అది రద్దు చేయడం బెటర్ మేనేజ్‌మెంట్ అవుతుందా బాబూ?
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
మోంథా తుపానుతో సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం.. బీమాలేని ఆ రైతులకు దిక్కెవరు?
మా హయాంలో ఉచిత పంటల బీమాతో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్ల పంట నష్ట పరిహారం
ఇప్పుడు సొంతంగా ప్రీమియం కట్టుకోవడంతో కేవలం 19 లక్షల మంది రైతులే పంటల బీమా పరిధిలోకి
మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి బాబూ?
ఆర్బీకేలు నిర్వీర్యం.. ఈ –క్రాప్, ఇన్‌పుట్ సబ్సిడీని నీరుగార్చారు
రైతుల వెన్ను విరగ్గొట్టడాన్ని మంచి ప్లానింగ్ అంటారా?
తుపానును మీరు గొప్పగా మేనేజ్ చేసుంటే 8 మంది ఎందుకు చనిపోయారు?
సాక్షి, అమరావతి: మోంథా తుపాన్ మేనేజ్‌మెంట్‌లో సీఎం చంద్రబాబు మాటలు పిట్టల దొరని మైమరపిస్తున్నాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులకు శ్రీరామరక్షలా నిలిచే ఉచిత పంటల బీమాను రద్దు చేయడం.. ఆర్బీకేల నిర్వీర్యం.. ఈ –క్రాప్ వ్యవస్థ, ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని నీరుగార్చి రైతు వెన్ను విరగ్గొట్టడం బెటర్ మేనేజ్‌మెంట్ అవుతుందా? అని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
తుపానులైనా.. వరదలైనా.. కరువైనా.. వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకోవడంలో ప్లానింగ్ అంటే ఇదీ అని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసి భరోసాగా నిలిచిందని గుర్తుచేస్తూ శనివారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..
» చంద్రబాబు గారూ.. తుపాను పరిస్థితులను గొప్పగా మేనేజ్‌మెంట్ చేశానంటూ మీకు మీరే గొప్పలు చెప్పుకోవడం పిట్టలదొర మాటల్లా ఉన్నాయి. తుపానైనా, వరదలైనా, కరువైనా.. అలాంటి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా, రైతు కుటుంబాలకు శ్రీరామ రక్షగా, భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడం బెటర్ మేనేజ్‌మెంట్ అవుతుందా?
మీరు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి రైతుల గొంతు కోయడం వాస్తవం కాదా? ఇది మీ తప్పిదం కాదా? మోంథా తుపాను కారణంగా సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పంటల బీమాలేని ఇంత మంది రైతులకు ఇప్పుడు దిక్కెవరు? మరి మీది ఏరకంగా మంచి మేనేజ్‌మెంట్ అవుతుంది?
» మా ప్రభుత్వ హయాంలో 84.8 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇందులో 54.55 లక్షల మంది రైతులు రూ.7,802 కోట్ల మేర పంట నష్ట పరిహారం అందుకున్నారన్నది వాస్తవం కాదా? ఇలాంటి విపత్తుల వేళ ‘ఉచిత పంటల బీమా’ రైతులకు శ్రీరామరక్ష కాలేదా?
» ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తమకు తాముగా ప్రీమియం కట్టుకోవడంతో కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? అయినా సరే మీరు అద్భుతంగా పని చేశానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? వీరందరికీ గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా జరిగి ఉంటే ఈ విపత్తు సమయంలో ఎంతో భరోసాగా ఉండేది కదా?
» మీ 18 నెలల కాలంలో సుమారు 16 సార్లు ప్రతికూల వాతావరణం, వైపరీతాల్యలతో రైతులు నష్టపోయారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని బకాయి పెట్టారు! ఒక్క పైసా కూడా పంట నష్ట పరిహారం కింద ఇవ్వలేదు. మరి మీరు చేసింది మంచి మేనేజ్‌మెంట్ ఎలా అవుతుంది?
» ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ – క్రాప్ వ్యవస్థను, ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఆ సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని నీరుగార్చారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పంటల పెట్టుబడికి తోడుగా నిలిచిన ‘రైతు భరోసా’ స్కీమ్‌ను మీరు రద్దు చేశారు. అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20,000 చొప్పున ఈ రెండేళ్లకు రూ.40,000 ఇవ్వాల్సి ఉండగా చివరకు కేవలం రూ.5,000 మాత్రమే ఇచ్చి రైతుల వెన్ను విరగ్గొట్టారు. ఇది మంచి ప్లానింగ్ అంటారా? మీకు ప్లానింగ్ ఉంటే ఇలా చేస్తారా?
» తుపాను పరిస్థితులను మీరు గొప్పగా మేనేజ్ చేసి ఉంటే 8 మంది ఎందుకు చనిపోయారు? ఇంత దారుణమైన ప్లానింగ్ వల్ల చనిపోయినా, రైతులు మరణించినా మీలో ఏ కోశానా మంచి చేయాలన్న ఉద్దేశం కనబడదు. అన్నీ అబద్ధాలే. అన్నీ లేనిపోని గొప్పలు చెప్పుకోవడమే.
ప్లానింగ్ అంటే ఇదీ..!
» దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారంగా మా ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు!
» దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేల ఏర్పాటు. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులకు అండగా, వారి చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థ.
» ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, గ్రామ–వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ఆర్బీకేలను మిళితం చేయడం.
» దేశంలోనే తొలిసారిగా ఉచిత పంటల బీమాతో రైతుకు భరోసా. మళ్లీ సీజన్ వచ్చే నాటికి రైతుల చేతికి పంట నష్టపరిహారం.
» ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్ ముగిసేలోగా రైతుకు ఇన్‌పుట్ సబ్సిడీ.
» దేశంలోనే తొలిసారిగా రైతు సాగుచేసే ప్రతి పంటనూ ఈ–క్రాప్ చేయడం. పంట నష్టం జరిగితే శరవేగంగా ఎన్యుమరేషన్ పూర్తి చేసి ఈ–క్రాప్ డేటా ఆధారంగా రైతులను ఆదుకోవడం.
» రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ద్వారా సీఎం యాప్ (కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రైస్, అండ్ ప్రొక్యూర్‌మెంట్)తో గిట్టుబాటు ధరలు రాని రైతులను ఆదుకోవడం. వెంటనే ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలవడం.
» ప్లానింగ్ అంటే ఇదీ చంద్రబాబూ! వీటన్నింటినీ మీరు పథకం ప్రకారం నాశనం చేశారు. మరి మీది మంచి మేనేజ్‌మెంట్ ఎలా అవుతుంది? మీది ముమ్మాటికీ ఇన్ సెన్సిట్ అండ్ ఇన్ కాంపిటెంట్ గవర్నెన్స్. మీది మంచి ప్లానింగ్, మంచి మేనేజ్‌మెంట్ అని చెప్పుకుంటున్నారంటే దాని అర్థం.. లేని దానికి గొప్పలు చెప్పుకోవడం, ఫోటో షూట్లు, పబ్లిసిటీ మాత్రమే!!


