సాక్షి, గుంటూరు: టీడీపీ ఆఫీస్ దాడి కేసును రీఓపెన్ చేసి మరీ అక్రమ అరెస్టులు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై జరిగిన విధ్వంసం విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. హిందూపురం ఘటనకు నిరసనగా.. సోమవారం గుంటూరులో అంబటి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
హిందూపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపైనా దాడి చేశారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే.. ఆ కేసును రీ ఓపెన్ చేసి మరీ అమాయకులను జైలుకు పంపించారు. కేవలం మీ ఆఫీసుపై దాడి జరిగిందని వేధింపులకు దిగారు. మరి ఇప్పుడు చేస్తోంది ఏంటి?..
దాడికి నిరసనగా ఆందోళన చేసేందుకు ప్రయత్నిస్తే వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులతో అరెస్ట్ చేయిస్తారా?.. పోలీసులు మరీ టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. డీజీపీ కూడా మేం ఫోన్లు చేస్తే స్పందించరు..
ఎమ్మెల్యే బాలకృష్ణ మీద చేసింది రాజకీయ విమర్శలు. అంత మాత్రానికి దాడుల సంప్రదాయం సరికాదు. మరి గతంలో బాలకృష్ణ చేసింది ఏంటి?.. అసెంబ్లీలోనే మాజీ సీఎం జగన్‌ను ఆయన సైకో అనలేదా?.. నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని అవమానిస్తూ మాట్లాడలేదా?. అసెంబ్లీకి తప్పతాగొచ్చి బాలకృష్ణ మాట్లాడారు. కానీ, ఆ టైంలో ఆయన చేసింది తప్పని ఎవరూ చెప్పలేదు. ఇది న్యాయమా?.. ధర్మమా?.. బాలకృష్ణ ఎవరైనా సరే తాను చేసిన పనులకు క్షమాపణలు చెప్పాలి. అప్పటిదాకా వైఎస్సార్‌సీపీ ఆందోళన కొనసాగిస్తుంది.

చంద్రబాబుదంతా డ్రామానే
చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కరించలేక కార్మికులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు విశాఖలో ఇదే తరహాలో సమ్మిట్ పెట్టారు. చంద్రబాబు చేసేదంతా నాటకం.. బూటకం అని అన్నారు.
గుంటూరు లాడ్జ్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నియోజకవర్గ సమన్వయకర్తలు నూరి ఫాతిమా, దొంతి రెడ్డి వేమారెడ్డి ,అంబటి మురళి, వనమా బాల వజ్రపు బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బాలయ్య కామెంట్స్: వైఎస్ జగన్ ఏమన్నారంటే..


