కూటమి ప్రభుత్వ తీరుపై తుపాను బాధితుల నిరసనగళం
ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నిలదీత
విశాఖ మాధవధార వాంబేకాలనీలో జవాబివ్వలేక జారుకున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే నాగమాధవికి చేదు అనుభవం
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీకీ నిరసన సెగ
మర్రిపాలెం(విశాఖ జిల్లా)పూసపాటిరేగ(విజయనగరం జిల్లా)/కాకినాడ రూరల్: మోంథా తుపాను బాధితులకు నష్టపరిహారం అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దొడ్డిదారిన పచ్చచొక్కాలకు పరిహారాన్ని పరిమితం చేసింది. అసలైన బాధితులను మోసగించింది. పునరావాస కేంద్రాల్లో నిద్రించిన వారికే పరిహారం అంటూ సాకులు వెతికింది.
వాస్తవానికి తుపాను సమయంలో బంధువుల ఇళ్లలో తలదాచుకోవాలని అధికారులు, సిబ్బందే సూచించి.. ఇప్పుడు పరిహారానికి ఎగనామం పెట్టడంపై బాధితులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో బాధితులకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు మెల్లిగా జారుకుంటున్నారు.
వాంబేకాలనీవాసుల ఆగ్రహం
మోంథా తుపాను ప్రభావంతో విశాఖపట్నం 51వ వార్డు మాధవధార వాంబే కాలనీలో ఇళ్లు పెచ్చులూడిపోయాయి. తుపాను సమయంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు కాలనీలో ఇళ్లను పరిశీలించి బాధితులను మాధవధార మాధవస్వామి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లాలని సూచించారు. అయితే సిబ్బంది మాత్రం అవకాశం ఉన్నవారు బంధువుల ఇళ్లకు వెళ్లాలని చెప్పారు.
ఆ సమయంలో అందరి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తీసుకుని వారి పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. పునరావాస కేంద్రానికి 60 కుటుంబాలు వెళ్లగా, మరికొందరు బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకున్నారు. తీరా నష్టపరిహారం విషయానికి వచ్చేసరికి అధికారులు చాలామందికి ఎగనామం పెట్టారు. వాంబేకాలనీలో 80 కుటుంబాలు ఉండగా, శుక్రవారం మాధవధార ఆర్టీవో కార్యాలయం సమీపంలోని కార్యాచరణ ప్రణాళిక కార్యాలయం(పీ–4)లో జరిగిన పరిహారం పంపిణీ కార్యక్రమంలో 30 కుటుంబాలకు మాత్రమే నిత్యావసరాలతోపాటు రూ.3వేల నగదు అందించారు.
దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును నిలదీశారు. ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పే యత్నం చేయగా.. వారు వినలేదు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు లక్ష్మి, పైడిపల్లి సత్యవతి, నాగమణి తదితరులు మాట్లాడుతూ తమకు తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
జనసేన ఎమ్మెల్యే నాగమాధవిపై బాధితుల ఆగ్రహం
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి శుక్రవారం చేదు అనుభవం ఎదురయింది. మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు బియ్యం పంపిణీకి వచి్చన ఆమెను కోనాడ గ్రామ బాధితులు నిలదీశారు. గ్రామంలో 590 మత్స్యకార కుటుంబాలు ఉంటే కేవలం మత్స్యకార భరోసా అందిన 27 కుటుంబాలకే బియ్యం ఇవ్వడంపై ధ్వజ మెత్తారు. ఎమ్మెల్యేను నిలదీశారు.
అందరికీ బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే బియ్యం పంపిణీ చేయకుండానే పోలీసుల సాయంతో గ్రామం నుంచి వెళ్లిపోయారు. అనంతరం కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డిని కలిసిన మత్స్యకార నాయకులు అందరికీ బియ్యం అందించాలని వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంలో వివక్ష లేకుండా సాయం పంపిణీ చేశారని వివరించారు.
కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యేకూ నిరసన సెగ
కాకినాడ రూరల్ మండలం పోలవరం, సూర్యారావు పేట గ్రామాలలోని మత్స్యకారులకు శుక్రవారం బియ్యం పంపిణీ చేయడానికి వచ్చిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీని తుపాను బాధితులు నిలదీశారు. నేమాం గ్రామ పరిధిలోని సూర్యారావుపేటలో సుమారు 245 మత్స్యకార కుటుంబాలు ఉంటే కేవలం 48 కుటుంబాలనే నష్టపరిహారానికి ఎంపిక చేయడం తగదని నిరసన వ్యక్తం చేశారు.
ఆందోళనకారుల్లో ఎక్కువ మంది టీడీపీ సానుభూతిపరులు ఉండడం గమనార్హం. దీంతో ఎమ్మెల్యే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం తమ్మవరం గ్రామ పరిధిలోని పోలవరంలోనూ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. గ్రామంలో 250 కుటుంబాలు ఉంటే 77 కుటుంబాలను ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించారు. అందరికీ ఇస్తేనే తీసుకుంటామని సరుకులు తీసుకునేందుకు నిరాకరించారు. అలాగే సూర్యారావుపేటలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించకపోవడంతో స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు.


