పిట్టలదొరలా బాబు మాటలు.. ప్లానింగ్‌ అంటే మాది: వైఎస్‌ జగన్‌ | YS Jagan Slams CBN over Cyclone Montha Management | Sakshi
Sakshi News home page

పిట్టలదొరలా బాబు మాటలు.. ప్లానింగ్‌ అంటే మాది: వైఎస్‌ జగన్‌

Nov 1 2025 1:52 PM | Updated on Nov 1 2025 3:10 PM

YS Jagan Slams CBN over Cyclone Montha Management

మోంథా తుపాను నిర్వహణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొట్టుకుంటున్న గప్పాలు మాములుగా ఉండడం లేదు. అయితే ఆ ప్రకటనలు పిట్టలదొరని మైమరపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 

చంద్రబాబుగారు.. తుపాను పరిస్థితులను గొప్పగా మేనేజ్మెంట్ చేశానంటూ మీకు మీరుగా గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే, అవన్నీ పిట్టలదొర మాటల్లా ఉన్నాయి.
తుపానైనా, వరదలైనా, కరువైనా... ఇలాంటి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా రైతుల కుటుంబాలకు శ్రీరామ రక్షగా, భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం, బెటర్ మేనేజ్ మెంట్ అవుతుందా?.. మీరు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ఉద్దేశ పూర్వకంగా రద్దు చేసి, రైతుల గొంతు కోయడం వాస్తవం కాదా? ఇది మీ తప్పిదం కాదా?.. 

మోంథా తుపాను కారణంగా సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. పంటల బీమాలేని ఇంతమంది రైతులకు ఇప్పుడు దిక్కెవరు? మరి మీది ఏరకంగా మంచి మేనేజ్ మెంట్ అవుతుంది?.. 

మా ప్రభుత్వ హయాంలో 84.8 లక్షలమంది రైతులు ఉచిత పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇందులో 54.55 లక్షలమంది రైతులు, రూ.7,802 కోట్లు పంట నష్ట పరిహారం అందుకున్నారన్నది వాస్తవం కాదా? ఇలాంటి విపత్తుల వేళ "ఉచిత పంటల బీమా” రైతులకు శ్రీరామ రక్ష కాలేదా?

ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తమకు తాముగా ప్రీమియం కట్టుకోవడంతో కేవలం 19లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి? అయినా సరే మీరు అద్భుతంగా పనిచేశానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? వీరందరికీ గతంలో, వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నట్టుగా, అందరికీ ఇ-క్రాప్, అందరికీ ఉచిత పంటల బీమా జరిగి ఉంటే, ఈ విపత్తు సమయంలో వీరందరికీ ఎంతో భరోసాగా ఉండేది కదా?.. 

మీ 18 నెలల కాలంలో సుమారు 16 సార్లు ప్రతికూల వాతావరణం, వైపరీత్యాలతో రైతులు నష్టపోయారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయి పెట్టారు? ఒక్కపైసా కూడా పంట నష్ట పరిహారం కింద ఇవ్వలేదు. మరి మీరు చేసింది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది?.. 

ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఇ-క్రాప్ వ్యవస్థను, ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని నీరుగార్చారు. ఉచిత పంటలబీమాను రద్దుచేశారు. గత వైయస్సార్ సీపీ ప్రభుత్వంలో పంట పెట్టుబడికి తోడుగా ఉండే "రైతు భరోసా” స్కీంను రద్దుచేసి, అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20,000 చొప్పున ఈ రెండేళ్లకు రూ.40,000 ఇవ్వాల్సి ఉండగా, చివరకు కేవలం రూ.5,000 మాత్రమే ఇచ్చి, రైతు వెన్ను విరగొట్టారు. ఇది మంచి ప్లానింగ్ అంటారా? మీకు ప్లానింగ్ ఉంటే ఇలా చేస్తారా? అంటూ ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారాయన. 

తుపాను పరిస్థితులను మీరు గొప్పగా మేనేజ్ చేసి ఉంటే 8 మంది ఎందుకు చనిపోయారు? ఇంత దారుణమైన ప్లానింగ్ వల్ల చనిపోయినా, ఇంత దారుణంగా రైతులు మరణించినా మీలో ఏ కోశానా మంచి చేయాలన్న ఉద్దేశం కనబడదు. అన్నీ అబద్ధాలే, అన్నీ లేని గొప్పలు చెప్పుకోవడమే..

 

అసలు ప్లానింగ్ అంటే మాదే..
దశాబ్దాలుగా వ్యవసాయరంగంలో ఉన్న సమస్యలకు పరిష్కారంగా మా ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేల ఏర్పాటు. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులకు అండగా, వారిని చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థ తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, గ్రామ-వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ఆర్బీకేలను మిళితం చేశాం. దేశంలోనే తొలిసారిగా ఉచిత పంటల బీమాతో రైతుకు భరోసా. మళ్లీ సీజన్ వచ్చే నాటికి రైతుల చేతికి పంట నష్టపరిహారం అందించాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్ ముగిసేలోగా రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. 

.. దేశంలోనే తొలిసారిగా రైతు సాగుచేసే ప్రతి పంటనూ ఇ-క్రాప్ చేశాం. ఇ-క్రాప్ డేటా ఆధారంగా పంట నష్టం జరిగితే శరవేగంగా ఎన్యుమరేషన్ పూర్తిచేసి రైతులను ఆదుకున్నాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధితో, CMAPP (Comprehensive Monitoring of Agriculture, Price, and Procurement)తో గిట్టుబాటు ధరలు రాని రైతులను ఆదుకున్నాం. వెంటనే ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలిచాం.

చంద్రబాబుగారూ.. ప్లానింగ్ అంటే.. ఇదీ. వీటన్నింటినీ మీరు పథకం ప్రకారం నాశనం చేశారు. మరి మీది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది? మీది ముమ్మాటికీ insensitive and incompetent Governance. మీరు మంచి ప్లానింగ్, మంచి మేనేజ్మెంట్ అని చెప్పుకుంటున్నారంటే దాని అర్థం లేనిదానికి గొప్పలు చెప్పుకోవడం, ఫొటో షూట్లు, పబ్లిసిటీ మాత్రమే అంటూ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement