హనుమకొండ సమ్మయ్యనగర్‌లో వరద బాధితురాలి ఇంట్లోకి వెళ్లి పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి
ఇల్లు మునిగితే రూ.15 వేలు.. పూర్తిగా కూలితే ఇందిరమ్మ ఇల్లు
పశువులు చనిపోతే రూ.50 వేలు.. జీవాలకు రూ.5 వేల చొప్పున..
మోంథా తుపాను బాధిత రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ
వరంగల్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
12 జిల్లాల్లో మోంథా తుపాను ప్రభావం ఉందన్న సీఎం
వరద నష్టంపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశం
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచన
నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక
శాఖల మధ్య సమన్వయం లేకనే సమస్యలు
హనుమకొండ కలెక్టరేట్ సమీక్షలో ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో తుపాను ప్రభావం ఉందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించారు. వరదల్లో ఇల్లు మునిగిన వారికి రూ.15 వేలు, పూర్తిగా కూలిపోతే ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్లు, అధికారులతో కలిసి నగరంలోని వరద ప్రభావిత కాలనీలు సమ్మయ్యనగర్, పోతననగర్, రంగంపేటలో పర్యటించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత 12 జిల్లాల కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తక్షణమే నివేదికలు ఇవ్వండి..
తుపాను ప్రభావంపై వెంటనే పూర్తిస్థాయి నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో 12 జిల్లాల్లో మోంథా తుపాను ప్రభావం ఉంది. ఏడు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు అక్కడి కలెక్టర్లతో సత్వరం సమీక్షలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలి. వరదలు తగ్గుముఖం పట్టినందున వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. చెత్తను తొలగించి, శానిటేషన్ చేయాలి. కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు పంపాలి. వరదల వల్ల మరణించినవారి జాబితాలను పారదర్శకంగా ఇచ్చేలా పోలీసు శాఖ వెంటనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి నివేదికలు అందించాలి.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తాం. వరదల వల్ల మేకలు, గొర్రెలు మృతి చెందితే రూ.5 వేలు, పెద్ద పశువులు మృత్యువాత పడితే రూ.50 వేలు ఇచ్చేలా పశుసంవర్ధక శాఖ నివేదికలు పంపాలి. పత్తి, వరి చేతికి వచ్చే ముందు నష్టం జరిగితే ఎకరానికి రూ.10 వేలు ఇస్తాం. నీట మునిగిన పంటతోపాటు ఇసుక మేటలు వేసిన ప్రాంతాల బాధిత రైతులకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా అవసరాన్ని బట్టి రూ.లక్ష వరకు సాయం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనాలు తయారు చేయాలి. ఇల్లు మునిగినవారికి రూ.15 వేలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.
వరదలకు ఇళ్లు కూలి నిరాశ్రయులైన వారికి ప్రత్యేక కోటా కింద ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేయాలి. అర్హులకు ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇచ్చే అంశంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలి. వరద ప్రాంతాలపై అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చాక మరోసారి సమీక్ష నిర్వహిస్తాం’అని సీఎం తెలిపారు.
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
జిల్లా కలెక్టర్లు, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. వార్షిక నివేదికలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు ఎన్ని క్షేత్రస్థాయి పర్యటనలు చేశారన్న వివరాలు కూడా చూస్తామని చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేలా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై నిర్లక్ష్యం వల్లే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటంలేదని అన్నారు.
ఈ విషయంలో పారదర్శకత లోపం కనిపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాగా పనిచేసేవారికి ప్రభుత్వం నుంచి ప్రశంసలు కూడా ఉంటాయని తెలిపారు. వరదలపై వెంటనే పూర్తి నివేదికలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వానికి పరిహారం కోసం పంపుతామని, ఇందు కోసం ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరద నీటి నిర్వహణపై నీటిపారుదల శాఖ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం లేక సమస్యలు పెరుగుతున్నాయని అసహనం వ్యక్తంచేశారు. అన్ని శాఖలు ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
నాలాల కబ్జాదారులపై ఉక్కుపాదం..
వరంగల్ నగరంలో నాలాల నిర్వహణ సరిగా లేకపోవటం వల్లే తరచూ వరదలు వస్తున్నాయని సీఎం అన్నారు. చెరువులోకి వెళ్లే నాలాలు కబ్జాకు గురైతే ఆ కబ్జాలను తప్పక తొలగించాలని ఆదేశించారు. ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని, పదిమంది కోసం పదివేల ఇళ్లు నీట మునుగుతున్నాయని అన్నారు. జీవితకాలం కష్టపడి సంపాందించుకున్న ఇంటి సామగ్రి, పిల్లల సరి్టఫికెట్లు వంటి కీలక వస్తువులు నీటి పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నాలాల కబ్జాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారుల కమిటీ వేయాలని ఆదేశించారు.
కాలనీవాసుల గోడు విన్న సీఎం
సమ్మయ్యనగర్, పోతననగర్, రంగంపేట కాలనీల్లో పర్యటించిన సీఎం.. బాధితులతో మాట్లాడారు. బాధితులు సీఎంకు తమ సమస్యలు ఏకరువు పెట్టగా.. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వరద నష్టంపై హనుమకొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటోల ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులతో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు.


