
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్లను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ అంశం మొదలుపెట్టగా.. ఆ వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దానిని కొనసాగించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మీద కాస్త దురుసు వ్యాఖ్య చేశారు. ఇది అటు అభిమానుల మధ్యే కాదు.. ఇటు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు.. పవన్ కల్యాణ్ మౌనంపై ఓ రిపోర్టర్ వైఎస్ జగన్‌ను స్పందన కోరారు. ‘‘అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి?. పనిపాట లేని సంభాషణ చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుతించారు?. అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్‌కు బుద్ది లేదు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోంది. అలా మాట్లాడినందుకు సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి’’ అని జగన్ అన్నారు. ఇదిలా ఉంటే..
శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందిస్తూ చిరంజీవి ఆనాడే ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమా వాళ్లకు ఎలాంటి అవమానం జరగలేదని, ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనను సాదరంగా ఆహ్వనించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
