
చిరంజీవిని ‘ఎవడు’ అంటూ పూచికపుల్లలా తీసివేస్తూ బాలకృష్ణ తూలనాడినా స్పందనే లేదని చిరు అభిమానులు, కాపు సామాజిక వర్గం ధ్వజం
తన తల్లిని అవమానించారని నాడు లోకేశ్‌ను విమర్శించి.. ఇప్పుడు రాజకీయాల కోసం అదే చినబాబుకు జైకొడుతున్న వైనం
డీఎస్సీపై లోకేశ్‌ను కీర్తిస్తూ ప్రకటన చేసిన పవన్‌కు బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై స్పందించే తీరిక లేదా? అంటూ మండిపాటు
మెగా కుటుంబంపై ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నా పవన్ మౌనంపై చిరు అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు
తన సోదరుడు చిరంజీవిని వైఎస్ జగన్ అవమానించారంటూ ఎన్నికల ముందు కూటమి నేతలతో జట్టు కట్టి దుష్ప్రచారం
ఆ విష ప్రచారాన్ని తాజాగా స్వయంగా ఖండించిన మెగాస్టార్
నాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ తనను సాదరంగా ఆహ్వానించి గౌరవించారని వెల్లడి
తమ అభ్యర్థనతోనే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతించిదని స్పష్టీకరణ
నాడు చంద్రబాబుతో జట్టు కట్టి పవన్ చేసిన ప్రచారంలో నిజం లేదని తేల్చిన ‘చిరు’
ఆ విమర్శలన్నీ బాబు రాజకీయ లబ్ధి కోసమేనంటున్న కాపు నేతలు, చిరు అభిమానులు
మా బ్లడ్ వేరు.. వాళ్ల బ్లడ్ వేరు.. సంకర జాతి.. అలగా జనం.. అంటూ గతంలోనూ బాలయ్య తీవ్ర అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: చిరంజీవిని ‘ఎవడు’ అంటూ పూచికపుల్లలా తీసివేస్తూ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అధికారంలో ఉండి కూడా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించకపోవడంపై మెగాస్టార్ అభిమానులు, కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. ఓ వైపు బాలకృష్ణపై మండిపడుతూనే.. పవన్‌కళ్యాణ్ సైతం తన సొంత సోదరుడిని దారుణంగా అవమానించి 48 గంటలు గడిచిపోయినా నోరు విప్పకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవే స్వయంగా స్పందించి బాలయ్య వ్యాఖ్యలను ఖండించినా పవన్ మాత్రం కిమ్మనకపోవడం ఏమిటని తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ జ్వరంతో బాధపడుతూ కూడా గురువారం నిర్వహించిన డీఎస్సీ సభకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ను అభినందిస్తూ ప్రకటన జారీ చేసిన పవన్‌కళ్యాణ్... బాలయ్య వ్యాఖ్యలపై పూర్తి మౌనం పాటించడాన్ని తప్పుబడుతున్నాయి.
ఆ విష ప్రచారాన్ని ఖండించిన ‘చిరు’..
చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు గత ప్రభుత్వ హయాంలో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసినప్పుడు సాదరంగా ఆహ్వానించి గౌరవిస్తే.. ఎన్నికల ముందు కూటమి నేతలు పవన్‌తో జతకట్టి దు్రష్పచారం చేయటాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని తాజాగా స్వయంగా చిరంజీవే ఖండించటాన్ని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి విదేశాల్లో ఉండి కూడా తీవ్రంగా తప్పుబడుతూ ప్రకటన చేశారని పేర్కొంటున్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారని, అనంతరం కొద్దిరోజులకు సినీ ప్రముఖులతో కలిసి మరోసారి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి తామంతా చర్చించామని చిరంజీవి అందులో స్పష్టం చేశారు. ఆ సమావేశం కారణంగానే నాడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టిక్కెట్ రేట్లు పెరిగాయని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టారే స్వయంగా విడుదల చేసిన ప్రకటన ద్వారా ఎన్నికల ముందు పవన్‌కళ్యాణ్, చంద్రబాబు, టీడీపీ నేతలు వైస్ జగన్‌పై చేసిన దుష్ప్రచారంలో నిజం లేదని తేటతెల్లమైందని చిరంజీవి అభిమానులు చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాడు చంద్రబాబు అంత దు్రష్పచారం చేయగా.. ఇప్పుడు బాలకృష్ణ నేరుగానే చిరంజీవిని కించపరిచినా పవన్‌కళ్యాణ్ కనీసం ఖండించకపోవడాన్ని చిరంజీవి అభిమాన సంఘాలు, కాపు సామాజిక సంఘాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
రాజకీయాల కోసం కుటుంబ గౌరవం తాకట్టా?
గతంలో తన తల్లిని అవమానించేలా నారా లోకేశ్ పోస్టులు పెట్టించారని స్వయంగా విమర్శలు చేసిన పవన్‌కళ్యాణ్.. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ‘ఎవడు’ అంటూ తన సోదరుడు చిరంజీవిపై బాలకృష్ణ అంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా స్పందించడం లేదంటే చంద్రబాబు అంటే భయమా లేక నెల నెలా అందే ప్యాకేజీయే కారణమా.. అని సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ బాబు కుటుంబానికి దాసోహమవడం కారణంగా మెగాస్టార్ కుటుంబం ఇలాంటి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని చిరంజీవి అభిమానులు, కాపు సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు.
పవన్‌కళ్యాణ్ తీరు చూస్తుంటే కుటుంబం, జనసేన ప్రయోజనాల కన్నా చంద్రబాబు, లోకేశ్ రాజకీయ లబ్ధి కోసం ఆరాట పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేసే సమయంలో సభలో జనసేన ఎమ్మెల్యేలు ఉండి కూడా అభ్యంతరం చెప్పకపోవడాన్ని చిరంజీవి అభిమానులు, కాపు సంఘం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
గతంలో చిరంజీవినుద్దేశించి బాలకృష్ణ ‘మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు’ అని వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించిన నాగబాబు.. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాక తాజాగా చిరంజీవినుద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఎమ్మెల్సీ పొందినంత మాత్రన ప్రస్తుతం నాగబాబు ఇంతలా దిగజారాలా అనే వ్యాఖ్యలు చిరంజీవి అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.
చిరంజీవి ఏంది..? మా బ్లడ్ వేరు..!
బాలకృష్ట గతంలోనూ పలు సందర్భాల్లో చిరంజీవిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిపై పలు పోస్టులు పెడుతున్నారు. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి రావడంపై బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘రాజకీయాల్లో విజయం సాధించడం ఒక్క రామారావు వల్లే అయింది.
చిరంజీవి ఏంది...? మేం వేరు... మా బ్లడ్ వేరు... మా బ్రీడ్ వేరు... సస్టెయిన్‌బులిటీ ఉంది మాకు..!’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో సందర్భంలో ‘సంకరజాతి..’ ‘అలగా జనం..’ అంటూ బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా చర్చ జరుగుతోంది. ఇవన్నీ చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశించినవేనని బాలకృష్ణపై మండిపడుతున్నారు.