ఏలూరు జిల్లా ఉంగుటూరులో నేలవాలి.. నీట మునిగిన వరి పనలను కట్టలు కడుతున్న రైతు మురళీకృష్ణ
మిల్లర్లకు నచ్చితే.. వాళ్లు ఇచ్చే రేటుకు అమ్ముకోండంటూ ఉచిత సలహాలు
తుపాను బాధిత రైతులకు తెగేసి చెబుతున్న కూటమి ప్రభుత్వం
మిగిలిన ధాన్యం కొనుగోలుకు సంచులు కూడా ఇవ్వలేం.. రంగుమారినా, మొలకలొచ్చినా కొనే ప్రసక్తి లేదు
ప్రభుత్వ అడ్డగోలు నిబంధనలతో అన్నదాతలకు ఇక్కట్లు.. ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడమే లక్ష్యంగా కుట్రలు
2 రోజుల్లో తుది పంట నష్టం అంచనాలు రూపొందించాలంటూ సర్క్యులర్
మొక్కుబడి తంతుగా మారిన పంట నష్టం సర్వే.. వాస్తవ నష్టానికి విరుద్ధంగా ప్రాథమిక అంచనాలు
ఆ అంచనాల్లోనూ అడ్డగోలుగా కోతలు పెట్టేందుకు యత్నం.. చరిత్రలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదంటున్న రైతులు
తాము కష్టాల్లో ఉంటే గాలికొదిలేసి చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లడమేమిటని అన్నదాతల నిలదీత
సాక్షి, అమరావతి: విపత్తు సంభవించి పంట నష్టం వాటిల్లినప్పుడు మిగిలిన పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. మొలకలొచ్చినా.. రంగుమారినా.. నూకలైనా సరే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ.. కూటమి ప్రభుత్వం మోంథా తుపాను వేళ పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను నట్టేట ముంచేలా వ్యవహరిస్తోంది. కక్షగట్టినట్టుగా వారిపై కుట్రలకు పాల్పడుతోంది.
ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఓ వైపు ఇన్‌పుట్‌సబ్సిడీ ఏదోవిధంగా ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే.. ఇన్‌పుట్ సబ్సిడీ వంకతో పంటను కొనేందుకు మొహం చాటేస్తోంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి దుస్థితి చూడలేదని రైతులు లబోదిబోమంటున్నారు. మోంథా తుపాను వల్ల కష్టాల్లో ఉండగా తమను గాలికి వదిలేసి సీఎం చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లడం ఏమిటని అన్నదాతలు నిలదీస్తున్నారు.
నిండా మునిగినా..
పంట నష్టపరిహారం ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం కనీసం ఒబ్బిడి చేసుకున్న పంటనైనా కనీస మద్దతు ధరకు కొనే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు వాపోతున్నారు. మీ పేరు తుది జాబితాలో చేర్చాలంటే.. మీ పంటను కొనే అవకాశం ఉండదని తెగేసి చెబుతుండటం రైతులను విస్మయానికి గురిచేస్తోంది. తుపాను మింగేయగా మిగిలిన పంటను మిల్లర్ల ఇచ్చే రేటు మీకు నచ్చితే అమ్ముకోవచ్చని, కొనుగోలు కేంద్రాల్లో కొనే అవకాశాలు లేవని అధికారులు తెగేసి చెబుతున్నారు.
ముంపునకు గురైన పంటలో తేమ శాతం అధికంగా ఉంటుందని, రంగు మారి, మొలకలొచ్చే అవకాశం ఉండటంతో తాము మద్దతు ధర ఇచ్చే ప్రసక్తే లేదని మిల్లర్లు,దళారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న తమను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి దేశంలో ఎక్కడా లేని నిబంధనలు విధించడంపై వారంతా మండిపడుతున్నారు.
అన్ని పంటలకూ ఇదే పరిస్థితి
18 నెలల్లో వివిధ వైపరీత్యాలు, కరువు కాటకాలకు సంబంధించి 5.50 లక్షల మంది రైతులకు రూ.595 కోట్ల మేర పంట నష్టపరిహారం చెల్లించలేదు. ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పైసా కూడా జమ చేయలేదు. ఈమాత్రం దానికి హడావుడి చేయడం తప్ప తమను ఆదుకున్న దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు.
మోంథా కారణంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయినట్టు రైతులు చెబుతుండగా.. ప్రాథమిక అంచనా ప్రకారమే 3.75 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేసిన ప్రభుత్వం దాన్ని కూడా ఏ విధంగా కోత వేయాలా అని ఆలోచిస్తోంది. శుక్రవారం రాత్రికే పంట నష్టం అంచనాల సర్వే పూర్తి చేయాల్సి ఉండగా.. శనివారం సాయంత్రానికి 47 శాతమే సర్వే పూర్తయింది. ఉద్యాన పంటలకు తొలుత 62,595 ఎకరాలుగా పేర్కొనగా.. చివరికి 14,700 ఎకరాలకు పరిమితం చేశారు.
తొలుత 24,570 మంది రైతులకు నష్టం వాటిల్లిందని పేర్కొన్న ప్రభుత్వం రైతుల సంఖ్యను 14,165 మందికి కుదించింది. వ్యవసాయ పంటలకు తొలుత 3.75 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించగా.. శనివారం సాయంత్రానికి 2.39 లక్షల ఎకరాల్లో పరిశీలన పూర్తి చేసి 1.02 లక్షల ఎకరాల్లోనే పంటలు 33 శాతానికిపైగా దెబ్బతిన్నట్టు అంచనా వేసినట్టుగా చెబుతున్నారు.
24 గంటల్లో తుది జాబితాలు సాధ్యమేనా?
ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే ఎంత వేగంగా చేసినా కనీసం వారం లేదా 10 రోజులు సమయం పడుతుంది. మోంథా తుపాను గతనెల 28న తీరం దాటింది. కనీసం బృందాలు కూడా వేయకుండా ఆగమేఘాల మీద 29న ప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్ జారీ చేసింది. 30వ తేదీ నుంచి తుది అంచనాల రూపకల్పన చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది.
కనీసం వారం రోజులకు పైగా సమయం పట్టే ఈ జాబితాల రూపకల్పనకు కేవలం 24 గంటలు మాత్రమే ప్రభుత్వం గడువునిచ్చింది. 31వ తేదీలోగా పూర్తిచేసి నవంబర్ 1న తుది జాబితాలు పంపాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో అభ్యంతరాల స్వీకరణకు కనీసం ఒక్కరోజు కూడా గడువు ఇవ్వలేదు. దీంతో పంట నష్టం అంచనాల రూపకల్పన ప్రహసనంగా తయారైంది.
పంట నష్టం అంచనాల్లో నిబంధనలకు పాతర
ఐదేళ్లూ అండగా నిలిచినవైఎస్ జగన్ ప్రభుత్వం వరదలు, తుపానులు, అధిక వర్షాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు అడుగడుగునా అండగా నిలిచేది. విపత్తు వేళ నేనున్ననంటూ రైతులకు భరోసా కల్పించడమే కాకుండా.. నష్టపోయిన ప్రతి ఎకరాకు దెబ్బతిన్న ప్రతి రైతుకు అదే సీజన్ చివరిలో పరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) అణాపైసలతో సహా లెక్కగట్టి మరీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేవారు.

పైగా ఎవరైనా మిగిలి పోయారేమోనని బూతద్దం పెట్టి మరీ వెతికి సాయం అందించేవారు. అంతకుముందు ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలతో సహా వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558.07 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందజేసింది. మరోవైపు పైసా భారం పడకుండా గత ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందించి సంపూర్ణంగా ఆదుకుంది. ఇలా ప్రతి సందర్భంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచింది.
ఇలాంటి నిబంధనలు ఎప్పుడూ చూడలేదు
పంట మొత్తం తుపాను దెబ్బకు నేలపాలైంది. రైతులు, కౌలు రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ప్రభుత్వం జీవో నంబర్–1 ద్వారా నష్టపరిహారం అరకొరగా పెంచి ప్రతి రైతును ఆదుకుంటామని ప్రకటనలు చేస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో 33 శాతం పైన పంట నష్టపోయిన రైతుల పేర్లు రాస్తున్నారు. ఇది దారుణం.
పైగా ఆ సర్వే నంబర్లలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేది లేదని చెప్పడం సిగ్గుచేటు. 33 శాతం నష్టపరిహారం రాస్తే మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి? అలవికాని నిబంధనలు పెట్టి రైతును నష్టాల ఊబిలోకి నెట్టేయడం దుర్మార్గం. ప్రభుత్వం ఉదారంగా రైతులను ఆదుకోవాలి – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతుల సంఘం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీమా డబ్బులు అందాయి..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల తరఫున పంటల బీమా చెల్లించడంతో మిచాంగ్ తుపాను వల్ల దెబ్బతిన్న నిమ్మ చెట్లకు రూ.4,500, ఎకరం పొలంలో వరినాట్లు నష్టపోయినందుకు రూ.4 వేలు మా ఖాతాల్లో జమ చేశారు. రైతుల పక్షాన పంటల బీమా నగదు చెల్లించి ఉంటే బాగుండేది. – వెన్నపూస రంగమ్మ, మహిళా రైతు, కల్యాణపురం, పొదలకూరు మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
ఈ కౌలు రైతు పేరు నంద్యాల రాంబాబు. ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఈయన 4 ఎకరాల్లో వరి వేశారు. ‘బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టి రూ.1.62 లక్షలు అప్పు తెచ్చి పంట మీద పెట్టాను. తీరా పంట చేతికొచ్చే సమయంలో తుపాను దెబ్బ తీసింది. పంట పూర్తిగా నేలనంటేసింది. పెట్టుబడి చేతికి వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటివరకు అధికారులెరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. అంతా బాగుంటే 30ృ40 బస్తాల దిగుబడి వచ్చేది. పడిపోయిన పంటను మెషిన్‌తో కోస్తే 15 బస్తాలు కూడా రావు. పైగా నేలవాలిన పంటను కోయడానికి అధిక కిరాయి అడుగుతారు. ఎకరాకు 18 బస్తాలు కౌలు చెల్లించాలి’ అని రైతు రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కోసిన పంటను కొనుగోలు చేస్తారా అంటే అదీ కనిపించడం లేదని, రైతు సేవా కేంద్రానికి వెళ్లి అడిగితే నష్ట పరిహారం కోసం రాస్తే సంచులు ఇచ్చేది లేదని చెబుతున్నారని వాపోయారు. ఎన్యుమరేషన్‌లో పేరు రాస్తే.. మిగిలిన పంటను ఒబ్బిడి చేసుకున్నా ప్రభుత్వం కొనదట. బయట అమ్ముకోవాలని సలహా ఇస్తున్నారు. దళారులకు అమ్మితే ఆ వచ్చే నాలుగు డబ్బులు కూడా రావు. చేసిన అప్పులు ఎలా తీర్చాలి? భూ యజమానికి ఏ విధంగా కిస్తీ కట్టాలో తెలియడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు.


