తిరుపతి కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుంటున్న మహిళ
రాష్ట్రవ్యాప్తంగా పలు కలెక్టరేట్ల వద్ద ఆత్మహత్యాయత్నాలు
ఎన్ని అర్జీలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కావట్లేదంటూ ఆగ్రహం
ఈ దుర్మార్గ పాలనలో బతుకీడ్చలేమంటూ ఆవేదన
టీడీపీ నేతల వేధింపులతో తిరుపతి కలెక్టరేట్ వద్ద ఇద్దరు మహిళల
ఆత్మహత్యాయత్నం.. బాపట్ల కలెక్టరేట్ వద్ద పురుగు మందు తాగిన వ్యక్తి
కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి మహిళ యత్నం
బాపట్ల/తిరుపతి అర్బన్/ మచిలీపట్నం అర్బన్: సమస్యలు పరిష్కారం కాకపోవడం, కూటమి నేతల వేధింపులు తాళలేక సోమవారం రాష్ట్రంలోని కలెక్టర్ కార్యాలయాల వద్ద పలువురు ఆత్మహత్యాయత్నం చేశారు. భూ వివాదానికి సంబంధించిన సమస్యపై ఎన్ని అర్జీలు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని బాపట్ల జిల్లాకు చెందిన వ్యక్తి, ఇంటి స్థలానికి సంబంధించి కూటమి నేతల వేధింపులు భరించలేక తిరుపతి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు, అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా వితంతు పింఛను రావడంలేదని కృష్ణా జిల్లాకు చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు.
టీడీపీ నేతల వేధింపులతో..
కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతల వేధింపులు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ఇంటి స్థలాల విషయంలో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ టీడీపీ నాయకులు తరచూ తమ ఇంటికి పోలీసులను పంపి వేధిస్తున్నారని తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం ఇద్దరు మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు వెంకటసుబ్బమ్మ, లక్ష్మీదేవి మీడియాకు తమ సమస్యను తెలిపారు. తిరుపతి నగరం సంజయగాంధీ కాలనీలో తమ ఇద్దరికి ఇంటి స్థలాలు ఉన్నాయని చెప్పారు. రేకులను ఏర్పాటు చేసుకుని 20ఏళ్లకు పైగా జీవనం సాగిస్తున్నామన్నారు.
తహసీల్దార్ తమకు ల్యాండ్ ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. 20ఏళ్లకు పైగా మున్సిపాలిటీకి ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తిరుపతి నగరంలో 18 రోడ్లను విస్తరించారని, అందులో తమ ఇళ్ల సమీపంలోనూ కొత్త రోడ్లు ఏర్పాటు చేశారన్నారు. దీంతో అక్కడ ఇంటి స్థలాల ధరలు అత్యధికంగా పెరిగినట్లు వెల్లడించారు. అనంతరం తాము రేకుల ఇళ్లను తొలగించి చిన్నపాటి భవనాన్ని నిర్మించుకుంటున్నామని, ఈ క్రమంలో టీడీపీకి చెందిన రజనీకాంత్ అనే నాయకుడు తమ అనుచరులను పంపించి ఇంటి నిర్మాణాలను అడ్డుకుంటున్నారని ఆవేదన చెందారు.
కోర్టును ఆశ్రయిస్తే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, అయినప్పటికీ టీడీపీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేపదే తమ ఇంటికి పోలీసులను పంపుతున్నారని వాపోయారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా టీడీపీ నేతకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక సోమవారం కలెక్టరేట్ వద్ద కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకుని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారని, విచారణ చేసి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు.
వితంతు పింఛను రావట్లేదంటూ..
కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ‘మీకోసం’లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యనమలకుదురు డొంక రోడ్డు ప్రాంతానికి చెందిన తోట కృష్ణవేణి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి పోలీసులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కృష్ణవేణి తన కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి సమావేశానికి హాజరై సీఐ శీను వద్ద తమ సమస్యను వివరిసూ్తనే ఒక్కసారిగా పెట్రోల్ సీసా తీసి ఒంటిపై పోసుకుంది. వెంటనే అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆమెను తన వద్దకు పిలిపించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణవేణి కుమార్తె లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. తన తల్లికి వితంతు పింఛను రాకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, విద్యుత్ బిల్లు పేరు మార్పు సాధ్యం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చింది.
పురుగు మందు తాగి..
భూ వివాదానికి సంబంధించి ఎన్ని అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి పురుగుమందు తాగి సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు అప్రమత్తమై అతడిని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చిన్నగంజాం మండలం మున్నంవారిపాలేనికి చెందిన బాధితుడు మార్పు బెన్ను కథనం మేరకు..‘1981లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 22 కుటుంబాలు, సర్వే నంబర్ 1158 లో ప్రభుత్వం మంజూరు చేసిన 56 ఎకరాలను సాగు చేసుకుంటున్నాయి.
ఏడేళ్ల క్రితం మా భూమిని మన్నె సునీల్ చౌదరికి లీజుకు ఇచ్చాం. అతడు లీజు సక్రమంగా చెల్లించకపోగా ఆ భూమిలో చేపల చెరువులు వేసి అతడి భార్య రాధిక పేరుతో సర్వే నంబర్ 1159తో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి చేపల చెరువులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించుకొని సర్వే నంబర్ 1158 భూమికి సంబంధించిన చెరువులను సాగు చేసుకుంటున్నాడు. మా భూమిని మాకు అప్పగించాలని గతనెల 13న గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశాం. ఆ ఫిర్యాదు విద్యుత్ శాఖ ఏడీ వద్దకు చేరింది. అక్కడి నుంచి చిన్న గంజాం విద్యుత్ ఏఈకి వచ్చింది.
ఈ సమస్య నా పరిధిలోనిది కాదని ఏఈ సమాధానమిచ్చారు. ఒకసారి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ బిగించాక దాన్ని రద్దు చేయలేమని ఏఈ చెబుతున్నారు. మొదట్లో టీడీపీ నేత శ్రీను మా పొలాలను లీజుకు తీసుకున్నాడు. అతని నుంచి సునీల్ తీసుకొని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మా పొలాలకు లీజులు చెల్లించడం లేదు. మా పొలాలను స్వాధీనం చేయకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తాను’ అని స్పష్టం చేశాడు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
