సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీపై కూటమి సర్కార్ బురద జల్లడమే పనిపెట్టుకుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉందా? అంటూ ప్రశ్నించారు. కూటమి పాలనలో తిరుమలలో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిలో మళ్లీ తొక్కిసలాట టీటీడీ బోర్డు, ప్రభుత్వం నిర్లక్ష్యమే. భక్తుల భద్రతను గాలికి వదిలేశారు. వరస సెలవులతో భక్తులు ఎక్కువగా వస్తారనే ఇంగితజ్ఞానం లేదా?. ఎన్ని ఘటనలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా.. జాగ్రత్తలు తీసుకోరా..?. తిరుమల రావాలంటేనే భక్తులు భయపడేలా వ్యవహరిస్తున్నారు. తిరుమలలో పాలన చేస్తోంది టీటీడీ బోర్డు కాదు.. టీడీపీ పార్టీ. పొలిటికల్ డైవర్షన్స్ కోసం టీటీడీని వాడుకోవటం సిగ్గుచేటు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.
‘‘దయచేసి వెంకటేశ్వర స్వామికి రాజకీయాలు ముడిపెట్టకండి. సనాతన ధర్మం మాట్లాడే పవన్ వీటి గురించి పట్టించుకోరా?. ఇంకెన్నాళ్లు గత ప్రభుత్వం అంటూ బురదజల్లుతారు?. భక్తుల రద్దీ దృష్ట్యా చర్యలు తీసుకోలేని బోర్డు ఉండీ ఏం ఉపయోగం..?. భక్తులకు రక్షణ ఇవ్వలేని బోర్డు అవసరమా..?. మీకు చేతకాకపోతే తప్పుకోండి’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు.


