
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వంలో భీమవరం డీఎస్పీ పేకాట పంచాయితీ చిచ్చురేపుతోంది. ఇటీవల భీమవరం డీఎస్పీ పేకాట ప్రోత్సహిస్తున్నారంటూ జనసేన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. జనసేన ఫిర్యాదుతో నిన్న డీఎస్పీ జయసూర్యపై పవన్ విచారణకు ఆదేశించారు.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఝలక్ ఇచ్చారు. భీమవరం డీఎస్పీ జయసూర్యను రఘురామ సమర్ధించారు. దీంతో పవన్ ఆరోపణలకు భిన్నంగా డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ వ్యాఖ్యలు చేయడంతో కూటమిలో పేకాట పంచాయితీ చిచ్చురేపుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య అసాంఘిక కార్యకలాపాలకు
గతకొన్ని రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఫిర్యాదు అందిందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుండటంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా విషయం చర్చనీయాంశంగా మారింది. భీమవరం డీఎస్పీగా జయసూర్య సుమారు ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టారు.
సంక్రాంతి కోడిపందేల నిర్వహణ, పెద్ద ఎత్తున పేకాట వంటి జూదాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, దీనికి పరోక్షంగా డీఎస్పీ సహకారం ఉందంటూ ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ప్రధానంగా భీమవరం పట్టణంలోని క్లబ్బుల్లో విచ్చలవిడిగా జూదాలు నిర్వహిస్తున్నారని, అందుకు గాను పోలీసులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే కార్యాలయానికి ముడుపులు ఇవ్వాలంటూ పోలీసులే ముడుపులు వసూలు చేస్తున్నారంటూ ప్రచారం సాగింది.
దీంతో మండిపడ్డ ఎమ్మెల్యే.. క్లబ్బుల్లో జూదాల నిర్వహణను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే.. పక్కనున్న ఉండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోడిపందేలు, పేకాట వంటి జూదాలు నేటికీ జోరుగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, దీనికి పక్క నియోజకవర్గ కూటమి పెద్దలతో డీఎస్పీ అంటకాగడమే కారణమని బహిరంగంగా చెబుతున్నారు. దీంతో సుమారు ఆరు నెలల క్రితం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు.
అయితే బదిలీని పక్క నియోజకవర్గ నాయకుడి అండదండలతో బదిలీని నిలుపుదల చేయించుకుని ఆయనకు అనుకూలంగా పనిచేస్తూ జూదాల నిర్వాహకుల జోలికి పోకుండా.. వారినుంచి పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా సివిల్ తగాదాల్లో డీఎస్పీ ప్రమేయం ఉంటోందని, భీమవరంలో డీఎస్పీ జయసూర్య ప్రత్యేక దందా నిర్వహిస్తున్నారంటూ జనసేన నాయకులు పవన్‌కల్యాణ్‌కు ఫిర్యాదు చేయడంతో నేరుగా పవన్ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. డీఎస్పీ జయసూర్యపై నివేదికను తయారు చేయాలని ఆదేశించారు.