AP: క‘న్నీరే’ మిగిలింది | Cyclone Montha effect: Crop damage in lakhs of acres in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Cyclone Montha Effect: క‘న్నీరే’ మిగిలింది

Oct 31 2025 5:07 AM | Updated on Oct 31 2025 5:10 AM

Cyclone Montha effect: Crop damage in lakhs of acres in Andhra Pradesh

ముంపునకు గురైన పంట పొలాలు

నీరు దిగే మార్గం లేక రైతుల గగ్గోలు

గోదావరి డెల్టాలో ఎగదన్నుతున్న డ్రెయిన్లు 

కళ్లెదుటే కుళ్లిపోతున్న వరికంకులు, పత్తికాయలు 

పొంగి పొర్లుతున్న ఏలేరు, సుద్దగడ్డ జలాశయాలు  

పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌ కింద ముంపు బారిన పొలాలు 

ఆదుకునే ఆపన్న హస్తం కోసం అన్నదాత ఎదురుచూపులు 

మొక్కుబడి తంతుగా పంట నష్టం అంచనాలు

నోటి కాడ కూడు లాగేసినట్టైంది 

నేను కౌలు భూమి 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తీరా వరి కోతకు వచ్చి కోసుకునే సమయంలో తుపాను దెబ్బకు పదెకరాల్లో పంట నేలవాలిపోయింది. కొంత పంట నీట మునిగింది. నోటి కాడ కూడు లాగేసినట్టైంది. ప్రభుత్వం, అధికారులు నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలి. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతాం. 
– వడిశ మహేశ్వరరావు, రైతు, ధవళపేట, శ్రీకాకుళం  

ఎనిమిది ఎకరాల పొలంలో కేఎన్‌ఎం రకం వరి 
పంట సాగు చేశాం. రూ.4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి, నానా చాకిరి చేస్తే పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడం వల్ల మొత్తం నష్టపోయాం. నష్టపోయినట్లు అధికారులకు తెలిపినా ఇప్పటికీ పట్టించుకున్న నాథుడే లేడు. ఏ అధికారి రాలేదు. కనీసం నష్టపోయిన రైతుల నుంచి వివరాలైన తెలుసుకుంటే పరిహారం వస్తుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. 
– పెయ్యల శ్రీకాంత్, ఉప్పలపాడు, నెల్లూరు జిల్లా  

సాక్షి, అమరావతి: అన్నదాతకు కన్నీరే మిగిలింది. రెక్కల కష్టాన్ని మోంథా తుపాను తుడిచిపెట్టేసింది. ఏపుగా ఎదిగిన వరి కంకులు తలలు వాల్చాయి. కళ్లేదుటే కుళ్లిపోతున్నాయి. మురుగనీటి డ్రెయిన్లలో సకాలంలో పూడిక తీయకపోవడం వల్ల ముంపునీరు దిగే మార్గం లేక ఓ వైపు గోదావరి డెల్టా రైతులు గగ్గోలు పెడుతుంటే.. కృష్ణా డెల్టా పరిధిలో ముంపునీటిని మళ్లించేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. 

మరొక వైపు కాకినాడ జిల్లాలో ఏలేరు,  సుద్దగడ్డ రిజర్వాయర్లు, బాపట్ల జిల్లాలో పర్చూరు వాగు పొంగి ప్రవహిస్తూ పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. మరొక వైపు ముంపు లేని ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. పూర్తిగా ముంపునకు గురైన పంట చేల వైపు బృందాలు కన్నెత్తి చూడకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిగా పలు విపత్తుల బారిన పడిన సందర్భాల్లో పంట నష్టపోయిన తమకు పైసా పరిహారం కూడా అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చెరువులను తలపిస్తున్న చేలు  
పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో వరి కంకులు నేలరాలాయి. చేలల్లో ముంపునీరు పోయే మార్గం లేక రైతులు తలలుబాదుకుంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చెరువులను తలపిస్తున్న పంట పొలాలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 

డ్రెయినేజీ వ్యవస్థను కూటమి సర్కారు గాలికి వదిలేయడంతో డ్రెయిన్లు పూడిపోయి అధ్వానంగా మారాయి. దీంతో మోంథా ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రవాహం సవ్యంగా సాగే పరిస్థితి లేకపోవడంతో నీరు పంట చేలను ముంచెత్తింది. దీనికితోడు అవుట్‌పాల్‌ స్లూయిస్‌సు, స్ట్రయిట్‌ కట్‌లు నిర్వహణ వైఫల్యం కూడా పంట పొలాల మునకకు కారణంగా కనిపిస్తోంది.   

కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంకలో నేలమట్టమైన అరటి తోట  

పొంగి ప్రవహిస్తున్న ఏలేరు, సుద్దగడ్డ రిజర్వాయర్లు 
కాకినాడ జిల్లాలో ఏలేరు, సుద్దగడ్డ జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. ఏలేరులో ఇప్పటికే 22 వేల క్యూసెక్కుల నీరు చేరింది. కిందకు ఏడువేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో ఒకటి రెండ్రోజుల్లో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లోని పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే పిఠాపురం బ్రాంచి కెనాల్‌ కింద 15 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయి. 

మరో 30వేల నుంచి 50వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని నరసాపురం, పాలకొల్లు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ముంపునకు గురైన వేలాది ఎకరాల్లోని పంటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతం, బాపట్లతోపాటు పలు జిల్లాల్లో  పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు పంట చేలను ముంచెత్తుతున్నాయి.  

బాపట్ల జిల్లాలో మినుము, పత్తి, సోయాబీన్‌ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న పంటలు సగానికిపైగా దెబ్బతిన్నాయి. లంకల్లో అరటి, బొప్పాయి పంటలు తుపాను ధాటికి పూర్తిగా నేల మట్టమయ్యాయి. దీంతో రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. పంట నష్ట అంచనాలను పారదర్శకంగా పూర్తిచేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆవేదన చెందుతున్నారు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లిలో నేలవాలిన వరి మొలకెత్తిన దృశ్యం    

పంటంతా నీట మునిగిపోయింది
నేను రెండు ఎకరాల్లో వరి పంట వేశాను. రూ.45 వేలు వరకు ఖర్చు చేశాను. పొట్ట దశలో వరి పంట ఉండగా తుపాన్‌ వల్ల పంటంతా నీట మునిగిపోయింది. నోటి కాడ కూడు లాగేసినట్టైంది.   
– పోతు ఈశ్వరరావు, చిన అప్పనపాలెం, బుచ్చెయ్యపేట మండలం, అనకాపల్లి జిల్లా

మొక్కజొన్న పొత్తులు తడిచిపోయాయి 
ఈ ఏడాది సుమారు 50 సెంట్లు విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశా. పంట కంకులు (పొత్తులు) విరిచి నూర్పిడికి సిద్ధం చేశా. తుపాన్‌తో కంకులు తడిచిపోయాయి. మొలకలు వచ్చాయి. ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పుల్లో కూరుకుపోతాం.  
– కత్తుల రాధ, జుమ్మువలస, విజయనగరం జిల్లా

నారు మడి కొట్టుకుపోయింది 
నాకు సిద్దిగుంటపాళెం సమీపంలో 3 ఎకరాల పొలం ఉంది. ఈ పొలా­న్ని సాగు చేసే నిమిత్తం ఈ నెల 27న 10 సె­ంట్ల విస్తీర్ణంలో నారు­మడి తయారు చేసి 90 కిలోల బి­పీటీ విత్తనాలను చల్లుకున్నాను. తుఫాన్‌కు నారుమడి కొట్టు­కుపోయింది.    
– కొక్కముళ్ళ పెంచలయ్య, నెల్లిపూడి, వాకాడు మండలం, తిరుపతి జిల్లా  

గుర్రపు డెక్కతో నీళ్లన్నీ చేలోనే.. 
తుపాన్‌తోపాటు కాలువల్లో గుర్రపుడెక్క పేరుకుపోవడం వల్ల చేలు నీటమునిగాయి. డెక్క సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యను మంత్రి నిమ్మల రామానాయుడుకు వివరించినా ఫలితం లేదు. ఇప్పుడు తీరని నష్టం జరిగింది.   
– పిట్టా రత్నరాజు, ఆగర్రు, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా 

పంట మొత్తం చేజారిపోయింది 
8 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశా. ఎకరానికి రూ.40 వేలు ఖర్చయింది. 105 బస్తాలు కౌలు ఇవ్వాలి. తుపాన్‌ వల్ల పంట మొత్తం దెబ్బతింది. తీవ్రంగా నష్టపోయాను. సర్కారు ఆదుకోవాలి.  
– గరువు శ్రీను, శివదేవుని చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా

మొక్కజొన్న దెబ్బతింది 
ఐదు ఎకరాల్లో మొక్కజొన్న వేస్తే అధిక వర్షాలకు రెండు ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మిగిలిన మూడు ఎకరాల్లో పంట కోత కోసి ఆరబోస్తే తుఫాన్‌కు భారీ వర్షం కురిసి కల్లాల్లో ఆరబోసిన పొత్తులు తడిచిపోయింది. దీనిని ఎలా అమ్మాలో కూడా తెలియని దుస్థితి. ప్రభుత్వం స్పందించి తడిచిన పంటను కొనాలి.   
    – సుబ్బన్న, రైతు, కరివేన, నంద్యాల జిల్లా

తుపాను తుడిచిపెట్టేసింది  
గొడవర్రులో 60 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలు పైగా పెట్టుబడి అయ్యింది. తుపాను కారణంగా మొత్తం వరి చేలు పూర్తిగా పడిపోయాయి. కంకులు నీటిలో నానుతున్నాయి. తాలు, తప్ప తప్ప మరేమీ చేతికి వచ్చేట్టు లేదు. తుపాను పూర్తిగా పంటను తుడిచేసింది. అధికారులు సమగ్రంగా నష్టం నమోదు చేసి ఆదుకోవాలి.    
– కురగంటి నాగేశ్వరరావు, కౌలురైతు, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణాజిల్లా  

మొక్కలు విరిగిపడితేనే పరిహారమట! 
8 నెలల క్రితం బొప్పాయి మొక్కలు నాటుకున్నాను. ఆరు ఎకరాల్లో పంట సాగు చేసా. నిండు కాపుతో కోత దశలో ఉంది. తుఫాన్‌తో పంటంతా దెబ్బతింది. ఆరు ఎకరాలకు రూ.5 లక్షలు అప్పుచేసి పెట్టుబడి పెట్టా. ఒక్క రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఉద్యానవనశాఖ అధికారుల దృష్టికి విషయం తీసుకెళితే మొక్కలు గాలికి విరిగిపడితేనే పరిహారం వస్తుందంటున్నారు.  ఇదెక్కడి విడ్డూరమో అర్థం కావడం లేదు.  
– దమ్మని చంద్రమోహన్, శింగరపల్లె, బేస్తవారిపేట మండలం, ప్రకాశం జిల్లా

కౌలు రైతులను ఆదుకోవాలి 
నేను 22 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. పంట పూర్తిగా నేలకొరిగింది. ఎకరానికి రూ.30 వేల చొప్పన పెట్టుబడి పెట్టాను. సుమారు రూ.6.5 లక్షల వరకూ పంట నష్టం వచ్చింది. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. 
– యామసాని శివకుమార్, కౌలు రైతు, బిక్కవోలు, తూర్పు గోదావరి జిల్లా

వరి పంటకు మొలకలొచ్చాయి 
10 కుంటల్లో వరి పంట సాగు చేశాను. రూ.20 వేలు ఖర్చు అయ్యింది. వరి పంట కోత దశకు వచ్చింది. 15 రోజులు తర్వాత కోత కోద్దామనుకున్నా. ఈలోగా వచ్చిన మొంథా తుఫాన్‌ కొంప ముంచింది. వరి పంట నేలవాలి మొలకలు వచ్చాయి. సర్కారు న్యాయం చేసి పరిహారం అందించాలి.   
– కుమార్‌స్వామి రెడ్డి, రైతు, టి.పుత్తూరు, తవణంపల్లె మండలం, చిత్తూరు జిల్లా 

తుపాను మా కొంప ముంచింది..  
మాకు కాగుపాడు ఆయకట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. సొంతంగా సాగు చేశాం. వంద బస్తాలు అవ్వాల్సింది. 60 బస్తాలు కూడా అవ్వుతాదో లే§దో అర్థం కావడం లేదు. పైగా ఆ పంటను పోగుచేసేందుకు అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుంది. కోత మిషన్‌ ఖర్చులు అదనంగా అవుతాయి. తుఫాన్‌ మా కొంపముంచింది.  
    – గండికోట నాగయ్య, ఉంగుటూరు, ఏలూరు జిల్లా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement