సాక్షి, గుంటూరు: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.
మీడియాలో సమాచారం మేరకు 10 మంది మరణించారని తెలుస్తోంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలి..
.. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలోనూ దుర్ఘటన జరిగి ఏడుగురు మరణించారు. ఇప్పుడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన వల్ల ఇప్పటిదాకా 10 మంది మరణించారని తెలుస్తోంది.
ఈ 18 నెలలకాలంలో ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం లేదని అర్థం అవుతోంది. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనం ఇది. ఇకనైనా కళ్లు తెరిచి తప్పులను సరిదిద్దుకోవాలి అని జగన్ పేర్కొన్నారు.


