చేలో నీళ్లు.. రైతుకు కన్నీళ్లు | Farmers suffered heavy losses due to Cyclone Montha | Sakshi
Sakshi News home page

చేలో నీళ్లు.. రైతుకు కన్నీళ్లు

Nov 1 2025 4:41 AM | Updated on Nov 1 2025 9:01 AM

Farmers suffered heavy losses due to Cyclone Montha

రాష్ట్ర వ్యాప్తంగా పంటలపై విరుచుకుపడిన మోంథా తుపాను

వరికి అపార నష్టం.. సగానికి సగం తుడిచి పెట్టుకుపోయిన పంట 

కళ్లముందే సర్వం ముంచేసిందని రైతులు కన్నీటిపర్యంతం  

పత్తి, మిర్చి, అరటి, మొక్కజొన్న, పూలు, కూరగాయలు, బొప్పాయి పంటలకూ నష్టం 

లక్షలాది ఎకరాల్లో ఇంకా బయటకెళ్లని నీరు.. పొట్ట, పాలు పోసుకునే దశల్లో కుళ్లిపోతున్న వరి  

తాలుగా మారి ఎండిపోతున్న వరికంకులు  

వాలిన వరిని నిలబెట్టేందుకు రైతుల కష్టాలు

పెట్టుబడులు రావని వాపోతున్న రైతులు 

పంటనష్ట పరిశీలన పైపైనే సాగుతోందని రైతుల ఆందోళన.. 

నిబంధనల సాకుతో పరిహారం ఎగ్గొట్టేందుకు సర్కారు యత్నాలు 

తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు భారీ నష్టం.. అప్పుచేసి పంటలు సాగు చేసిన రైతన్నకు నష్టాన్నే మిగిల్చిన విపత్తు 

తుపాను ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యంతోనే తీవ్ర నష్టమని ఆగ్రహం 

క్షేత్ర స్థాయిలో ‘సాక్షి’ పరిశీలన

సాక్షి నెట్‌వర్క్‌: మోంథా తుపాను రాష్ట్రంలో రైతులను నిలువునా ముంచేసింది. వరి, మొక్కజొన్న, అరటి, పత్తి, తదితర పంటలకు, ఉద్యాన తోటలకు తీరని నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా పడిపోయిన అరటి తోటలు, నేలకొరిగిన వరి పనలే దర్శనమిస్తున్నాయి. కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో తుడిచి పెట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. చేలను ముంచెత్తిన నీళ్లు ఇంకా బయటకు వెళ్లలేదు. ఫలితంగా పంట ఇంకా నీటిలోనే మురిగిపోతోంది. 

నీట మునిగిన, నేలకొరిగిన పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారులు మెజారిటీ శాతం మునిగిన పంటను పూర్తిగా పరిశీలించిన పాపానపోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్ర స్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించింది. తమకు జరిగిన నష్టంపై ప్రతి చోటా రైతులు ఏకరువు పెట్టారు. నేలకొరిగిన పంటను కాపాడుకోవడంలో భాగంగా పొలంలో ఉండిపోయిన నీటిని బయటకు పంపేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ రైతులు పలు చోట్ల కనిపించారు. 

పడిపోయిన వరి పంటను కట్టలు కట్టుకుంటున్నారు. అధికారులు వస్తే జరిగిన నష్టాన్ని చూపాలని ఆత్రంగా ఎదురు చూస్తూ కనిపించారు.  కాగా, తుపాను ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యంతోనే ఎక్కువ నష్టపోతున్నామని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.   

ఉత్తరాంధ్ర రైతాంగంలో ఆందోళన  
» శ్రీకాకుళం జిల్లాలో మోంథా తుపాను 23 మండలాలపై ప్రభావం చూపింది. 82 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎక్కువగా నష్టం జరగ్గా, మిగతా నియోజకవర్గాల్లో ఓ మాదిరి నష్టం సంభవించింది. ఇచ్ఛాపురం మండలంలోని రత్తకన్న, తులిగాం, ఇన్నేషుపేట, కోట»ొమ్మాళి మండలంలోని గుంజిలోవ తదితర గ్రామాల్లో రైతులు తమ పొలాల్లో చేరిన నీటిని బయటికి పంపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

»   విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతోపాటు పెందుర్తి మండలంలోనూ తుపాను బీభత్సం సృష్టించింది. వరి మొదళ్లు కుళ్లిపోయాయి. మళ్లీ.. పంటని నిలబెట్టుకోవాలంటే.. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాతే సాధ్యమవుతుందని రైతులు చెబుతున్నారు. అయితే.. వరద నీరు మొత్తం పోయేందుకు మరో 15 రోజుల సమయం పడుతుందని ఈలోగా.. పంట మొత్తం కుళ్లిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  

»  పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు రూరల్, పాచిపెంట, మక్కువ, బలిజిపేట, సీతానగరం, పాలకొండ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, భామిని తదితర మండలాల్లో వరి, పత్తి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాచిపెంట, కురుపాం, సాలూరు, కొమరాడ తదితర మండలాల్లో పత్తి పంట తడిసి ముద్దయ్యింది.   

»  అనకాపల్లి జిల్లావ్యాప్తంగా 15,800 ఎకరాల్లో పంటలు నష్టపోతే... అధికారులు మాత్రం 2వేల ఎకరాలే చూపిస్తున్నారు. 13,800 ఎకరాల్లో వరి, 2వేల ఎకరాల్లో చెరకు, వెయ్యి ఎకరాల్లో బొప్పాయి, అపరాలు, కూరగాయలు, కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 

60వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం! 
కాకినాడ జిల్లాలో ఏలేరు పొంగి ప్రవహిస్తూండటంతో సుమారు 60 వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా వరి, మిర్చి, పత్తి, దొండ తదితర పంటలు దెబ్బతిన్నాయి. పిఠాపురం, గొల్లప్రోలు, గోకవరం, పెద్దాపురం, సామర్లకోట, కరప, తాళ్లరేవు తదితర మండలాల పరిధిలోని పెనుగుదురు, నడకుదురు, వేములవాడ, వేలంగి, కొవ్వూరు, చెందుర్తి, చేబ్రోలు, పవర, పనసపాడు, సర్పవరంలో వరి పంట వెన్నుల వరకు నీట మునిగింది. పొలాల్లోని ముంపునీరు బయటకు వెళ్లే దారి లేక పంటను కాపాడుకునేందుకు కొన్నిచోట్ల రైతులు వరి దుబ్బులను కట్టలుగా కట్టి రోడ్డుపైకి తెచ్చి మాసూలు చేసుకుంటున్నారు.    

కేంద్రాలకు వచ్చిన వారికే పరిహారమట! 
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 76,709 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఉద్యాన పంటలు 3,935 ఎకరాల్లో దెబ్బ తిన్నాయి. కేవలం సహాయ పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి మాత్రమే నగదు పరిహారం అందిస్తామని చెప్పడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు.  

గోదారి జిల్లాల్లో గుండెకోత 
తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా పడిపోయిన అరటి తోటలు, నేలకొరిగిన వరి పనలే దర్శనమిస్తున్నాయి. కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. జిల్లాలో తుపాను ప్రభావం 209 గ్రామాల్లో కినిపించింది.  

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్, వీరవాసరం, నరసాపురం రూరల్‌ పరిధిలోని తాడేరు, బేతపూడి, తుందుర్రు, కంశాల బేతపూడి, మత్స్యపురిలో వరి పంట వెన్నుల వరకు నీట మునిగిపోయి ఉంది. ముంపునీరు లాగక పొట్టలు కుళ్లిపోయి ధాన్యం తాలుగా మారిపోతూ, వెన్నులు ఎండిపోతున్న పరిస్థితులు కనిపించాయి. 

ఈ ప్రాంతంలోని తొక్కోడి డ్రెయిన్‌లోని పూడిక ముంపు నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉండటంతో పొలాల్లోకి నీరు ఎగదన్నుతోంది. కొన్నిచోట్ల రైతులు ఇంజన్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. కోతకు పనికిరాదన్న భావనతో తాడేరులో పశువుల కోసం పంటను కోసేస్తున్న పరిస్థితి కనిపించింది. 

» ఏలూరు జిల్లాలో మోంథా తుపాను అన్నదాతకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. వాస్తవానికి తుపాను నేపథ్యంలో జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ బలమైన ఈదురుగాలుల ప్రభావంతో వరి కంకులు నేలకొరిగాయి. మరోవైపు రోజుల తరబడి పంట చేల్లో నీళ్లు నిలిచిపోవడంతో కొన్నిచోట్ల పంట కుళ్లిన పరిస్థితి. 

‘సరిగ్గా ఇంకో 15 రోజులు ఆగితే కోతలు పూర్తయ్యేవి. కనీసం పెట్టుబడులైనా దక్కేవి. కోతలకు ముందు తుపాను విరుచుకుపడటంతో వరి కంకులు నేలకొరిగాయి. పర్యవసానంగా మళ్లీ ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి అనివార్యంగా మారిన పరిస్థితి’ అని రైతులు వాపోతున్నారు.     

కృష్ణ కృష్ణా.. ఆదుకునే వారేరీ? 
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలు నీటి పాలవ్వడంతో అరకొర పంటనైనా రక్షించుకుందామనే తాపత్రయంలో అన్నదాతలు ఉన్నారు. కంకిపాడు, పునాదిపాడు, ఉప్పలూరు, మంతెన గ్రామాల్లో రైతులు నేలవాలిన వరిపైరును దుబ్బులుగా కడుతూ మిగిలిన పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేల వాలిన వరి పైరును నిలగట్టేందుకు కూలీల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక పలువురు రైతులు పంట చేను వైపు దీనంగా చూస్తున్న పరిస్థితులు కనిపించాయి. 

పొలాల్లో నిలిచిన నీరు పంట బోదెల్లోకి సైతం మళ్లక పోవటంతో పొలాల్లో ఉన్న వరి దుబ్బులను నిలగట్టి పంట నష్టాన్ని నివారించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు కూలీల ఖర్చు అదనపు భారంగా మారింది. ఒక్కొక్కరికి రూ 330 చొప్పున కూలీ చెల్లిస్తూ వరి దుబ్బులను నిలగడుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న∙నమ్మకం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.     

కదిలిస్తే కన్నీరై పారుతోంది  
»  గుంటూరు జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో వరి, పత్తి, మిర్చి, అరటి, పసుపు, కూరగాయలు, పూలు, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. బురదమయమైన పొలాలు, ఇంకా నీట నానుతున్న పంటలు, పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న పాట్లు, ఇప్పటికే తెచ్చిన అప్పులకు తోడు పంటను కాపాడుకునేందుకు కొత్త అప్పుల కోసం పడే తిప్పలు, ఎరువుల కోసం అరువు కోసం దీనంగా వెతికే చూపులు.. ఇలాంటి దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి.  

»  భారీ వర్షాలకు బాపట్ల జిల్లా అతలాకుతలమైంది. వరి, పత్తి, మినుము, సోయాబీన్, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, కూరగాయలు, ఆకుకూరల పంటలు నీటి పాలయ్యాయి. పర్చూరు వాగు, రొంపేరులు పొంగి పొర్లడంతో పర్చూరు, కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో శుక్రవారం నాటికి 50 వేల ఎకరాల్లో వరి పంట నీటిలోనే ఉండిపోయింది. నల్లమడ డ్రైన్, ఈపూరుపాలెం స్రైట్‌ కట్, పేరలి డ్రైన్లు పొంగి పొర్లడంతో బాపట్ల పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రజలు ఇప్పటికీ నీటిలో ఉన్న పొలాలను చూపించారు.   

»  ప్రకాశం జిల్లాలో ఏ రైతును పలకరించినా కన్నీరు పెట్టుకుని, గద్గద స్వరంతో దీనగాధను వినిపిస్తున్నారు. ప్రధానంగా నష్టపోయిన పంటల్లో సింహ భాగం పత్తిదే. కొన్ని ప్రాంతాల్లో ఒక తీత పత్తిని తీయగా జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది రైతులు ఒక తీత కూడా తీయలేదు. తీద్దామని సన్నద్ధమయ్యే లోపు వరుసబెట్టి కురిసిన వర్షాలు, ఆపై మోంథా తుపాను అన్నదాత నెత్తిన పిడుగులా పడింది. వరి, పొగాకు, సజ్జ, మొక్కజొన్న, మినుము పంటలకు కూడా నష్టం వాటిల్లింది. 

నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన గోపతోటి శామ్యూల్‌ 50 ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. అంతా నీటిలో మునిగి పోయిందని, నాలుగు రోజులైనా పంట ఇంకా నీటిలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కురిచేడు మండలం గంగ దొనకొండ గ్రామానికి చెందిన కసిబిసి వెంకటేశ్వర్లదీ ఇదే పరిస్థితి. అయితే ఇతను 20 ఎకరాల్లో నల్ల బర్లీ పొగాకు సాగు చేయగా, పంట నీట మునిగింది.  

»  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరి, మినుము, జొన్న, వేరుశనగ, తమలపాకు, అరటి, బొప్పాయి, పసుపు తదితర పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఇంత వరకు ఎన్యుమరేషన్‌ చేపట్టలేదని రైతులు చెబుతున్నారు. వరి పంట కోత దశ సమయంలో పూర్తిగా నీట మునిగి మొలకలెత్తాయి. గింజ ధాన్యం కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని కర్షకులు కంటతడ పెడుతున్నారు. 

»  నంద్యాల జిల్లాను తుపాను అతలాకుతలం చేసింది. వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సగానికి సగం పంట తుడిచి పెట్టుకుపోయింది. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాల్లో వరి, వేరుశనగ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది.  

పరిహారం పరిహాసం! 
మోంథా తుపాను వల్ల కలిగిన నష్టంకన్నా, ప్రభుత్వం రైతులకు పెడుతున్న కష్టమే వారిని ఎక్కువగా బాధ పెడుతోంది. కళ్ల ముందు పంట నష్టపోయి పొలం గట్టున నీళ్లు నిండిన కళ్లతో నిలబడి తమను ప్రభుత్వం ఆదుకోకపోతుందా అనే ఆశతో రైతులు చూస్తుంటే.. అధికారులు అలా వచ్చి పైపైన చూసి.. అబ్బే ఇది పరిహారం చెల్లించాల్సిన నష్టం కాదు.. దీనికి ఏమాత్రం పరిహారం రాదన్నట్లు చులకనగా చూసి వెళ్లిపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చెయ్యెత్తులో ఉన్న చెరుకు పంట నిలువునా నీట మునిగినా, అబ్బే ఇదొక నష్టమే కాదన్నట్లుగా అధికారులు చూస్తున్నారని వాపోతున్నారు. తుపాను పంట నష్టాన్ని లెక్కించే క్రమంలో అధికారులు ఒక ప్రామాణికతను నిర్ధారించారు. రైతు వేసిన మొత్తం పంటలో 30 శాతం నష్టం జరిగితేనే దానికి పరిహారం ఇవ్వదగిందిగా లెక్కలోకి వేస్తున్నారు. అంతకన్నా తక్కువ నష్టం జరిగితే పైసా కూడా పరిహారం రాదు. ఈ మేరకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. 

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పంటల బీమా ప్రీమియం చెల్లించే బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకోవడంతో బీమా సంస్థల నుంచి ఏమాత్రం పరిహారం వచ్చే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వం దయతలచి ఇచ్చే సాయం తప్ప, దర్జాగా రైతులకు దక్కే బీమా పరిహారం ఇప్పుడు దక్కకుండా పోయింది. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించేది. 

దీంతో ఏదైనా విపత్తుల్లో పంటలకు నష్టం వస్తే సదరు బీమా సంస్థలు ఇన్సూరెన్స్‌ కింద పరిహారం చెల్లించేవి. ఈ క్రమంలో గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలోని మొత్తం 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు బీమా రూపంలో వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బీమా చెల్లించకపోవడంతో కేవలం పంట రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే సదరు బ్యాంకులు బీమా ప్రీమియం చెల్లించడంతో కేవలం 19 లక్షల మందికి మాత్రమే అరకొరగా పరిహారం దక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన మిగతా వారు పూర్తిగా నష్టపోయినట్లే అని అధికారులే స్పష్టంచేస్తున్నారు.   

పరిహారం వస్తుందో రాదో... 
మొక్కజొన్న పొత్తులు కోసి నూర్పిడికి సిద్ధంగా ఉంచాం. ఈలోగా వర్షం వచ్చి మొత్తం పొత్తులను తడిపేసింది. రంగుమారిపోయి నాణ్యత తగ్గిపోయాయి. వీటిని కొనుగోలు చేస్తారో లేదో తెలియడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. 

పంట నష్టానికి పరిహారం వస్తుందో రాదో తెలియదు. అంతా దైవా«దీనం. వేసిన పంటలు చేతికి వచ్చేవరకు నమ్మకంలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం అంటేనే భయంగా ఉంది.  – చందక నారాయణమ్మ, పెరిపి గ్రామం, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా 

పశువుల మేతగా అయినా పనికొస్తుందని.. 
ఏడు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ప్రస్తుతం పంట పొట్ట దశకు చేరింది. విత్తనం నుంచి దమ్ము, నాట్లు, ఎరువులు, పురుగు మందుల కోసం ఇప్పటికే ఎకరానికి రూ.20 వేలు వరకు ఖర్చయ్యింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో మాయదారి తుపాను వచ్చింది. 

వర్షాల వలన రోజుల తరబడి పొట్టల పైవరకు నీరు నిలిచిపోయింది. వరి వెన్నులు కుళ్లిపోతుండటంతో నీరు లాగగానే పైరు పడిపోతుంది. కంకులు తాలుగా మారిపోతాయి. పశువులకు మేతగా అయినా పనికొస్తుందని ఇప్పుడే కోసేస్తున్నాం  – పెంటపాటి త్రిమూర్తులు, తాడేరు, భీమవరం రూరల్, ప.గోదావరి జిల్లా 

వ్యవసాయం అంటేనే వణుకు పుడుతోంది 
ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రకృతి రైతులను ఇబ్బంది పెడుతూ ఉంటే వ్యవసాయం చేయాలంటేనే వణుకు పుడుతోంది. పంట పండించే వరకు ఎరువుల కోసం పాట్లు పడవలసి వచ్చింది. చేలో వేద్దామంటే యూరియా కూడా దొరకలేదు. 

అదేదో గట్టెక్కామనుకుంటుంటే పంట వచ్చిన సమయంలో పొలాన్ని ముంపు నీరు ముంచేసింది. సొంత పొలం రెండు ఎకరాలు, తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. గింజ గట్టిపడుతున్న సమయంలో ముంపునకు గురై, నీటిలో నిండిపోయింది. రూ.10 వేలు అయినా చేతికొస్తుందో లేదో. – ఇంటి వెంకట్రావు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం   

కౌలు రైతుకు ఏమీ లేవు 
దేవుడు మాన్యం రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నా. స్వర్ణ రకం సాగు చేశాను. ఇంకో 20 రోజుల్లో పంట చేతికివచ్చే తరుణంలో తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు అంతా తారుమారైంది. కౌలురైతు కావడంతో ఎలాంటి సాయం దక్కదని ఆందోళనగా ఉంది. ఏ అధికారీ ఇప్పటి వరకు పొలం వైపు రాలేదు.    – సీమల జానరాజు, చిన్న రైతు, పెదపాడు, ఏలూరు జిల్లా 

రైతు పరిస్థితి దయనీయం 
నాకు సెంటు పొలం లేదు. స్టూవర్టుపురం రెవెన్యూ పరిధిలోని 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాను. ఎకరాకు రూ.10 వేల చొప్పున ముందే రూ.లక్ష చెల్లించాను. ఇప్పటికీ పైర్లు నాట్లువేసి 70 రోజులు అయ్యింది. ఒక్కో ఎకరాకు రూ.30 వేల చొప్పున ఖర్చుచేశాను. 10 ఎకరాలకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. నా పొలం మొత్తం నీటిలో మునిగింది. మాలాంటి రైతుల పరిస్థితి దయనీయం. – కుంచాల లక్ష్మారెడ్డి, బేతపూడి, బాపట్ల జిల్లా  

పెట్టుబడీ రాదు  
ఈ చిత్రంలో ఉన్న రైతు పేరు మద్దిపాటి హరే రామకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామంలో 7 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపాను ప్రభావంతో వీచిన భారీ ఈదురుగాలులు, వర్షాలకు వరి పంట తుడిచిపెట్టుకు­పోయింది. 7 ఎకరాల్లో పంట నేల కొరిగింది. ఇప్పటికే పంట సాగుకు ఎకరానికి రూ.30 వేలు చొప్పున రూ.2.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. వరి గింజ గట్టిపడే దశకు వచ్చింది. మరికొన్ని రోజుల్లో కోతలకు సిద్ధమవుతుండగా ప్రకృతి కన్నెర్ర చేసింది. 

తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట మొత్తం నేలకొరిగింది. ప్రస్తుతం ఆ వరి పనలు కట్టేందుకు ఎకరానికి మరో రూ.10 వేలు వెచ్చించాల్సి వస్తోంది. మరో రూ.70 వేలు అదనపు భారం పడుతోంది. దీంతోపాటు ఎకరానికి 40 బస్తాల ధాన్యం దిగుబడి అందుతుందని భావిస్తే.. ప్రస్తుతం 20 నుంచి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రతి రోజూ 20 మంది కూలీలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కూలి ఇచ్చి పనలు కట్టిస్తున్నారు.  

మొక్క బతుకుతుందో లేదో.. 
ఈ రైతు పేరు చాగంరెడ్డి రామకోటి రెడ్డి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ఈ రైతు ఈ ఏడాది తొమ్మిది ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. మొక్క ఇప్పుడిప్పుడే పెరుగు­తోంది. ఈ దశలో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పైరు నీట మునిగింది. ఒక రోజంతా కష్టపడి ఇంజిన్లతో పొలంలో నిలిచిన నీటిని బయటకు పంపాడు.

రెండవ రోజు నేలవాలిన మొక్కలను పైకి లేపుతున్నారు. మూడవ రోజు బలం మందులు పిచికారీ చేశాడు. ఇప్పటి వరకు ఈ రైతుకు ఎకరాకు సుమారు రూ. 60వేల నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు అయ్యింది. కౌలు అదనం. ఇప్పుడు ఆయిల్‌ ఇంజిన్లు, ఎరువుల ఖర్చు అదనం. ఇంతా చేసినా మొక్క బతుకుతుందో లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. 

పడిపోయిన చేను కోసేస్తున్నాడు 
ఈ రైతు పేరు చప్పగడ్డి నాగేశ్వరరావు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ఖండేపల్లి గ్రామం. 1.20 ఎకరాల్లో వరి పంట వేశాడు. ఆర్‌ఆర్‌ వరి రకం వేయ­డంతో త్వరగా పండేసింది. మరో పది రోజుల్లో కోత కోయాలనుకునే­లోపే తుపాను దెబ్బతో పంట మొత్తం మునిగిపోయి నేలకొరిగింది. 

నిన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ వచ్చి చూసి ఫొటో  తీసుకుని వెళ్ళిపోయింది. పరిహారం ఇస్తారో లేదో ఎవరూ చెప్పడం లేదు. నేలకొరిగిన పొలాన్ని కోసేస్తున్నాడు. కోసి ఎండ పెడితే ఏదో కొద్దిగానైనా ధాన్యం చేతికొస్తుందనే ఆశతో ఇలా చేస్తున్నాడు. పెట్టుబడి కూడా చేతికి రాదని, పొలాన్ని చూస్తే ఏడుపు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  

ఆశలన్నీ వరదపాలు
ఈ రైతు పేరు మేర్నిడి గంగరాజు. కాకినాడ రూరల్‌ కొవ్వూరు గ్రామం. 8వ ఏట నుంచే వ్యవసాయం పనుల్లో ఉన్నాడు. రెండు ఎకరాలు సొంత పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాడు. వాతావరణం అనుకూలించడంతో వరిచేలు ఈనిక పూర్తయి గింజ తోడుకునే దశకు చేరుకుంది. ఈ సమయంలో మోంథా తుపాను నట్టేట ముంచేసింది. 

మొత్తం ఐదు ఎకరాల్లో పంట నేలనంటేసింది. గింజ పాలు తోడుకునే దశలో ఉండడంతో పువ్వారం రాలిపోయింది. ఎకరాకు 45 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఆశలన్నీ వరదలో కొట్టుకుపోయాయని చెబుతున్నాడు. అంచనాలో సగం దిగుబడి కూడా రాదని వాపోతున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement