కేంద్ర నిధులపై బాబు సర్కారు పెత్తనం 'గ్రామాలకు గ్రహణం' | Chandrababu Govt exercising control over central Govt funds | Sakshi
Sakshi News home page

కేంద్ర నిధులపై బాబు సర్కారు పెత్తనం 'గ్రామాలకు గ్రహణం'

Dec 26 2025 2:16 AM | Updated on Dec 26 2025 2:16 AM

Chandrababu Govt exercising control over central Govt funds

15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులపై ఆంక్షలు

రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను అడ్డుకుంటూ నిరంకుశత్వం

స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టనివ్వకుండా గ్రామ స్వరాజ్యానికి తూట్లు 

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే పనులకే నిధులంటూ పంచాయతీరాజ్‌ సర్క్యులర్‌  

విజయనగరం సహా పలు జిల్లాల్లో ఎంపీడీవోలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ

సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న సమయంలో బాబు సర్కార్‌ రాజకీయ ఎత్తుగడలు

సాక్షి, అమరావతి: గ్రామ స్వరాజ్యానికి చంద్రబాబు సర్కారు గ్రహణం పట్టిస్తోంది! పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను అడ్డుకుని దొడ్డిదారిన మళ్లించే కుతంత్రానికి తెర తీసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు విడుదలైన రూ.వందల కోట్ల నిధులను ఆయా స్థానిక సంస్థలు అక్కడ అవసరాలకు ఖర్చు పెట్టనివ్వకుండా ఆదేశాలు జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు ఇవ్వకుండా తొక్కిపెడుతున్న బాబు సర్కారు తాజాగా మరో అడుగు ముందుకేసి వాటిని తాము చెప్పిన పనులకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఆంక్షలు విధించడం ద్వారా గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడిచింది.  

బాబు సర్కారు కర్ర పెత్తనం..! 
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడతగా రూ.1,026 కోట్ల నిధులను ఈ ఏడాది అక్టోబరులో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనల ప్రకారం గరిష్టంగా కేంద్రం నుంచి నిధులు విడుదలైన పది రోజుల్లో వాటిని సంబంధిత గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఖాతాల్లో జమ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి మూడు నెలలకు పైగా ఇతర అవసరాలకు వాడుకుంది. తప్పనిసరి పరిస్థితి కావడంతో ఎట్టకేలకు డిసెంబరు 18న ఆ నిధులను విడుదల చేసినా మరో మెలిక పెట్టింది. 

ఈ నిధులకు సంబంధించి తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఖర్చు చేయవద్దని ఎంపీడీవోలను ఆదేశించింది. వాటిని తాము చెప్పిన ప్రకారమే వినియోగించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇలా 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై చంద్రబాబు సర్కారు కర్ర పెత్తనం చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను అడ్డుకుని గ్రామీణ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తోంది. గ్రామ పంచాయతీల పీక నులుముతూ చంద్రబాబు సర్కారు నిరంకుశంగా వ్యవహరించడం పట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ తాజాగా జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియచేసినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.  

సర్పంచుల పదవీ కాలం మరో మూడు నెలలే.. 
– నిధుల వినియోగంపై సర్క్యులర్‌ యోచనలో సర్కారు 
ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం మరో మూడు నెలలో ముగియనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2 కల్లా సర్పంచుల కాలం పూర్తవుతుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా ఇచ్చిన రూ.1,026 కోట్లతో పాటు రానున్న మార్చి నెలాఖరులోగా రెండో విడతగా మరో రూ.1,000 కోట్లు కేంద్రం నుంచి గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు రావాల్సి ఉంది. ఇలా దాదాపు రూ.రెండు వేల కోట్లకుపైగా కేంద్రం నిధులిస్తున్నప్పటికీ బాబు సర్కారు స్థానిక సంస్థలకు అందకుండా అడ్డుపడుతోంది. 

స్థానిక అవసరాలకు అనుగుణంగా కాకుండా తాము చెప్పిన ప్రకారం వాడాలని ఆంక్షలు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కేంద్రమిచ్చిన 15వ ఆర్థిక నిధులను సర్పంచులు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల అవసరాలకు అనుగుణంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సూచించే పనులకే ఖర్చు పెట్టేలా పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా ఓ సర్క్యులర్‌ జారీ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కేంద్రం కరుణించినా.. 
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు సర్కారు గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం ఇస్తున్న నిధులను తొక్కిపెడుతూ తీవ్ర జాప్యం చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులను కేంద్రం గతేడాది సెపె్టంబరులో రూ.988.76 కోట్లు విడుదల చేయగా.. దాదాపు రెండు నెలల తర్వాత నవంబరులో ఆయా స్థానిక సంస్థల ఖాతాలకు చేరాయి. ఇక గతేడాదికి సంబంధించి రెండో విడతగా రూ.1,121 కోట్లను 2024 డిసెంబరులో కేంద్రం విడుదల చేస్తే.. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ ఏడాది సెపె్టంబరులో వాటికి మోక్షం లభించింది.  

2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడతగా రూ.998 కోట్ల కేంద్ర నిధులు 2024 మార్చి నెలాఖరులో విడుదలయ్యాయి. అయితే అప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై కోడ్‌ అమలులోకి రావడంతో అప్పటి అధికారులు ఆ నిధులను గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వం జూన్‌ 12వ తేదీనే బాధ్యతలు చేపట్టినప్పటికీ 2024 ఆగస్టు దాకా ఆ నిధులను ఆయా స్థానిక సంస్థలకు విడుదల చేయకపోవడం గమనార్హం. 

జగన్‌ హయాంలో..సర్పంచుల ఆధ్వర్యంలోనే చెల్లింపులు
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ప్రత్యేకించి గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధులపై రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు లేకుండా వైఎస్సార్‌ సీపీ హయాంలో అడుగులు ముందుకు పడ్డాయి. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల ఆధ్వర్యంలోని స్థానిక సంస్థల ప్రభుత్వాలు వారి పరిధిలో స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులను ఖర్చు చేసుకునే కొత్త విధానం గత ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల తీర్మానాల ప్రకారం చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా స్థానిక సంస్థల ప్రభుత్వాలే నేరుగా బిల్లులు చెల్లించేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

దీనికి సంబంధించి రాష్ట్ర ట్రెజరీ ఆంక్షలు లేకుండా, ఆ నిధులను ఆయా గ్రామీణ స్థానిక సంస్థల ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతకు ముందు టీడీపీ హయాంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులపై నియంత్రణను సీఎఫ్‌ఎంఎస్‌ పరిధిలో ఉంచడంతో గ్రామ పంచాయతీలు మొక్కుబడి కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. కళ్ల ముందు కేంద్రం ఇచ్చిన నిధులున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌ వద్ద బిల్లులు పాస్‌ కాకుండా అడ్డంకులు సృష్టించడంతో గ్రామీణ స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. 

ఇది .. బ్లాక్‌ మెయిల్‌ చేయడమే! 
రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం దారుణం. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు స్థానిక సంస్థలు ఆ నిధులు వినియోగించకూడదని ఆదేశించడం గ్రామ స్వరాజ్య స్ఫూర్తికి వ్యతిరేకం. విజయనగరం జడ్పీ సీఈవో ఈమేరకు సర్క్యులర్‌ జారీ చేయడం అంటే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను బ్లాక్‌ మెయిల్‌ చేయడమే. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటి? స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇదే వైఖరి   కొనసాగిస్తే ప్రజా ప్రతినిధులు, ప్రజలతో కలసి ఉద్యమానికి సమాయత్తం అవుతాం. 
–వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌ సీపీ పంచాయతీ రాజ్‌ విభాగం అధ్యక్షుడు 

ఉపసంహరించుకోకుంటే ఉద్యమమే.. 
15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు ఆక్షేపణీయం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వినియోగించుకోనివ్వకుండా అడ్డుపడుతూ సర్క్యులర్‌ జారీ చేయడం శోచనీయం. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు 15 ఆర్థిక సంఘం నిధులను ఖర్చు పెట్టకూడదని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఆంక్షలు విధించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం  పంచాయతీలకు ఇవ్వాల్సిన సర్‌చార్జీ, స్టాంప్‌ డ్యూటీ నిధులు ఇవ్వడం లేదు. మినరల్‌ సెస్‌ రూపంలో ఇవ్వాల్సిన నిధులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. సీనరేజ్‌ నిధులను కూడా ఇవ్వకుండా గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతూ వస్తోంది. సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనం కూడా చెల్లించకుండా వారిని అగౌరవ పరుస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులపై సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమించక తప్పదు.  
–మామిడి అప్పలనాయుడు, లోకల్‌ గవర్నమెంట్‌ చాంబర్‌ జాతీయ అధ్యక్షుడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement