తుపాను ప్రభావంతో కురిసిన వర్షపు నీరు వెళ్లిపోయింది
అందుకే వరితో సహా ప్రధాన పంటలకు పెద్దగా నష్టం జరగలేదు
4.03 లక్షల ఎకరాల్లోనే వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది
‘సాక్షి’ కథనంపై వ్యవసాయ శాఖ
సాక్షి, అమరావతి: ‘నిజమే.. మోంథా తుపానువల్ల అనుకున్నంత నష్టం జరగలేదు. తుపాను ప్రభావం అధికంగా ఉండవచ్చన్న ముందస్తు సమాచారంతో, తుపాను తీరాన్ని దాటబోయే ముందురోజు అప్పటి వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని, మరింత వర్షపాతం ఉంటే పంట నష్టం అధికంగా ఉండవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక పంట నష్టం అంచనాలను కాస్త ఎక్కువగా చూపించాం.
అయితే, తుపాను ప్రభావం ఓ మోస్తరుగానే ఉంది. ముంపునకు గురైన పొలాల్లోనిలిచిన నీరు త్వరగానే బయటకుపోవడంతో పంటలకు అనుకున్నంత నష్టం జరగలేదు. అందుకే.. తొలుత రూ.875 కోట్లకు పైగా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాల్సి వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశాం.
కానీ, తుది అంచనాల ప్రకారం ఈ మొత్తాన్ని రూ.390.03 కోట్లకు కుదించాల్సి వచ్చింది’.. అంటూ వ్యవసాయ శాఖ స్పష్టంచేసింది. ‘అంత నష్టంలేదట’ శీర్షికతో ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆదివారం ఈ మేరకు వివరణ ఇచ్చింది.
15.60 లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావమని చెప్పి..
నిజానికి.. మోంథా తుపాను 24 జిల్లాల్లో 403 మండలాల్లో తీవ్ర ప్రభావం చూపింది. దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని 15,59,925 ఎకరాల్లో పంటలపై ప్రభావం ఉంటుందని అధికారులు తొలుత అంచనా వేశారు. రైతులు కూడా 24 జిల్లాల పరిధిలో 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. అయితే, తుపాను బాధిత రైతులను ప్రభుత్వం గాలికొదిలేయడంతో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణాజిల్లాల్లో ఈనెల 4న పర్యటించి బాధిత రైతులకు బాసటగా నిలిచారు.
ఎన్యుమరేషన్ కోసం తమ పంట పొలాల వైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదని రైతులు జగన్ ఎదుట ఎకరవు పెట్టారు. సుంకు విరిగిన వరికంకులను చూపించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అక్టోబరు 31లోగా ఎన్యుమరేషన్ పూర్తిచేయాలని ఒకరోజు గడువుతో ప్రొసీడింగ్స్ ఇవ్వడంపై జగన్ ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో.. అప్పటివరకు నిర్దేశించిన గడువులోగా 3.45 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత గడువును వారం రోజులపాటు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
వాస్తవానికి.. ఎన్యుమరేషన్ గడువు పెంచినట్లు ఎక్కడా వెల్లడించలేదు. ఇక ఈనెల 8 వరకు ఎన్యుమరేషన్ కొనసాగించడంతో మరో 58 వేల ఎకరాల్లో పంట నష్టం అధికంగా జరిగినట్లు గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. చివరికి.. 3.23 లక్షల మంది రైతులకు చెందిన 4.03 లక్షల ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు 33 శాతానికి పైగా పంట నష్టం జరిగినట్లు నిర్ధారించామని పేర్కొంది.


