
సాక్షి, అమరావతి: సినిమా వాళ్లను పిలిచి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అవమానించారంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్(Kamineni Srinivas) అబద్ధపు ప్రకటన రాజకీయ దుమారం రేపింది. అయితే ఈ ప్రకటనపై ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ స్పీకర్‌కు శనివారం విజ్ఞప్తి చేశారు.
‘‘మొన్న సభలో నేను చేసిన వ్యాఖ్యలు అపార్థానికి దారి తీశాయని భావిస్తున్నాను. అందుకే రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నా’’ అని స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో చిరంజీవి సహా.. హీరోలను జగన్ అవమానించినట్లు మాట్లాడిన మాటలను తొలగించాలని కోరారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని, సినిమా వాళ్లను అవమానించినట్టు కామినేని అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. ‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి వెళ్లినప్పుడు, వారికి సరైన గౌరవం ఇవ్వలేదు. జగన్ వారిని కలవడానికి ఆసక్తి చూపలేదు. చివరికి చిరంజీవి గారు ఒత్తిడి చేయడంతోనే జగన్ కలవడానికి అంగీకరించారు’’ అని అన్నారు. కామినేని వ్యాఖ్యలను బాలకృష్ణ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో చిరుపై బాలయ్య నోరు పారేసుకున్నారు.
అయితే.. కాసేపటికే కామినేని అబద్ధాలు చెప్పారంటూ స్వయంగా చిరంజీవి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్ తనను సాదరంగా ఆహ్వానించారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో.. వివాదం మరింత రాజుకుంది.

ఇంకోవైపు వైఎస్ జగన్‌పైనా అనుచిత వ్యాఖ్య చేయడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సైతం బాలయ్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అయితే కామినేని మాటలు టీడీపీ మెగా అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారితీయగా.. పవన్ జనసేన మాత్రం సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయాయి. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు మౌనంగా ఉండిపోవడం గమనార్హం.