వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో పోలీసుల ఓవర్ యాక్షన్
ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కడికక్కడ కుయుక్తులు
ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటన దిగ్విజయం
గుడివాడ రూరల్: నాయకులకు నోటీసులు... కార్యకర్తలపై ఆంక్షలు... ప్రజలకు అడ్డంకులు... మొత్తంగా పర్యటనను విఫలం చేయడానికి కుయుక్తులు..! కానీ, అశేష జనం ముందు... వారి అభిమానం ముందు ఇవేమీ నిలవలేదు...! పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం పన్నిన పన్నాగాలు విఫలమయ్యాయి. కృష్ణా జిల్లాలో మోంథా తుపాను బాధిత రైతులను పరామర్శించి, వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యకమ్రం దిగ్విజయమైంది.
జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులను బెదిరించింది. తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారు. అయితే, ఇవేవీ ఫలించలేదు. పైగా ప్రజలు భారీగా, స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్‌కు దిగారు. దీనికి గోపువానిపాలెం ఘటన సరైన ఉదాహరణ.
జగన్ వస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు గోపువానిపాలెం అడ్డ రోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేడ్లు, రోప్‌లతో అడ్డగించారు. రోడ్డు మార్జిన్‌లో నిల్చుని ఉన్నా చెదరగొట్టారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సంగతి తెలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అక్కడకు వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు.
అయితే, సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో కైలే అనిల్, ౖవైఎస్సార్‌సీపీ శ్రేణులు పమిడిముక్కల సీఐ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు.
దారులు మూసి.. చెక్‌పోస్టులు పెట్టి...
వైఎస్ జగన్‌ను చూసేందుకు అభిమానులు కార్లు, బైక్‌లు, ట్రాక్టర్లతో పాటు కాలినడకన తండోపతండాలుగా తరలిరావడంతో కూటమి ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపింది. వందలమందిని మోహరించి బారికేడ్లు, తాళ్లతో చెక్‌పోస్టులు పెట్టి అడ్డంకులు సృష్టించింది.
వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలకు ఉన్న అన్ని దారులను మూసివేయించింది. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్‌ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ వైఎస్ జగన్‌కు సైతం షరతులు విధించింది. 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ అధికార దర్పం చూపించింది.
ప్రధాన కూడళ్లు జనసంద్రం... పోలీసుల అవాక్కు
రైతులు వైఎస్ జగన్‌ను కలవకుండా భారీగా బలగాలను మోహరించినా, రోప్ పార్టీలతో అడ్డుకునే ప్రయత్నం చేసినా, ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ నిలిపివేసినా ప్రధాన కూడళ్లు జనసంద్రంగా మారడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. మరోవైపు కూటమి పాలనలో తమకు జరుగుతున్న అన్యాయాలు, ఎదురవుతున్న నిర్లక్ష్యంపై రైతులు, ప్రజలు జగన్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. కాగా, రైతులు, ప్రజలు, అభిమానులు పోటెత్తడంతో వైఎస్ జగన్ పర్యటన ఉదయం 9.45 కు మొదలై సాయంత్రం 5 గంటల వరకు సాగింది.
మచిలీపట్నం, గూడూరుల్లోనూ...
మచిలీపట్నంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ రాక కోసం వేచి ఉండగా బందరు డీఎస్పీ చప్పిడి రాజా ఇంతమంది ఇక్కడ ఉండొద్దంటూ చెదరగొట్టారు. బైక్‌లపై ర్యాలీగా కార్యకర్తలు, అభిమానులు వచ్చే క్రమంలో తాళాలు లాక్కునేందుకు ప్రయతి్నంచారు. మధ్యాహ్నం బ్రిడ్జి నీడ కింద ఉండగా ఇక్కడ ఉండొద్దని ఇనగుదురు సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనాల పెగ్గులు తీసేయమని సిబ్బందికి హుకుం జారీ చేశారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ నేత పేర్ని కిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు, అభిమానులు మచిలీపట్నం వైపు వెళ్లకుండా చెక్‌పోస్టు ఏర్పాటు చేసి దారి మళ్లించారు. డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతకుముందు తాడిగడపలోనూ రైతులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వస్తున్న యువతను ఆపి తాళాలు లాక్కున్నారు. మచిలీపట్నం, సుల్తాన్‌నగర్, ఎస్‌ఎన్ గొల్లపాలెంలో బారికేడ్లు పెట్టి ప్రజలను వెళ్లనివ్వలేదు. దీంతో రైతులు పొలాల నుంచి నడుచుకుంటూ జగన్ వద్దకు చేరుకున్నారు.
గండిగుంట, నెప్పల్లి సెంటర్‌లో పోలీసులు ఆటంకాలు కల్పించారు. జగన్ కాన్వాయ్‌తో పాటు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. పామర్రు, బల్లిపర్రుకు భారీగా చేరుకున్న రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు ఆపేశారు. మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి నుంచి రామరాజుపాలెం వైపు ఎవరినీ రానివ్వకుండా అడ్డరోడ్డ వద్ద బారికేడ్లను పెట్టారు.
పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామరాజుపాలెం అడ్డరోడ్డు నుంచి గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. బందరు వైపు నుంచి సీతారామపురం గ్రామానికి వెళ్లే రోడ్డుపై బారికేడ్లతో ఓవర్‌యాక్షన్ చేశారు. కనీసం బైక్‌లనూ అనుమతించలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.
తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి వరికోటి అశోక్‌బాబును అదుపులోకి తీసుకుని, ఆయనవెంట వచ్చిన వాహనాలతో పాటు స్టేషన్‌కు తరలించారు. సీతారామపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు కవ్వించారు. అయినా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రతిఒక్కరూ అత్యంత సంయమనం పాటించారు.


