తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయడం కంటే సొంత ఇమేజ్‌కు పెద్దపీట
ఆర్టీజీఎస్ కేంద్రం నుంచే చంద్రబాబు, లోకేశ్ హడావుడి
పచ్చమీడియాలో చంద్రబాబును ఆకాశానికెత్తుతూ ప్రచారం
సీఎంతో పాటు ఎల్లో మీడియా తీరుపై సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోలింగ్
సాక్షి, అమరావతి: ‘‘కుదర్లేదు కాని... కుదిరితే ఆ మోంథా తుపానును పట్టుకుని తిప్పికొట్టేవారు..!’’ ‘‘ఎన్నో తుపాన్లను సమర్థంగా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన సలహా కోసం ఇతర రాష్ట్రాల సీఎంలే సంప్రదించేవారు..’’ ఇదీ సీఎం చంద్రబాబు గురించి ఎల్లో మీడియాలో సాగుతున్న భజన. విపత్తులను కూడా రాజకీయ మైలేజీకి వాడుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబు ఇప్పుడు తుపానును అవకాశంగా తీసుకున్నారు.
విదేశాల నుంచి చేరుకున్న బాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచే హడావుడి చేశారు. ప్రకృతి వైపరీత్యాన్ని తండ్రీకొడుకులే అడ్డుకున్నారన్న స్థాయిలో ప్రచారం హోరెత్తించారు. దీన్నంతటినీ గమనిస్తున్న ప్రజలు విపత్తు సమయంలో కూడా ఈ ప్రచార యావ ఏంటి బాబూ? అని మండిపడుతున్నారు.
» మోంథా తుపాను ప్రళయం సృష్టిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో మంత్రులు సొంత జిల్లాల్లో ఉండి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షించాలి. స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి.
ఇలాగైతే తమకు క్రెడిట్ దక్కదనుకున్నారో ఏమో? చంద్రబాబు, లోకేశ్. విదేశాల నుంచి వచ్చాక మోంథాను మొత్తం వారే పర్యవేక్షించినట్టు హైప్ సృష్టించి మిగిలినవారిని డమ్మీలను చేశారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్లనే తుపాను ప్రభావిత జిల్లాల్లో చాలా మంది మంత్రులు ఫోన్‌లలో ఆదేశాలు, అడపాదడపా పర్యటనలకే పరిమితం అయ్యారని గుసగుసలాడుతున్నారు.
ఈ విషయాన్ని టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తోపాటు మరో ముగ్గురు మంత్రులు అమరావతి నుంచే హడావుడి చేశారు. కానీ, తండ్రీకొడుకులే అంతా పర్యవేక్షిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ మేరకు ఎల్లో మీడియా సైతం విపరీతంగా ప్రచారం చేసింది. దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.
» మోంథా తుపానుతో పెను ముప్పు అని ప్రజలు ఆందోళన చెందినా కొద్దిపాటి ప్రభావంతో తీరం దాటింది. ప్రభుత్వ పెద్దలు ప్రచారం ఊదరగొట్టినా పలుచోట్ల పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి సకాలంలో ఆహారం కూడా అందించలేకపోయారు. అయినా, ఎంతో చేసేసినట్టు అదే పనిగా ప్రచారం ఊదరగొట్టడంపై బాధితులు మండిపడుతున్నారు.
భారీ వర్షాలు లేనప్పుడు నీరు వస్తుందా?
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో, వాస్తవాలకు మసిపూయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబుతో పాటు పచ్చ పత్రికలు మోంథా వేళ కూడా అదే పంథాలో నడిచాయి. అయితే, గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా దానికీ పెద్ద కలరింగ్ ఇచ్చారు.
వర్షాలకు బుడమేరు ప్రాంతం మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇక్కడ ఇలాంటి పరిస్థితి లేదంటూ ఓ పత్రికలో పెద్ద ఫొటోతో వార్త ప్రచురించారు. ఇది చూసిన పాఠకులు అసలు భారీ వర్షాలు లేకుండా ఎలా నీరు చేరుతుంది? ఈ రాతలు ఎవరి మెప్పు కోసం? అని చర్చించుకోవడం కనిపించింది.
‘ఆయన రెండు చేతుల్తో పట్టుకొని ఈ తుపాన్‌ను వెనక్కు పంపేవాడే.. ఆ రోజులుకూడా వస్తాయి.. ‘!! మహాటీవీ బిల్డప్..!! నిజమే కదా.!
ఆయన వేసవికాలంలో టెంపరేచర్ తగ్గిస్తాడు. ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేస్తాడు. సముద్రాన్ని వెనక్కు పంపుతాడు అసలాయన తలుచుకుంటే కానిదేముంది బాబు.!!
– ఓ నెటిజన్


