తూతూ మంత్రంగా పంట నష్టం అంచనాలు
ఈ–క్రాప్‌ను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
ప్రహసనంగా మోంథా తుపాను ఎన్యుమరేషన్ ప్రక్రియ
పొలం దగ్గరకు వెళ్లకుండా.. టీడీపీ నేతల సిఫార్సు మేరకే, వారి ఇళ్ల వద్దే దరఖాస్తులు.. జాబితాల తయారీ
తుది జాబితాల రూపకల్పనకు 24 గంటలే గడువిచ్చిన సర్కారు.. ఎగ్గొట్టే ఎత్తుగడ!
రైతుల పేరిట నష్టపరిహారం కొట్టేయాలని టీడీపీ నేతల కుట్రలు
ఏడాదిన్నరలో 5.50 లక్షల మందికి రూ.595 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి ఎగనామం
పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేసి లండన్‌లో చంద్రబాబు షికార్లు..
క్రికెట్ తిలకిస్తూ చిల్ అవుతున్న ‘చినబాబు’.. ఫొటోలకు ఫోజులిచ్చిన పవన్ కళ్యాణ్
రైతులను పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం
గత ప్రభుత్వంలో పారదర్శకంగా ఈ–క్రాప్.. ప్రతి సర్వే నంబర్‌లో పంటల జియో ట్యాగింగ్.. పొలంలో రైతుల ఫొటోలతో అప్‌లోడ్
అర ఎకరా పొలంలో వరి సాగు చేశా. ఈసారి పంట బాగా పండడంతో సంతోషపడ్డాం. ఇంతలో తుపాను వచ్చి పంట మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. పొలాన్ని చూస్తే ఏడుపొస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోతే రూ.18 వేల వరకు పరిహారం అందింది. చంద్రబాబు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదంట. పరిహారం వస్తుందో, లేదో తెలియట్లేదు. వైఎస్ జగన్ సకాలంలో విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా ఇచ్చి ఆదుకుంటే.. ఈ ప్రభుత్వం రైతుల్ని అసలు పట్టించుకోవడం లేదు.
– డి.గురుమూర్తి, గిరిజన రైతు, కొత్తవలస, అల్లూరి సీతారామరాజు జిల్లా
పరిహారం ఇస్తారో.. లేదో!
పక్కాగా ఈ–క్రాప్ నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, బీమా సాయం రైతులు ఎక్కడ అడుగుతారోననే భయంతోనే..! ఉద్దేశపూర్వకంగానే ఈ–క్రాప్‌ను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు బసిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంభాలపాడు స్వగ్రామం. దాదాపు రూ.10 లక్షలు అప్పు తెచ్చి సొంత పొలం 30 ఎకరాలు, కౌలుకు మరో 30 ఎకరాలు సాగు చేశాడు. పొగాకు 15 ఎకరాలు, కంది 30 ఎకరాలు, బొబ్బర్లు 12 ఎకరాలు, వరి 3 ఎకరాల్లో సాగు చేశాడు. వారం రోజులుగా కురిసిన వర్షాలకు పొలంలో నీరు నిలిచి ఆశలు నీటి పాలయ్యాయి. పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో పంట నష్ట పరిహారం కింద ఆ కుటుంబానికి దాదాపు రూ.7 లక్షలు అందాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పడంతో సమయానికి డబ్బులు లేక పంటల బీమా చేయలేదు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతు పూర్తిగా నష్టపోయారు.
సాక్షి, అమరావతి: ఈ–క్రాప్ నమోదులో టీడీపీ కూటమి సర్కారు నిర్లక్ష్యం అన్నదాతల పాలిట పెను శాపంగా మారింది. ఈ–క్రాప్ పక్కాగా, పారదర్శకంగా నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, పంటల బీమా సాయం ఇవ్వాలని రైతులు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ఏకంగా ఈ ప్రక్రియనే నిర్వీర్యం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు అత్యంత పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను చంద్రబాబు సర్కారు మొక్కుబడి తంతుగా, తూతూ మంత్రంగా మార్చింది.
అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ–క్రాప్‌ను నీరుగార్చడమే లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ పంట నమోదు పారదర్శకంగా చేపట్టకపోవడం వల్ల పంట నష్టపరిహారం, బీమా సాయం అందే పరిస్థితి లేకుండా పోయిందని, పంట ఉత్పత్తులను అమ్ముకునే దారి కానరావడం లేదని మోంథా తుపానుతో పంటలు దెబ్బతిన్న రైతులు ఆక్రోశిస్తున్నారు. మరోవైపు పంట నష్టం అంచనాల కోసం చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ కూడా అస్తవ్యస్తంగా తయారైంది. టీడీపీ నేతల సిఫార్సులతో.. వారి ఇళ్ల వద్దే జాబితాలు తయారు చేస్తూ నష్టపోయిన రైతుల నోట్లో సర్కారు మట్టి కొడుతోంది!
ఈ–క్రాప్ నిర్వీర్యం..
వైఎస్సార్‌సీపీ హయాంలో ఏపీలో పారదర్శకంగా అమలు చేసిన ఈ–క్రాప్ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. పొరుగు రాష్ట్రాలు ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తుండగా ఏపీలో మాత్రం మొక్కుబడి తంతుగా తయారైంది. సరిగ్గా ఖరీఫ్–25 సీజన్ ప్రారంభమయ్యే సమయంలోనే సచివాలయాల పునర్ వ్యవïÜ్థకరణతోపాటు రేషనలైజేషన్ పేరిట రైతు సేవా కేంద్రాల సిబ్బందిని అడ్డగోలుగా బదిలీలు చేయడం ఈ–క్రాప్ నమోదుపై తీవ్రంగా ప్రభావం చూపింది.
బదిలీలపై వచ్చిన సిబ్బంది ఆయా ప్రాంతాలకు కొత్తవారు కావడంతో సర్వే నంబర్లను గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తగా వచ్చిన అధికారులకు సైతం అవగాహన లేక కింది స్థాయి సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి ఇబ్బందులకు గురి చేయడం మినహా రైతులకు మేలు జరిగేలా పారదర్శకంగా ఈ–పంట నమోదు చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. డిజిటల్ క్రాప్ సర్వే నిబంధనల ప్రకారం ప్రతి ల్యాండ్ పార్సిల్‌లో వివరాలను విధిగా నమోదు చేయాలి. సీజన్ ముగిసి నెల రోజులైంది. కానీ ఇప్పటి వరకు 60శాతానికి మించి ల్యాండ్ పార్సిల్స్‌లో వివరాలు నమోదు చేయలేని దుస్థితి నెలకొంది.
రాష్ట్రంలో 2.94 కోట్ల ల్యాండ్ పార్శిల్స్ ఉండగా.. 2 కోట్ల ల్యాండ్ పార్సిల్స్‌ను నమోదు చేసినట్టు అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారు. మరోవైపు రైతుల వేలిముద్రలతోపాటు ఈ–పంట నమోదును ధ్రువీకరిస్తూ ఆర్‌ఎస్‌కే, రెవెన్యూ అధికారులు వేలిముద్రలు వేసే ప్రక్రియను పూర్తిగా అటకెక్కించేశారు. ర్యాండమ్‌గా ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలనను మొక్కుబడి తంతుగా మార్చేశారు.
ఇక కౌలు రైతులు సాగు చేస్తున్న పంట వివరాలు ఈ–క్రాప్‌లో నమోదు కావడం లేదు. సీసీఆర్సీ కార్డుల జారీ మొక్కుబడిగా సాగుతోంది. రెవెన్యూ అధికారులు ధ్రువీకరిస్తే చాలు రైతులు పండించిన పంట వివరాలు నమోదు చేస్తామని నమ్మబలికారు. కానీ ఎక్కడా ఆ దాఖలాలు కానరావడం లేదు. దీనికి ఏకైక కారణం.. ఈ–క్రాప్ పక్కాగా నమోదు చేస్తే విపత్తు వేళ రైతులకు పంట నష్ట పరిహారం, బీమా సాయం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోననే భయమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.595 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి ఎగనామం..!
ఈ–క్రాప్ నమోదులో నిబంధనలకు పాతరేశారు. ఈ–క్రాప్ నమోదు సక్రమంగా జరగని కారణంగానే గతేడాది ధాన్యంతో పాటు వివిధ పంటలను రైతులు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోలేకపోయారు. ఈ–క్రాప్ నమోదు అస్తవ్యస్తంగా ఉండడం వల్లే మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోయిన మామిడి, పొగాకు, మిర్చి రైతులతోపాటు టమాటా, ఉల్లి రైతులను గుర్తించడంలో అధికారులు నానా పాట్లు పడ్డారు. గడిచిన ఏడాదిన్నరలో అకాల వర్షాలు, తుపానులు, కరువు ప్రభావానికి గురైన 5.50 లక్షల మంది రైతులకు రూ.595 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇలా పరిహారం ఎగ్గొట్టేందుకే ఉద్దేశపూర్వకంగానే ఈ–క్రాప్‌ను నిర్వీర్యం చేస్తోందని రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
ధాన్యం కొనబోమంటూ.. గ్రామాల్లో టాంటాం
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్యుమరేషన్ జాబితాలో పేర్లు ఉన్న వారి నుంచి ధాన్యం సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేయబోమని గ్రామాల్లో టాంటాం వేస్తుండడం బాధిత రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. పచ్చనేతల కనుసన్నల్లోనే గ్రామ స్థాయిలో జాబితాలు సిద్ధమవుతున్నాయి. అర్హులైన వారికి పరిహారం దక్కకుండా చేయడం, నష్ట తీవ్రత తగ్గించి ఆర్థిక భారం తగ్గించుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కుట్రలకు తెర తీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉదాహరణకు వైఎస్సార్ కడప జిల్లా సి.కె.దిన్నె మండలం కోలుములపల్లి తదితర గ్రామాల్లో తుపాను, దానికంటే ముందు కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న చామంతి పూల తోటలను ఏ అధికారీ పరిశీలించలేదు. ఇదే జిల్లాలో పోరుమామిళ్ల, బద్వేలు రూరల్, కాజీపేట, మైదుకూరు, బి.మఠం మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన పాపాన పోలేదు. కనీసం ప్రాథమిక అంచనాలు గానీ, తుది జాబితాలను గానీ ఆర్‌ఎస్‌కేల్లో ప్రదర్శించడం, అభ్యంతరాలు స్వీకరిస్తున్న దాఖలాలు లేవు. వాస్తవాలు ఇలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పంట నష్టం నమోదు, సామాజిక తనిఖీలు, విజ్ఞప్తుల స్వీకరణ, పరిష్కారం, ఉన్నతాధికారుల సూపర్ చెకింగ్, పునఃపరిశీలన అంతా సమాంతరంగా జరిగిపోతోందంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది.
దేశానికే ఆదర్శంగా ‘ఈ–క్రాప్’..
ఎల్రక్టానిక్ క్రాపింగ్ (ఈ–క్రాప్).. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓ వినూత్న ప్రయోగం. వాస్తవ సాగుదారులకు రక్షణ కవచం. వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పు అది. ఏ గ్రామంలో.. ఏ సర్వే నంబర్ పరిధిలో.. ఎంత విస్తీర్ణంలో.. ఏ పంటను ఎవరు సాగు చేస్తున్నారో ఒక్క క్లిక్‌తో తెలుసు కోవడమే కాదు.. ఈ–క్రాప్ ప్రామాణికంగా అర్హులైన వాస్తవ సాగుదారులకు పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం), సున్నా వడ్డీ రాయితీ లాంటి సంక్షేమ ఫలాలు అందించేవారు.
రబీ 2019 సీజన్‌లో శ్రీకారం చుట్టిన ఈ–క్రాప్ నమోదు సాంకేతికత అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలందుకుంది. 2023లో ప్రతిష్టాత్మక స్కోచ్ సిల్వర్ అవార్డు కూడా వరించింది. నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ ద్వారా వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు పంట వివరాలు నమోదు చేసేవారు. సీజన్ వారీగా ఏ సర్వే నంబర్‌లో ఏయే రకాల పంటలు ఏయే వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారో ఆర్బీకేల ద్వారా వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు చేసేవారు.
15–30 రోజుల్లోపు క్షేత్ర స్థాయి పరిశీలనలో జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్‌తో సహా పంటల ఫొటోలు అప్‌లోడ్ చేసి, రైతుల వేలిముద్రలు(ఈకేవైసీ–మీ పంట తెలుసుకోండి) తీసుకుని మొబైల్ నంబర్‌కు డిజిటల్ రసీదు పంపేవారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారుల పరిశీలన తర్వాత రైతులకు భౌతిక రసీదు కూడా అందించేవారు. ఈ భౌతిక రసీదులోనే ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియచేయడమే కాదు.. మీ పంటకు బీమా కవరేజ్ ఉందని, మీ తరఫున ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలియజేశారు.
ఇలా ఏటా 1.65 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. ఈ–క్రాప్ ప్రామాణికంగా 2019–24 మధ్య 75.82 లక్షల మందికి రూ.1,373కోట్ల సబ్సిడీతో 45.16 లక్షల టన్నుల విత్తనాలు అందించారు. 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులు సరఫరా చేశారు. 176.36 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేయగా, 5.13 కోట్ల మందికి రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలను అందించారు.
మరోవైపు వైఎస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం అందించి సాగుకు భరోసా కల్పించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు, ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్ల రాయితీని గత ప్రభుత్వం అందచేసింది.
సేద తీరుతున్న ప్రభుత్వ పెద్దలు
పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు షికార్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్తే.. మంత్రి లోకేశ్ క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ చిల్ అవుతున్నారు. మరోవైపు ఫొటోలకు ఫోజులిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులను పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్లిపోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
ఇప్పుడు పరిహారం ఎవరిస్తారు
గత ప్రభుత్వంలో అధికారులే దగ్గరుండి బీమా చేయించేవారు. ఈ ప్రభుత్వం సొంతంగా బీమా చేయించుకోవాలని చెప్పడంతో రెండుసార్లు రైతు సేవా కేంద్రాలకు వెళ్లా. సర్వర్ పని చేయడం లేదని చెప్పారు. తరువాత సమయం అయిపోయిందన్నారు. ఐదు ఎకరాల్లో స్వర్ణరకం సాగు చేశా. పంట మొత్తం పోయింది. పరిహారం ఎవరిస్తారు? కౌలుదారులకు ఆత్మహత్యలే శరణ్యం!
– గున్నం రామకృష్ణ, కొత్తూరు, రామచంద్రపురం రూరల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
కౌలు రైతుకు పరిహారం ఇవ్వాలి
కౌలుకు ఏడు ఎకరాలు తీసుకున్నా. తొలుత నీరందక దెబ్బతిన్నా. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే తుపాను పంటను దెబ్బతీసింది. ఎకరానికి రూ.25 వేలకు పైగా వెచ్చించా. నాలాంటి కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌలు రైతులను కూడా గుర్తించి నష్టపరిహారం అందించాలి.
– నాగరాజు, కౌలు రైతు, పెడన, కృష్ణా జిల్లా
దిక్కుతోచడం లేదు
రూ.ఐదు లక్షల వరకూ వెచ్చించి 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. పంట తొలగించే రోజు మొదలైన వాన తుపానుగా మారి పదిరోజుల పాటు కొనసాగింది. టార్పాలిన్ కప్పి భద్రపరిచినప్పటికీ మొక్కజొన్నలు మొత్తం మొలకలు వచ్చాయి. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడంతో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
– మధు, కదిరిపల్లి, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లా
ప్రభుత్వ నిర్ణయం చాలా అన్యాయం
ఇన్‌పుట్ సబ్సిడీకి నమోదు చేసుకున్న రైతుల నుంచి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకూడదన్న నిర్ణయం చాలా అన్యాయం. పంటలు నష్టపోయారు కాబట్టే ఇన్‌పుట్ సబ్సిడీ పొందుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రైతుల నుంచి ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి..
– పోతిరెడ్డి భాస్కర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కడప జిల్లా
జగన్ హయాంలో రైతులకు మేలు
మొక్క జొన్న కోత కోసి ఆరబోశాం. క్వింటా రూ.2,200 పలకాల్సింది రూ.1,600కు అడుగుతున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ గురించి అవగాహన కల్పించేవారు ఎవరూ లేరు. గత ప్రభుత్వం స్వయంగా ఇన్సూరెన్స్ చెల్లించడంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు మేలు చేకూరేది. – గుత్తి ఏసన్న,
రైతు, కల్వటాల, కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లా
ఈ ప్రభుత్వంలో బీమా గురించి చేప్పేవారే లేరు
నాకు ఎకరా పొలం ఉంది. వరి, మిరప పండిస్తా. గత ప్రభుత్వంలో ఈ–క్రాప్ నమోదు చేసి ప్రీమియం కూడా చెల్లించడంతో రూ.26 వేలు బీమా నగదు వచ్చింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి చెప్పేవారే కరువయ్యారు. ప్రభుత్వం ఎటువంటి భరోసా
కల్పించకపోవడంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
– వేణు, రైతు, బంగారుపాళెం, చిత్తూరు జిల్లా
అస్తవ్యస్తంగా ఎన్యుమరేషన్...
మోంథా తుపాను వల్ల నష్టపోయిన పంటలను, రైతులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. గత నెల 31వ తేదీ సాయంత్రంలోగా తుది జాబితాలు తయారు చేయాలని ఆదేశిస్తూ 30వ తేదీన సర్క్యులర్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంటే 24 గంటలు కూడా గడువు ఇవ్వకుండా తుది జాబితాలు రూపొందించాలని ఆదేశించటాన్ని బట్టి ఎన్యుమరేషన్‌లో పారదర్శకత ఏ మేరకు ఉందో వెల్లడవుతోంది. వాస్తవంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తినగా.. ప్రభుత్వం నష్ట తీవ్రతను తగ్గించేందుకు తొలుత 4.40 లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్లు ప్రకటించింది.
ఆ తర్వాత దాన్ని 3.45 లక్షల ఎకరాలేనని బుకాయించింది. చివరకు తుది అంచనాల రూపకల్పనలో 3.70 లక్షల ఎకరాలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. అది కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపకుండా, టీడీపీ నేతలు సిఫార్సు చేసిన పేర్లతోనే జాబితాలను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న మౌఖిక ఆదేశాలతో జాబితాలను కుదించేందుకు యంత్రాంగం రేయింబవళ్లు శ్రమిస్తోంది.
ఎన్యుమరేషన్ పెంచొద్దంటూ క్షేత్రస్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. కర్నూలు, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాల్లో తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల ఉల్లి పంటకు అపార నష్టం వాటిల్లింది. కానీ దెబ్బతిన్న ఉల్లి పంట వివరాలు నమోదు చేయడానికి వీల్లేదని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం నివ్వెరపరుస్తోంది. అలా నమోదు చేసిన ఆర్‌ఎస్‌కే సిబ్బందిపై చర్యలకు సైతం సిద్ధపడుతుండడం సర్కారు తీరుకు అద్దం పడుతోంది.


