భక్తులకు ముప్పుతిప్పలు పెట్టిన టీటీడీ
కల్యాణోత్సవ రద్దీతో చేతులెత్తేసిన అధికారులు..!!
ఊంజాల్ సేవ లేకుండానే దర్శనానికి పంపిన వైనం
తదుపరి సేవలపైనా తీవ్ర ప్రభావం
తిరుమలలో భక్తులకు నిన్న(గురువారం, డిసెంబర్ 25) అధికారులు చుక్కలు చూపించారు. తలా ఒక ఉచిత సలహాలిచ్చి.. నిలబడ్డ క్యూలోనే.. మరోసారి వేచిచూసేలా చేశారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేయలేకపోవడం వల్ల ఈ దుస్థితి నెలకొందని పలువురు భక్తులు ‘సాక్షి’తో వాపోయారు. గురువారం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అలిపిరి వద్ద కూడా క్యూలైన్లలో ఉన్న భక్తులపై లాఠీఛార్జీ జరిగిన విషయం తెలిసిందే..! తిరుమల క్యూలైన్లలోనూ గందరగోళం నెలకొన్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కల్యాణోత్సవంలో..
గురువారం రద్దీ పెరగడంతో.. సుపథం ఎంట్రీ వద్ద సిబ్బంది కల్యాణోత్సవం భక్తులను నియంత్రించలేకపోయారు. దీంతో.. కొందరు టీటీడీ సిబ్బంది భక్తులను తప్పుదోవ పట్టించారు. ‘ఉదయం 10 గంటలకు సుపథం వద్ద క్యూలైన్‌లో నిలబడ్డాం. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. సెలవు రోజు, భక్తుల రద్దీని అంచనావేయలేకపోయిన టీటీడీ తొలుత ఒక్కరితోనే కల్యాణోత్సవం టిక్కెట్లు, ఆధార్ కార్డుల పరిశీలనకు నియమించింది.
భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వచ్చారా? లేదా? అని తనిఖీ చేసేందుకు ఓ మహిళా వలంటీర్.. రద్దీ నియంత్రణకు విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించింది. 11 గంటల వరకు కూడా మేము సగం లైన్ వరకు వచ్చాయం. వెనక్కి తిరిగి చూస్తే.. క్యూ ఇంకా పెద్దగానే ఉంది. అంతలో మెడలో టీటీడీ ఐడీకార్డు వేసుకున్న ఓ వ్యక్తి మా దగ్గరకు వచ్చి.. కల్యాణోత్సవం కోసం వేచిచూసేవారికి నేరుగా లోనికి అనుమతి ఉంటుందని చెప్పాడు. అంతే.. క్యూలైన్లో సగం వరకు ఉన్న మేము, మా వెనకాల నిలబడ్డ వారు కూడా అటుగా పరుగులు తీశారు.
తీరా అక్కడికి వెళ్తే.. కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. టీటీడీ వాళ్లు నేరుగా చెప్పొచ్చన్నారని పేర్కొనగా.. వారినే అడిగి లోనికి వెళ్లండని సమాధానం ఇచ్చాడు’ అని ఓ భక్తుడు ‘సాక్షి’తో వాపోయారు. తమతో ఇద్దరు చిన్నపిల్లలు, ఓ వృద్ధురాలు ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత భక్తులంతా తిరిగి క్యూలైన్లోకి రాగా.. మధ్యవరకు ముందు నిలబడ్డ భక్తులు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దీంతో తాము రెండుసార్లు క్యూలో నిలబడాల్సి వచ్చిందని పలువురు పేర్కొన్నారు.
ఉదయం 11.30 కావొస్తున్నా.. కల్యాణం క్యూలైన్ తగ్గకపోవడం.. ఆ సమయానికల్లా క్యూకట్టాల్సిన ఊంజాల్ సేవ, చిన్నారులతో వచ్చేవారు సుపథం వద్ద గుమికూడారు. దాంతో.. అధికారులు నేరుగా అనుమతిస్తామని ప్రకటించారు. ఈ చర్య వల్ల ఉదయం 10 గంటల నుంచి క్యూలైన్‌లో ఉన్న తాము చాలా ఆలస్యంగా లోనికి వెళ్లాల్సి వచ్చిందని హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఊంజాల్ భక్తులకూ అంతే..!
షెడ్యూల్ ప్రకారం ఊంజాల్ సేవ టికెట్ ఉన్న భక్తులు ఉదయం 11.30 నుంచి సుపథం వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఓ వైపు కల్యాణం టికెట్ భక్తులు లైన్‌లో ఉండగానే.. ఊంజాల్ సేవ వారు కూడా క్యూకట్టేశారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ‘కేవలం కల్యాణ సేవ భక్తులే క్యూలో ఉండాలి’ అని అనౌన్స్ చేసేవారు కూడా అక్కడ లేకపోవడంతో పరిస్థితి జటిలంగా మారింది. ‘మేము లైన్‌లో ఉండగానే.. మమ్మల్ని లోనికి పంపకుండా.. క్యూని ఆపేశారు. సుప్రభాతం టికెట్ ఉన్నవారు పక్కనుంచి రావాలని కోరారు.
ఒకసారి మోసపోయాం. ఈసారి కూడా అంతే అనుకుని క్యూలోనే ఉన్నాం. అయితే.. ఊంజాల్ సేవ వారు ముందు ఉండడంతో.. మేము అటు ముందుకు.. ఇటు వెనక్కి కదలలేకపోయాం’ అని అనంతపురానికి చెందిన మరో భక్తుడు ‘సాక్షి’కి వివరించారు. కల్యాణం భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. టికెట్ వెరిఫికేషన్ చేసే సిబ్బంది సంఖ్యను అప్పటికప్పుడు మూడుకు పెంచి.. భక్తులను లోనికి పంపారు. అయితే.. ఈ ఆలస్యం ప్రభావం తదుపరి సేవలపై తీవ్రంగా పడింది. ఊంజాల్ సేవ భక్తులను మధ్యాహ్నం 12 గంటల నుంచి లోనికి అనుమతించారు.
అయితే.. ఎలాంటి ప్రకటన లేకుండానే.. ఊంజాల్ సేవకు పంపకుండానే.. ఆ లైన్‌లో ఉన్న భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి తరలించారని హైదరాబాద్ శివార్లలోని బీరంగూడకు చెందిన భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మూడు నెలల క్రితమే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నా.. సాధారణంగా దర్శనానికి పంపారు. మాకు ఊంజాల్ సేవ మొక్కు ఉండగా.. దాన్ని తీర్చుకోలేకుండా టీటీడీ అధికారులు చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెల్‌ఫోన్ డిపాజిట్‌కు మరోసారి..
ఊంజాల్ సేవ భక్తులకు టికెట్ వెరిఫికేషన్, సెక్యూరిటీ చెకింగ్ వరకు సెల్‌ఫోన్ వెంట తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది. చెకింగ్ వద్ద సెల్‌ఫోన్లను డిపాజిట్ చేయాలి. అయితే.. ఊంజాల్ భక్తులను నేరుగా దర్శనానికి పంపిన అధికారులు భయట క్యూలైన్ వద్ద ఉన్న కౌంటర్‌లోనే సెల్‌ఫోన్ డిపాజిట్ చేయాలంటూ హుకుం జారీ చేశారు. దాంతో షాక్ తిన్న భక్తులు.. చేసేది లేక.. మళ్లీ బయటకు వచ్చి, 40 నిమిషాలు సెల్‌ఫోన్ డిపాజిట్ కోసం క్యూకట్టాల్సి వచ్చింది. కనీసం ఇలాంటి వారిని నేరుగా లోనికి పంపించలేదని మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ భక్తురాలు ‘సాక్షి’తో తెలిపారు.
ఇక చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులకు కల్పించే స్పెషల్ దర్శనం క్యూ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవ్వాల్సి ఉండగా.. దాన్ని కూడా ఆలస్యంగా మొదలు పెట్టడంతో.. చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రక్తదానం డోనర్ల దర్శనంలోనూ ఇలాంటి లోటుపాట్లే కనిపించాయని భక్తులు వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రద్దీ సమయాల్లో సమర్థులైన సిబ్బందిని సుపథం క్యూకౌంటర్ల వద్ద నియమించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
- సాక్షి వెబ్ డెస్క్


