'దయలేని బాబు' దగా పాలన | YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

'దయలేని బాబు' దగా పాలన.. నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌

Nov 5 2025 5:29 AM | Updated on Nov 5 2025 8:51 AM

YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt

చంద్రబాబు ప్రతి అడుగులోనూ రైతన్నకు నష్టమే 

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తే ధాన్యం కొనుగోలు చేయం అని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారా?

రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా వ్యవహరిస్తోందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు 

మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌  

రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టమే.. వ్యవసాయం దండగ.. అన్న మైండ్‌ సెట్‌ మారాలి 

తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్ట పరిహారం, ఇన్సూరెన్స్‌ ఇవ్వాలి  

రబీ సీజన్‌ నుంచైనా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి 

విపత్తుల వేళ రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి ఇబ్బంది పెడతారా? 

31వ తేదీలోగా ఎన్యుమరేషన్‌ పూర్తి చేయాలని 30వ తేదీన ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తారా? 

24 గంటల్లో ఎక్కడైనా ఎన్యుమరేషన్‌ పూర్తి చేయడం సాధ్యమా? 

15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఎందుకు తగ్గించాలని చూస్తున్నారు?  

18 నెలల్లో 16 సార్లు విపత్తులతో రైతుకు నష్టం.. ఒక్కరికైనా రూపాయి నష్ట పరిహారం ఇచ్చారా? 

నేడు ఈ–క్రాప్‌ నిర్వీర్యం.. బీమాకు మంగళం.. ఆర్బీకే వ్యవస్థ నాశనం.. గిట్టుబాటు ధర లేదు 

మా హయాంలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,800 కోట్ల బీమా పరిహారం   

నాడు 85 లక్షల మందికి బీమా కవరేజ్‌.. నేడు 19 లక్షల మందికే పరిమితం  

మా హయాంలో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్‌లో జోక్యం  

ఆ ఐదేళ్లలో రూ.7,800 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల కొనుగోలు  

ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం 

తుపాన్‌తో నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి.. ఎలా పరిహారం ఎగ్గొడదామా అని ఆలోచనలు చేస్తుండటం దుర్మార్గం. ఎన్యుమరేషన్‌ అక్టోబర్‌ 31వ తేదీ నాటికి పూర్తి కావాలని చెబుతూ ఒక్క రోజు ముందు 30న ప్రొసీడింగ్స్‌ ఇవ్వడాన్ని ఏమంటారు? ఒక్క రోజులో ఎన్యుమరేషన్‌ అనేది ఎలా సాధ్యం? పంట నష్ట పరిహారం జాబితాలో పేరుంటే ధాన్యం కొనుగోలు చేయం అని చెప్పడం దారుణం. ఇలా రైతులను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ.. బెదిరిస్తూ.. పైకి మాత్రం రైతులను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్‌లా?

తుపాను కారణంగా వరి కంకుల సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించడం ఎన్యుమరేషన్‌ ప్రక్రియలో కీలకం. ఎన్యుమరేషన్‌ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితే లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్‌ ప్రాసెస్‌ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్‌ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానం? 
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 

కృష్ణా జిల్లా ఆకుమర్రు లాకు నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తుపాను దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగ.. రైతు అనే వాడు వేస్ట్‌.. అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయం, రైతుల విషయంలో చంద్రబాబు మైండ్‌­సెట్‌ మార్చుకోవాలి.. రైతులు రాష్ట్రానికి వెన్నెముక అని గుర్తించాలి. 

కష్టాల్లో ఉన్న రైతులను ఆదు­కోవడంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మారకపోతే బాధితుల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభా­విత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. పంట పొలాల్లో దిగి.. బాధిత రైతులతో మమేమకవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు. 

నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రు లాకు వద్ద బాధిత రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టం అని చెప్పారు.  రాష్ట్రంలో ప్రభు­త్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. 

‘మోంథా తుపాను వల్ల నష్టపోయి­న రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్ర­బాబు నాయుడు లండన్‌ పోతాడు.. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వచ్చి క్రికెట్‌ మ్యాచ్‌ చూడ­టానికి ముంబై పోతాడు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’ అని ఎత్తిచూపారు. 

పంటలు దెబ్బ తిన్న ప్రతీ రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని, పంటల బీమా పరిహారం కూడా ఇవ్వాలని, ప్రస్తుత రబీ సీజన్‌ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు. గత 18 నెలల్లో సంభవించిన విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

కృష్ణాజిల్లా నిడుమోలు వద్ద భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌
 
18 నెలల్లో ఒక్క రైతుకైనా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారా? 
రైతు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి మారుమూల ప్రాంతాలకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో తిరిగితేనే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు ఉన్నాయి. మోంథా తుపాను దాదాపు 25 జిల్లాలపై ప్రభావం చూపింది.  

⇒ అటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు కృష్ణా నుంచి కర్నూలు వరకు దాని ప్రభావం కన్పించింది. దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడూ ఊహించని విధంగా పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరి పంటకే ఎక్కువగా 11 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు మరో నాలుగు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి.  

⇒ వరి పంట గింజలు పాలు పోసుకున్న దశలో తుపాను విరుచుకుపడింది. తీవ్రమైన గాలులు, వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతింది. చంద్రబాబు 18 నెలల పాలనలో దాదాపు 16 సార్లు తుపానులు, వరదలు, అకాల వర్షాలు, కరువు వంటి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ 18 నెలల్లో ఏ రైతుకైనా ఒక్క సారైనా ఒక్క రూపాయి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారా? ఏ రైతుకైనా ఒక్కసారైనా పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్‌) ఇచ్చారా? అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తా అని హామీ ఇచ్చి.. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.ఐదు వేలతో సరిపెట్టారు. 

⇒ ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపాయి రాలేదు. ఇన్సూరెన్స్‌ రాలేదు. చివరికి ఎరువులు బ్లాకులో కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లోకి రైతులు వెళ్లిపోయారు. రూ.266కు దొరకాల్సిన యూరియా కట్టను ఏకంగా రూ.500, రూ.600 చొప్పున బ్లాకులో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అవసరాన్ని బట్టి బ్లాకులో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇలా కష్టాల సాగు చేసిన రైతులు తాము పండించిన పంటను అమ్ముదామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం మద్దతు ధరకు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది ధాన్యం 75 కేజీల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,750 రావాల్సి ఉండగా, రైతుల చేతికొచ్చింది మాత్రం కేవలం రూ.1,350 మాత్రమే. చంద్రబాబు హయాంలో ప్రతి అడుగులోనూ రైతు నష్టపోతూనే ఉన్నాడు.  


నాడు ప్రతి రైతుకు భరోసా  
⇒ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో వారిపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథ­కాన్ని ఐదేళ్ల పాటు అమలు చేసి అండగా నిలిచింది. మూడున్నర ఎకరాలున్న రైతులు సైతం దా­దా­పు రూ.70 వేలు, రూ.66 వేలు చొప్పున గతంలో బీమా పరిహారం డబ్బులు అందుకున్న పరిస్థితులను ఇక్కడి రైతులు గుర్తు చేసుకుంటు­న్నారు.  

⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు ఏ రైతు ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. విపత్తుల వేళ పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని ఏ రోజు ఏ రైతు ఆ ఐదేళ్లలో అధైర్య పడలేదు. కారణం.. పంట నష్టం జరిగితే జగనన్న ఉన్నాడు.. పైసా భారం పడకుండా తమ పంటకు బీమా చేయించాడని, తమకు డబ్బులొస్తాయని ధైర్యంగా ఉండేవారు. ప్రతి రైతుకు భరోసా ఉండేది.  

⇒ ఏదైనా విపత్తు వేళ పంటలకు నష్టం వాటిల్లితే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ డబ్బులు ఇస్తాడనే ధైర్యం ఉండేది. ఆ డబ్బులతో మరుసటి సీజన్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చనే ధైర్యం ఉండేది. సీజన్‌ మొదలయ్యే సరికే ప్రతి రైతుకు ఓ భరోసా ఉండేది. వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున ఇస్తారన్న నమ్మకం ఉండేది.   

⇒ ఆర్బీకే వ్యవస్థ అనేది రైతులను చేయి పట్టి నడిపించే వ్యవస్థగా ఉండేది. ప్రతీ రైతు వేసిన పంటకు ఈ–క్రాప్‌ జరిగేది. ఆర్బీకే పరిధిలోనే అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌.. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ రైతులకు అందుబాటులో ఉండే వారు. సచివాలయాలతో అనుసంధానం చేసి వలంటీర్లతో కలిసి రైతులను చేయిపట్టి నడిపించేవారు. ప్రతి రైతును.. అతను సాగు చేసిన పొలంలో నిలబెట్టి జియో ట్యాగ్‌ చేసి ఈ–క్రాప్‌ బుకింగ్‌ చేసే వారు. తద్వారా పంటకు ఎప్పుడు, ఏ ఇబ్బంది వచ్చినా రైతుకు ప్రభుత్వం తోడుగా నిలబడేది. 

 



ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వ జోక్యం  
⇒ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉండేది కాదు. ఆర్బీకే పరిధిలో ఏ పంటను ఏ రేటుకు కొనుగోలు చేసేది రైతులకు తె­లియజేసేవాళ్లం. ఆ రేట్ల కంటే తక్కువగా పడిపో­తే ప్రభు­త్వం జోక్యం చేసుకుంటుంది. మద్ద­తు ధరల వివరా­లు ఆర్బీకేలో ప్రదర్శించేవాళ్లం.

⇒ ఎక్కడ ఏ పంట రేటు తగ్గినా వెంటనే ఆర్బీకే అసిస్టెంట్‌ నుంచి ఎలెర్ట్‌ వచ్చేది. మార్క్‌ఫెడ్‌కు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హోదాలో ఉన్న జేసీలు వెంటనే మార్కెట్‌లో జోక్యం చేసుకునే వారు. ధరలు పడిపోయిన పంటలను కొనుగోలు చేసి, మార్కెట్‌లో పోటీని తీసుకొచ్చి «రైతుకు తోడుగా నిలబడేవారు. ఇందుకోసం కంటిన్యూస్‌ మానిటరింగ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొడ్యూస్‌ (సీఎం యాప్‌) అనే యాప్‌ ఆర్బీకే అసిస్టెంట్‌ చేతిలో ఉండేది. 

⇒ ఈ యాప్‌ ద్వారా గ్రామ స్థాయిలో ధరలను ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తూ ప్రతి రైతుకు బాసటగా నిలిచే వారు. ఇలా ఐదేళ్లలో ధర లేని సమయంలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కనీస మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం.  

⇒ అప్పట్లో రైతులు సాగు చేసిన ప్రతి పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేసేవాళ్లం. తద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం. దాదాపు 85 లక్షల మంది రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచితంగా పంటల బీమా అమలు చేశాం.  54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్‌ కింద రూ.7,800 కోట్లు జమ చేశాం. 

⇒ ప్రస్తుతం చంద్రబాబు హయాంలో కేవలం 19 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్‌ చేయించుకున్నారు. అది కూడా బ్యాంక్‌ రుణాలు తీసుకున్న వారు. మరి ప్రీమియం చెల్లించని మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి పంటల బీమా పరిహారం అందకుండా చేయడం దుర్మార్గం కాదా?

ఇదేం విడ్డూరం.. ఒక్క రోజు ముందు ప్రొసీడింగ్సా!?
⇒ తుపాన్‌తో నష్టపోయిన రైతులు ఆశ్చర్యం కలిగించే విషయాలు చెబుతున్నారు. మీ పొలంలో ఎన్యుమరేషన్‌ చేయడానికి ఎవరైనా వచ్చారా? అని అడిగితే.. ఈ పొలంలోకే కాదు రాష్ట్రంలో దెబ్బతిన్న ఏ పొలంలోకి, ఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్‌ చేసేందుకు ఎవరూ రాలేదన్న మాట విని్పస్తోంది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ అక్టోబర్‌ 30వ తేదీన ప్రొసీడింగ్స్‌ (ఉత్తర్వులు చూపిస్తూ) ఇచ్చారు.

⇒ ఎన్యుమరేషన్‌ ఆఫ్‌ క్రాప్‌ డామేజ్, సోషల్‌ ఆడిట్‌ 31వ తేదీ కల్లా పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. ఒక్క రోజులో ఎన్యుమరేషన్‌ (పంట నష్టం మదింపు), సోషల్‌ ఆడిట్‌ అయిపోవాలట! ఎలా సాధ్యమో మీరే చెప్పండి. పైగా ఈ గడువులోగా చేయకపోతే యాక్షన్‌ తీసుకుంటామని ఇదే ప్రొసీడింగ్స్‌లో స్పష్టం చేశారు. క్రాప్‌ డామేజ్, ఎన్యుమరేషన్, సోషల్‌ ఆడిట్, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అంతా పూర్తి చేసి తుది జాబితాలను 1వ తేదీకల్లా వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌కు పంపాలని పేర్కొన్నారు.

⇒ ఈ ఆదేశాలు చూస్తుంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. ఎన్యుమరేషన్‌ అనేది ఎవరూ పంట పొలాల వద్దకు వచ్చి చేసే పరిస్థితి లేదు. గాలులు, తుపాను వల్ల ధాన్యం సుంకు విరిగిపోయింది. ఎన్యుమరేషన్‌ చేసేటప్పుడు ఏ అధికారి అయినా సరే పొలంలో అడుగుపెట్టాలి. వరి కంకులను చూడాలి. సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించాలి. ఎన్యుమరేషన్‌ ప్రక్రియలో ఈ విషయాన్ని స్పష్టంగా రాయాలి. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్‌ ప్రాసెస్‌ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్‌ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే విధానం?

ధాన్యం కొనబోమని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారా?
⇒ ఎన్యుమరేషన్‌ కోసం ఎందుకు పొలం వద్దకు రాలేదని ఏ రైతు అయినా అడిగితేæ వారిని వెటకారం చేసి మాట్లాడుతున్నారు. పైగా ప్రతి రైతుకు వ్యవసాయ శాఖాధికారి నుంచి తాము చెప్పిన పత్రాలు (ఆధార్, 1బి జిరాక్స్, కౌలు గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్‌ పుస్తకం) సమరి్పంచిన వారి పొలాల్లో మాత్రమే పంట నష్టం పరిశీలించి జాబితాలో పెడతామని మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కూడా చెప్పిస్తున్నారు. అదీ అక్టోబర్‌ 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా తీసుకొస్తేనే స్వీకరిస్తామని, లేదంటే ఆ పత్రాలు స్వీకరించం అని తెగేసి చెబుతున్నారు.  

⇒ మరొక వైపు ‘దయచేసి రైతులు గమనించగలరు. ఇప్పుడు పంట నష్టం చేయించుకు­న్న రైతుల నుంచి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయబడదు’ అని నిర్ద­యగా మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఎవరైనా అడిగితే వాళ్ల ధాన్య­ం కొనుగోలు చేయరట! అంటే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారా?

⇒ ఎక్కడైనా తుపాను వచ్చినపుడు  ప్రభుత్వం మానవత్వం ప్రదర్శించాలి. నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకునేందుకు ముందుకు రావాలి. పంట నష్టపరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ), పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్‌) వచ్చేలా చేయాలి. అంతే కాకుండా వారి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాలి. అది ఇస్తే ఇది ఇవ్వం.. ఇది ఇస్తే ఆది ఇవ్వం.. అని చెబు­తూ రైతులను బెదిరించడం దారుణం. దీన్నిబట్టి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది.

మా హయాంలో  కచ్చితమైన చర్యలు
⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి తుపానులు వచ్చే ముందు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించే వాళ్లం. వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో జిల్లా యంత్రాంగం కలిసి పనిచేసేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్ల పరిధి తగ్గించాం. తక్కువ నియోజకవర్గాలకు ఎక్కువ మంది కలెక్టర్లు, జేసీలు వచ్చారు. ఇలాంటి విపత్తుల వేళ ప్రాణ నష్టం జరగకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వాళ్లం. కలెక్టర్ల చేతుల్లో కావాల్సినంత డబ్బులు పెట్టేవాళ్లం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్లం.

⇒ వారం.. పది రోజుల టైం ఇస్తున్నాం.. ఎన్యుమరేషన్‌ పక్కాగా, పారదర్శకంగా చేయాలని చెప్పేవాళ్లం. తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు కలెక్టర్‌ పనితీరు ఏలా ఉంది.. పంట నష్టం కోసం ఎన్యుమరేషన్‌ ఎలా జరిగింది.. అన్ని సదుపాయాలు మీకు కల్పించారా.. లేదా.. వంటి వివరాలు ప్రజలను అడిగి తెలుసుకునేవాణ్ని. ఏ ఒక్కరైనా అధికారులు బాగా చేయలేదని చెబితే ఉద్యోగం పీకేస్తామని గట్టిగా చెప్పే వాళ్లం. అందువల్ల అధికారుల్లో ఒక భయం ఉండేది.  
ఆకుమర్రు లాకు వద్ద పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్‌ జగన్‌ 

ఈ–క్రాప్‌ను గాలికొదిలేశారు..
⇒ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఈ క్రాప్‌ అనేది రైతులకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్‌ తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతులను నిలబెట్టి, జియో ట్యాగ్‌ చేసి, వారి ఫొటోతీసిసి అప్లోడ్‌ చేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఈ–క్రాప్‌ నిర్వచనం మార్చేశారు. ఈ–క్రాప్‌ చేశామంటే చేశామన్నట్టుగా ఉంది. టీడీపీ వాళ్లయితే ఉన్న భూమి కంటే ఎక్కువగా సాగు చేసినట్టు చూపిస్తున్నారు.

⇒ ఇందుకు బాపట్ల జిల్లాయే ఉదాహరణ. ఈ జిల్లాలోని పర్చురులో 112 శాతం, జే.పంగలూరులో 114 శాతం.. బల్లికురవలో 115 శాతం.. వేటపాలంలో 117 శాతం.. చీరాలలో 122 శాతం.. చినగంజాంలో 128 శాతం చొప్పున ఈ–క్రాప్‌ నమోదైనట్టుగా చూపించారు. అంటే ఉన్న భూమి కన్నా సాగైన భూమి ఎక్కువగా ఉందా? ఉన్నభూమి 100 శాతమైతే 128 శాతం విస్తీర్ణంలో సాగైనట్టు చూపిస్తున్నారు. అదెలా సాధ్యం! ఈ–క్రాప్‌ను ఏ విధంగా నీరుగారుస్తున్నారో ఇంతకంటే ఉదాహరణలు కావాలా?

⇒ ఇలాంటి విపత్తుల వేళ కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో తిరిగే వారు. వారం, పది రోజుల తర్వాత నేను వెళ్లే వాడిని. పరిస్థితిని అంచనా వేసే వాళ్లం. ముఖ్యమంత్రి వస్తాడేమో అనే భయంతో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా కలెక్టర్లు పనిచేసే వారు. ఈ రోజు ప్రభుత్వ పనితీరు చూస్తుంటే.. ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి.  

⇒ రైతుకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే.. ఒకరోజు చాపర్‌లో అలా అలా తిరుగుతాడు. మరుసటి రోజు లండన్‌ పోతాడు. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వస్తాడు.. మరుసటి రోజు ముంబైలో క్రికెట్‌ మ్యాచ్‌ చూడ్డానికి పోతాడు. ఇక్కడ రైతుల పరిస్థితి ఏడవ లేక.. కడుపులో బాధ తట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ ఒక్క కౌలు రైతుకు కౌలు కార్డులు ఇవ్వడం లేదు. ఇస్తే వాళ్లకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే దురాలోచనతో ఉన్నారు.

ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తున్నారు?
⇒ ఎన్యుమరేషన్‌ లెక్కలు ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు? తుపాను వల్ల దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇంత పంట నష్టం ఎప్పుడు జరగలేదని మీ ఎల్లో మీడియాలో, మీ గెజిట్‌ పేపర్‌ ఈనాడులోనే తొలుత రాశారు. ఇప్పుడు ఎందుకు తగ్గించి రాస్తున్నారు? ఎన్యుమరేషన్‌ చేసేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడలేకపోతున్నారు? పైగా ఎన్యుమరేషన్‌ చేస్తే మీ పంటను కొనుగోలు చేయం అని ఎందుకు భయపెట్టిస్తున్నారు? రైతుకు మంచి చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తోంది?

⇒ మీ తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం (ఇన్సూరెన్స్‌) డబ్బులు రావడం లేదు. ఇన్సూరెన్స్‌ డబ్బులు కట్టి ఉండి ఉంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నష్టపోయిన ప్రతి రైతుకు కనీసం రూ.25 వేలకు పైగా పరిహారం వచ్చేది. మీ తప్పిదం వల్ల వారికి ఈ పరిహారం అందకుండా పోయింది. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం వల్ల నష్టం జరిగింది. 

కాబట్టి ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్‌ డబ్బులు కూడా వచ్చేలా చేయాల్సిన బాధ్యత మీదే. అలా చేయాలని రైతుల తరఫున డిమాండ్‌ చేస్తున్నాం. 18 నెలల్లో 16 సార్లు రైతులు నష్టపోయారు. మీరు తగ్గించి, కోతలేసి వేసిన లెక్కల ప్రకారమే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.600 కోట్లు ఇవ్వాలి. ఆ బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా. రబీ సీజన్‌ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement