 
													ఏ పరీవాహక ప్రాంతంలో ఎంత వర్షం పడుతుందో ఇప్పుడే తెలుసుకున్నారంట..
అందుకు తగ్గట్లు రిజర్వాయర్లలో నీటి నిర్వహణ చేశారంట..
నిజానికి.. సీడబ్ల్యూసీ ఈ విషయంలో ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు బులెటిన్లు ఇస్తుంది
గ్రౌండ్ వాటర్‌ను కూడా రియల్ టైమ్‌లో పర్యవేక్షించారంట..
ప్రణాళిక విభాగం వెబ్‌సైట్‌లో ఉండే భూగర్భ జలాలపైనా స్వోత్కర్ష
డ్రోన్లు, సీసీ కెమెరాలు.. జియో ట్యాగింగ్ వినియోగంపైనా డబ్బా కొట్టుడు
ఇలా.. ఎప్పటినుంచో ఉన్న విధానాలను ఇప్పుడు తామే చేసినట్లు మీడియా సాక్షిగా గొప్పలు
సాక్షి, అమరావతి: చెప్పేవారు చంద్రబాబు అయితే వినేవాడు వెర్రి వెంగళప్ప.. సీఎం చంద్రబాబు గురువారం నిర్వహించిన మీడియా సమావేశం అచ్చం ఇలాగే సాగింది. వినేవాళ్లు ఏమనుకుంటారో అన్న స్పృహ కూడా లేకుండా ఆద్యంతం ఆయన గప్పాల ప్రవాహం సాగింది. ఈయనకు ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ కూడా బుర్రకథలో మాదిరిగా తానాతందానా అన్నట్లుగా వంతపాడారు. ఆ వివరాలు..
1. ఏ రిజర్వాయర్‌లోకి ఎంత నీరు వస్తుందో, ఎంత నీటిని విడుదల చేయాలో టెక్నాలజీతో ఇప్పుడు తెలుసుకున్నట్లు ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారు. నిజానికి.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) దేశంలోని ముఖ్యమైన జలాశయాల ప్రత్యక్ష నిల్వ సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు బులెటిన్లు విడుదల చేస్తుంది. ఏ పరివాహక ప్రాంతంలో ఎంత వర్షం కురుస్తుందో.. తద్వారా ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు వస్తుందనే విషయాన్ని రాష్ట్రాలకు చెప్పే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది.
కానీ, చంద్రబాబు మాత్రం ఇప్పుడే టెక్నాలజీ ద్వారా ఈ విషయాన్ని ఔపోశన పట్టినట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే, ఎప్పటి నుంచో ప్రతీ రిజర్వాయర్‌కు నీటి పర్యవేక్షణ విధానం ఉంది. వరదలు, వర్షాల ఆధారంగా ఏ ప్రాజెక్టుకు ఎన్ని క్యూసెక్కులు వస్తున్నాయో చూసుకుని దాని కింద ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం సంవత్సరాల తరబడి కొనసాగుతోంది. కొత్తగా ఇప్పుడు టెక్నాలజీతో ఈ అంశాన్ని కనుగొన్నట్లు సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా, అతిశయోక్తిగా ఉంది.
2. భూగర్భ జలాలను కూడా రియల్ టైమ్‌లో పర్యవేక్షించినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో కూడా దశాబ్దాల తరబడి పర్యవేక్షణ విధానం కొనసాగుతోంది. సెన్సార్లు రియల్ టైమ్ మానిటరింగ్ ఎప్పటి నుంచో ఉంది. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ఏ రోజుకా రోజు దొరుకుతాయి. కొత్తగా ఈ ప్రభుత్వంలో తెచ్చిందేమీ కాదు.
3. అన్ని టెక్నాలజీలను అనుసంధానం చేయడంతో పాటు డ్రోన్స్, సీసీ కెమెరాల ద్వారా ఎక్కడ వరద నీరు ఉందో గుర్తించి ఆ నీటిని డ్రై చేశామని సీఎం చెప్పారు. ఇలాంటి రియల్ టైమ్ వ్యవస్థ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేదన్నారు. అయితే, డ్రోన్లు, సీసీ కెమెరాలు కూడా కొత్తగా వచ్చినవి కావు. ఎప్పటి నుంచో ఉన్నాయి. అన్ని ప్రభుత్వాలు వీటిని అవసరమైనప్పుడల్లా అవసరమైన మేరకు ఉపయోగిసూ్తనే ఉన్నాయి.
4. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు జియో ట్యాగింగ్ చేశామన్నారు. నిజానికి.. ఈ విధానం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎప్పుడో అమలుచేశారు. ఇళ్లకు గత ప్రభుత్వంలోనే జియో ట్యాగింగ్ చేశారు. చంద్రబాబు చెప్పినట్లు కొత్తగా వచ్చిన విధానమేమీ కాదు ఇది.
5. తుపానులు, వరదలకు సంబంధించి ఉత్తమ మాన్యువల్ రూపొందించినట్లు కూడా చంద్రబాబు గొప్పగా చెప్పారు. కరువు నియంత్రణకు బ్రిటీష్ కాలం నుంచే ఈ మాన్యువల్స్ ఉన్నాయన్నది ముఖ్యమంత్రికి తెలీదనుకోవాలా!?
6. తుపాను కదలికలను గంట గంటకు టెక్నాలజీ ద్వారా పర్యవేక్షిస్తూ పౌరులకు 28 రకాల సూచనలతో మెసేజ్‌లు పంపుతూ అప్రమత్తం చేశామని ఐటీ శాఖ కార్యదర్శి కె. భాస్కర్ చెప్పారు. 5000 సచివాలయాల పరిధిలో జాగ్రత్తలు తీసుకుని ముందస్తు హెచ్చరికలను పౌరులకు జారీచేశామన్నారు.
వాస్తవానికి.. ఫోన్లలో మెసేజ్‌లు పంపే విధానం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనూ కొనసాగింది. అప్పట్లో సచివాలయాల వారీగా ఇంటింటినీ మ్యాపింగ్ చేసి పౌరులకు అవసరమైన సమాచారాన్ని మెసేజ్‌ల రూపంలో పంపించేవారు. కానీ, ఇప్పుడే ఈ విధానం అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోంది.
7. అవసరమైన వారికి మెడిసిన్స్ పంపించామన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకునే సంప్రదాయం దశాబ్దాల కిందట నుంచి ఉంది. దీని ద్వారా ప్రజలు తమ ఇబ్బందులు ప్రభుత్వానికి చెప్పుకుని సాయం పొందడం ఇప్పుడు కొత్తేమీ కాదు.
8. కాకినాడ దగ్గర తీరం దాటుతుందనుకుంటే 15 కిలోమీటర్ల తరువాత నర్సాపురం దగ్గర తీరం దాటిందని భాస్కర్ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం బొక్కబోర్లా పడింది. కాకినాడలో కాకుండా అంతర్వేది వద్ద తుపాను తీరాన్ని దాటింది. అలాగే, వర్షం ఎక్కడ, ఎప్పుడు ఎంత పడుతుందో ముందస్తుగా చెప్పే విధానం ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంలోనూ ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అయింది. ఓ విధంగా మోంథా దాగుడుమూతలు ఆడిందని చెప్పి నవ్వులపాలయ్యారు.
9. టెక్నాలజీతో వాహనాలను ట్రాకింగ్ చేశామని.. ఇదే తొలిసారన్నారు. ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే.. ఆర్టీసీ బస్సుల రాకపోకలను తెలుసుకునేందుకు ఆ సంస్థ తన అధికారిక యాప్‌లోనే ప్రయాణికులకు బస్సుల ట్రాకింగ్ ఆప్షన్ కల్పించింది. అలాగే, నేరాలకు సంబంధించి పోలీసులూ వాహనాలు ట్రాక్ చేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే.
10. మొబైల్, ఇంటెర్నెట్ కమ్యునికేషన్ వ్యవస్థను పక్కాగా చేశామన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటినుంచో అమల్లో ఉంటే సీఎం చంద్రబాబు, ఐటీ కార్యదర్శి భాస్కర్ ఇప్పుడు తామే కనిపెట్టి అమలుచేసినట్లు చెప్పుకోవడం నవ్వు పుట్టిస్తోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
