సాక్షి, తిరుమల: మూడు రోజుల పాటు శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీని రద్దు చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు. తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29వ తేదిలకు (శని, ఆది, సోమవారం) సంబంధించి శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ లో, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్లు జారీ చేయరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రణాళికలను రూపొందించికోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలోమార్పు
తిరుమల అంగప్రదక్షణ టోకెన్ల జారీ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పుడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి FIFO(First In First Out)పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.


