సాక్షి,అమరావతి: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల మేరకు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద నంద్యాల వైపు వెళ్తున్న క్వాలిస్ వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి ఎదురుగా కడప వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రవత పెరిగింది.
ఈ ప్రమాదంలో క్వాలిస్ వాహనం పూర్తిగా నుజ్జు అయింది. వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీస్పీ ప్రమోద్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కడప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


