గూడూరులో వైఎస్ జగన్‌తో కరచాలనానికి పోటీ పడుతున్న అక్కచెల్లెమ్మలు
జననేత జగన్‌కు అడుగడుగునా బ్రహ్మరథం.. ఆసాంతం ఉవ్వెత్తున ఎగసిన ప్రజాభిమానం
జగన్‌ను చూసేందుకు వెళ్లకుండా ప్రజలకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు
సరిహద్దులు, ప్రధాన రహదారులు, కూడళ్లలో బారికేడ్లు, భారీ తాళ్లతో అడ్డంకులు
అయినా మండుటెండనూ లెక్కచేయక వెల్లువలా పోటెత్తిన ప్రజావాహిని
ప్రజాభిమానం ఉప్పొంగడంతో 70 కిలోమీటర్ల దూరానికి 7 గంటలకు పైగా సమయం
కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన దిగ్విజయం
గుండెలపై కకావికలమైన పంటను చూసి పుట్టెడు శోకంతో ఉన్న పుడమితల్లి పరవశించింది. కన్నీళ్లతో కుంగికృశించిన హృదయాలు నేనున్నానంటూ చాచిన ఆపన్నహస్తాన్ని మురిపెంగా ముద్దాడాయి. సర్కారు ఆంక్షలు సంకెళ్లు తెంచి.. సదా తమ క్షేమాన్నే కాంక్షించే అభిమాన నేతను హత్తుకునేందుకు ఉవ్విళ్లూరాయి. కష్టాల్లో కానరాని ఏలికలపై ధ్వజమెత్తిన ప్రజాపతికి జయజయధ్వానాలు పలికాయి. నీ వెంటే మేమంటూ మండుటెండనూ లెక్కచేయక గళమెత్తి నినదించాయి. కృష్ణా తీరం జనతరంగమై ఉప్పొంగింది. జన హృదయ విజేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా నీరాజనం పలికింది.
సాక్షి, అమరావతి: మోంథా తుపాను ధాటికి విలవిల్లాడిన రైతులను పరామర్శించేందుకు మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన దిగ్విజయంగా సాగింది. తమ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చిన జననేతకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికారు. పల్లెల్లో మహిళలు రోడ్లకిరువైపులా నిలబడి పూలవర్షం కురిపించారు. అడుగడుగునా ఆంక్షలు పెట్టినా, రోడ్లు, కూడళ్లు, సరిహద్దుల్లో బారికేడ్లు పెట్టి.. తాళ్లతో దారులు మూసేసినా ప్రజలు వెనుకడుగు వేయలేదు.
మండుటెండను సైతం లెక్కచేయక మొక్కవోని పట్టుదలతో ముందుకురికారు. అభిమాన నేతకు గోడు వెళ్లబోసుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలను వైఎస్ జగన్‌కు చూపించి ఆదుకోవాల్సిన సర్కారు పెద్దలు ఇప్పటివరకూ పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. సమస్యలు చెప్పుకుని ఓదార్పు పొందారు.

పంటలు నష్టపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే పరిహారం తీసుకుంటే దెబ్బతిన్న పంటను కొనడం కుదరదని సర్కారు బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలను ఆసాంతం సావధానంగా విన్న జననేత అధైర్యం వద్దని తానున్నానని భరోసా ఇవ్వడంతో కొండంత అండగా ఉందని సాంత్వన పొందారు.
తాడేపల్లి నుంచి ఉదయం కారులో బయలుదేరిన వైఎస్ జగన్‌కు విజయవాడలోనే ప్రజలు దారికి ఇరువైపులా బారులుతీరి జయజయధ్వానాలు పలికారు. పటమటలో మహిళలు గుమ్మడి కాయలతో జననేతకు దిష్టి తీశారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. కానూరులో రైతులు, మహిళలు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈడుపుగల్లు, గోశాల వద్ద జగన్‌ను కలిసిన మహిళా రైతులు, తుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటలను చూపించారు.

ఈ సందర్భంగా పూర్తిగా పనికి రాకుండా పోయిన వరి కంకులను వైఎస్ జగన్ పరిశీలించారు. ఆకునూరు సెంటర్‌లో వైఎస్ జగన్‌ను కలిసిన కల్లుగీత కార్మికులు తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. గండిగుంటలో వైఎస్ జగన్‌పై మహిళలు పూలుజల్లి ఘనస్వాగతం పలికారు. గోపువానిపాలెంలో మహిళలు, వృదులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి గజమాలలతో జగన్‌కు స్వాగతం పలికారు. నిడమోలు, తరకటూరులో దారికి ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు.
ఆయనకు పామర్రులోనూ రైతులు పాడైపోయిన పంటలను చూపించారు. పెడన నియోజకవర్గం, గూడూరు వద్ద మహిళలు జయహో జగనన్న అంటూ నినదించారు. రామరాజుపాలెంలోనూ వైఎస్ జగన్‌కు పంట పొలాలను చూపి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆకుమర్రు లాకు వద్ద స్వయంగా వరి చేలో దిగిన జగనన్నతో రైతులు ముఖాముఖి మాట్లాడి మురిసిపోయారు.
తమ బాధలు వినే నాయకుడు వచ్చాడని పరవశించిపోయారు. సీతారామపురం గ్రామానికి చేరుకున్న జగన్‌కు మహిళలు హారతులు పట్టారు. అక్కడి నుంచి బీవీ తోటకు బయలుదేరిన జగన్ వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.

70 కి.మీ. ప్రయాణానికి 7 గంటలకు పైగా
అడుగడుగునా ప్రజలు నీరాజనం పలకడంతో వైఎస్ జగన్ పర్యటన నెమ్మదిగా ముందుకు సాగింది. 70 కిలోమీటర్ల దూరానికి 7 గంటలకు పైగా సమయం పట్టిందంటే జగన్‌పై ప్రజాభిమానం ఏస్థాయిలో ఉప్పొంగిందో ఊహించుకోవచ్చు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు
పామర్రు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కృష్ణాజిల్లా పర్యటనలో ఆయన కాన్వాయ్‌తో పాటు వస్తున్న పార్టీ నేతల కార్లను పోలీసులు అడ్డుకున్నారు. తాము అధినేత వెంట వెళ్తే తప్పేంటని ప్రశి్నంచిన నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. ఈ ఘటన మొవ్వ మండలం కూచిపూడి స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది.
జగన్ కాన్వాయ్‌తో పాటుగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు తన అనుచరులతో కలిసి మూడు కారుల్లో కాన్వాయ్‌తో పాటు వస్తున్నారు. వారిని నిడుమోలు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అశోక్‌బాబు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. తమ విధులకు ఆటంకం కల్పించారంటూ అశోక్‌బాబు, ఆయన అనుచరులపై మొవ్వ ఎస్సై కె.ఎన్.విశ్వనాథ్ కేసులు పెట్టారు.
డ్రోన్‌తో నిఘా
పెనమలూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించటమే కాకుండా అడుగడుగునా నిఘా పెట్టారు. పెనమలూరు మండల పరిధిలోని పలు గ్రామాల కూడళ్ల మీదుగా జగన్ పర్యటన జరిగిన సమయంలో పోలీసులు డ్రోన్‌లు పెట్టి చిత్రీకరించారు. ప్రతి సెంటర్‌లో డ్రోన్‌లు ఏర్పాటు చేశారు.


