతు: నిరుడు కూడా మునిగిపోతే పట్టించుకోలేదు.
వైఎస్ జగన్: లాస్ట్ టైం పోయినా కూడా పట్టించుకోలేదు... ఇప్పుడు కూడా పట్టించుకోలేదు...! ఇది వరుసగా రెండోసారి...! ఈ ప్రభుత్వంలో పట్టించుకునే నాథుడు లేడు. మన ప్రభుత్వంలో సమయానికి రైతు భరోసా వచ్చింది. ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చింది. యూరియా బస్తా కూడా తక్కువ రేటుకే ఆర్బీకేల ద్వారా రూ.270కే ఇచ్చాం.
రైతు: మీ ప్రభుత్వంలోనే నాకు కౌలు కార్డు వచ్చింది సార్...
వైఎస్ జగన్: ఈ ప్రభుత్వంలో కౌలు కార్డు ఇవ్వలేదా...?
రైతులు: లేదు సార్.
లోటు స్పష్టంగా కనపడుతోందయ్యా...!
మచిలీపట్నంటౌన్: ‘నువ్వు లేని లోటు స్పష్టంగా కనపడుతోందయ్యా..! నిన్ను కోల్పోయి ఎంతో తప్పు చేశాం. ఈసారికి మన్నించయ్యా..’ అంటూ కృష్ణా జిల్లా గూడూరు మండలం రామరాజుపాలేనికి చెందిన రైతు సాయిబాబు వైఎస్ జగన్ ఎదుట ఆక్రోశించాడు. ‘మీరు సీఎంగా ఉన్న సమయంలో రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన సాగించారు. ప్రస్తుతం ఆ తేడా మాకు ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది’ అని పేర్కొన్నాడు. తనకు నాలుగు ఎకరాల పొలం ఉందని, వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా కింద రూ.72 వేలు అందాయని గుర్తు చేసుకున్నాడు.

ఇప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తే ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయదని అధికారులు చెబుతున్నారని, ఇదెక్కడి అన్యాయమో తమకు అర్ధం కావటం లేదని వాపోయాడు. ఆకుమర్రు లాకు సమీపాన నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించిన అనంతరం రైతులు సాయిబాబు, గణేశన రమేష్ బాబు, దేసు ప్రసాద్‌తో వైఎస్ జగన్ మాట్లాడారు.

జగన్: తుపాన్ తర్వాత ఎవరైనా అధికారి వచ్చారా?
రైతు సాయిబాబు: రాలేదన్నా..
జగన్: మనిషి వచ్చి చూసి రాసుకోవడం ఇంపార్టెంట్.. సుంకు ఉందా? పాలు పోసుకుంటుందా.. లేదా? అన్నది అప్పుడే తెలుస్తుంది. ఇన్‌పుట్ సబ్సిడీ అడిగితే.. పంటలు కొనుగోలు చేయబోమని చెప్పారా?
రైతులు: రైతుకు పంట నష్ట పరిహారం ఇస్తే.. ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నారు.
జగన్: చంద్రబాబు వచ్చి రెండు సంవత్సరాలు..! రెండు సీజన్లు అయిపోయాయి.. ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ ఏరోజూ రాలేదు. పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తామన్నారు. అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లకు కలిపి రూ. 40 వేలు ఇవ్వాలి. ఎంత ఇచ్చారు?
రైతులు: రూ.5,000 ఇచ్చారు.
జగన్: మిగిలిందంతా ఎగరగొట్టారు. అన్నదాతా సుఖీభవ లేదు.. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. ఎరువుల రేటు ఎలా ఉంది?
రైతులు: యూరియా బ్లాక్‌లో అమ్మారు.
జగన్: యూరియా ఎంతకు కొన్నారు?
రైతు సాయిబాబు: మూడు రోజులు తపస్సు చేసి యూరియా కట్ట రూ.1200కు కొన్నాం అన్నా..!
రైతు రమేష్ బాబు: యావరేజ్ మీద రూ.650, రూ.700కి కొన్నాం.
జగన్: రూ.260 ఖరీదు చేసే కట్టను.. రూ.600 – రూ.700 దాకా కొనాల్సి వచ్చింది. పంటలకు కనీసం గిట్టుబాటు ధరైనా వస్తోందా?
రైతులు: అదీ లేదన్నా..!
జగన్: గత సంవత్సరం బస్తా ఎంతకు అమ్మారు?
రైతులు: సార్వాలో బస్తా వడ్లు రూ1250 – రూ.1300కి అమ్మేమన్నా..!
జగన్: రూ.1750కి అమ్మాల్సిన ధాన్యాన్ని రూ.1300కి అమ్మారు..
రైతు సాయిబాబు: ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తీసుకెళ్లా.. తేమ శాతం ఎక్కువగా ఉందని, తాలు ఉందని కటింగ్‌లు చేసుకుంటూ పోయి మా చేతికి రూ.1,300 ఇచ్చారు.
జగన్: ఎకరాకు పెట్టుబడి ఎంత పెట్టారు?
రైతులు: ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల పెట్టుబడి పెట్టాం.
జగన్: ఇప్పుడు ఎన్ని బస్తాలు వచ్చేలా ఉంది?
రైతులు: పది బస్తాలు కూడా వస్తాయో లేదోనయ్యా..! కంకిలో 25 శాతం గింజలు కూడా వచ్చేలా లేవు.
జగన్: వారు (ప్రభుత్వం) చేసిన సాయం ఏమీ లేదు.. కనీసం తుపాన్ వచి్చన రోజైనా ఆదుకుందా?
రైతులు: సర్పంచ్ మమ్మల్ని తీసుకెళ్లి భోజనాలు పెట్టారు.
జగన్: మన ప్రెసిడెంట్ రాజు పెట్టించారు.. వాళ్లేమీ పెట్టలేదుగా!
రైతు సాయిబాబు: మమ్మల్ని ఆదుకునే వారు లేరు. ఎరువులు బ్లాక్‌లో కొన్నాం. గత ఐదు సంవత్సరాల్లో పంటల బీమా మీరు ఎలా చేశారో కూడా మాకు తెలియదు. మాది రూపాయి ఖర్చు లేదు. నాకు సబ్సిడీ పడింది. మొత్తం రూ.72 వేలు వచ్చాయి. ఇవాళ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టలేదు. కడదాం అని వెళితే టైం అయిపోయిందన్నారు.
రైతు రమేష్ బాబు: మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలనే మాట కూడా మర్చిపోయాం సార్..
జగన్: మన ప్రభుత్వ హయాంలో ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సమయానికి వచ్చేది. పెట్టుబడికి రైతు భరోసా ఇచ్చేవాళ్లం.
రైతు రమేష్ బాబు: ఇవాళ కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది..
రైతు సాయిబాబు: మీరున్న ఐదు సంవత్సరాలు ధైర్యంగా వడ్లు అమ్ముకున్నాం. మిల్లర్ల వద్దకు తీసుకువెళ్లి అమ్మాం.
రైతు రమేష్ బాబు: ఇప్పుడు వడ్లు మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు


