తిరుమల: తిరుమలల వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటి నుండి సర్వదర్శనంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. దర్శన టికెట్టు లేని భక్తులకు క్యూలైన్‌లోకి అనుమతిస్తోంది టీటీడీ. ఉదయం వరకూ కంపార్ట్‌మెంట్లలో ఉంచి వేకువజాము దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 1,37,309 గా ఉందని టీటీడీ తెలిపింది. రెండు రోజుల హుండీ ఆదాయం 7.04 కోట్లుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. బధవారం(డిసెంబర్ 31 వతేదీ) వైకుంఠ ద్వాదశి కావడంతో ఉదయం శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణి పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిమిత సంఖ్యలోనే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని, ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే రేపటి వరకు దర్శనం ఉంటుందని వెల్లడించారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనంలో భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.


