తాడేపల్లి : సీఎం చంద్రబాబు ఎక్కడకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే,వైఎస్సార్‌సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. ఆయన కొద్ది రోజులుగా ఎందుకు కనుబడుటం లేదని, ఎక్కడకు వెళ్లారో ప్రజలకు చెప్పాలన్నారు. ఈరోజు(గురువారం, జనవరి 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. చంద్రబాబు పర్యటనపై ప్రజలకు పలు అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలన్నారు.
‘సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తే ఆ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రకటించటం లేదు?, చివరికి జీఏడీ(సాధారణ పరిపాలన శాఖ )కి కూడా చంద్రబాబు పర్యటన గురించి తెలియకపోవడం ఏంటి?, సొంత ఎల్లోమీడియాకి కూడా చంద్రబాబు ఎక్కడకు వెళ్లారో తెలియదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా కనపడటం లేదు. చివరకు మంత్రులు కూడా రాష్ట్రంలో లేరు. చంద్రబాబుది అధికార పర్యటనో వ్యక్తిగత పర్యటనో ఎందుకు చెప్పటం లేదు?, కొన్ని పత్రికల్లో రకరకాల వార్తలు రాస్తున్నాయి.
వైద్యం కోసం వెళ్లారనీ, ఇతర పనుల మీద వెళ్లారనీ రాశాయి. ఎవరికీ చంద్రబాబు పర్యటనపై క్లారిటీ లేదు. సింగపూర్ అనీ, బాలి అనీ, జపాన్ అనీ, లండన్ వెళ్లాడనీ పత్రికలు రాస్తున్నాయి. అసలు చంద్రబాబు ఎక్కడకు వెళ్లారు?, చంద్రబాబు, లోకేష్ మధ్య సీఎం కుర్చీ కోసం పోరు జరుగుతోంది. లోకేష్ వలనే చంద్రబాబుకు కుర్చీ గండం ఉంది. లోకేష్ లండన్‌లో ఉన్నాడని తెలిసి చంద్రబాబు తన విమానాన్ని మరో దేశానికి మళ్లించారు. గతంలో జగన్ తన కుమార్తె కోసం లండన్ వెళ్తే టీడీపీ నేతలు రచ్చరచ్చ చేశారు.
మరి ఇప్పుడు చంద్రబాబు పర్యటన గురించి ఎందుకు బయట పెట్టటం లేదు?. మూడు హెలికాప్టర్లు, మూడు విమానాల్లో ముగ్గురు నేతలు తిరుగుతూ విలాసాలు చేస్తున్నారు. విమానాలు, హెలికాఫ్టర్లకు అయ్యే ఖర్చు ఎంత?, సొంత ఖర్చుతో ప్రయాణాలు చేస్తే మాకు సంబంధం లేదు. రాష్ట్ర ఖజానాను ఎందుకు ఖాలీ చేస్తున్నారు?, ఆ పర్యటనల వలన ఏపీకి కలుగుతున్న ప్రయోజనం ఏంటి?, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విమానాల ఖర్చులను బయట పెట్టాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మాత్రం డబ్బుల్లేవని ఎలా అంటారు?, సూపర్ సిక్స్ పేరుతో మోసం చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్నది 420 పనులే. కొత్త సంవత్సరం కానుకగా రోడ్ సెస్ పేరుతో పన్ను విధించారు. కరెంటు ఛార్జీలు మరో రూ.4 వేల కోట్లు పెంచుతున్నారు. ఈ బిల్లులు, పన్నులు చెల్లించలేక జనం అల్లాడిపోతున్నారు’ అని మండిపడ్డారు.



