పంటలపై 'మోంథా' తాండవం! | Cyclone Montha Effect In AP, Crop Damaged In Nearly 15 Lakh Acres In AP, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

Cyclone Montha: పంటలపై 'మోంథా' తాండవం!

Oct 30 2025 4:55 AM | Updated on Oct 30 2025 9:03 AM

Cyclone Montha effect: Crop damage in nearly 15 lakh acres in AP

నెల్లూరు జిల్లా చిన్న దేవరపల్లిలో కోతకు వచ్చిన వరి పంట నీట మునగడంతో దీనంగా ఉన్న రైతు

అన్నదాతల ఆశలను చిదిమేసిన తుపాను 

ముంచెత్తిన వానలు.. ఈదురు గాలులతో పంటలకు తీవ్ర నష్టం

దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం

నేలకొరిగిన వరి.. 30 శాతం విస్తీర్ణంలో పంటకు దెబ్బ 

ఇతర ప్రధాన పంటలదీ అదే పరిస్థితి 

ముంపునకు గురైన మొక్కజొన్న, అపరాలు, వేరుశనగ పంటలు

కుండపోత వర్షాలకు కుళ్లిపోతున్న పత్తి కాయలు.. తుది అంచనాలు ఎప్పుడు కొలిక్కి వస్తాయో తెలియని దుస్థితి

వీటన్నింటికీ తోడు కూటమి ప్రభుత్వ నిర్వాకంతో అపార నష్టం 

ఈ–క్రాప్‌కు మంగళం.. ఉచిత పంటల బీమాకు ఎసరు 

పెట్టుబడి సాయం రూ.40 వేలకు గాను రూ.5 వేలే.. అదీ కొంత మందికే 

ఉల్లి, టమాట, పొగాకు సహా పంటలన్నింటికీ గిట్టుబాటు ధర కరువు 

ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేసి వ్యవసాయం వెన్ను విరిచిన వైనం 

ఎరువులు, విత్తనాలు అందక రైతులు విలవిల.. వీటన్నింటినీ అధిగమించి సాగు చేస్తే నిండా ముంచిన వర్షం

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: ‘మోంథా’ తుపాను రైతుల ఆశలను చిదిమేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా లక్షలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. వరి, మొక్క జొన్న, పత్తి, అరటి ఇలా ఏ పంట చూసినా ముంపు నీటిలో నానుతున్నాయి. కోతకొచ్చే దశలో తుపాను బారిన పడడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభా­వం ఉన్నట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావం వల్ల 30 శాతం మేర దిగుబడులు తగ్గిపోనున్నాయని ప్రాథమిక అంచనా. తుపాను ప్రశాంతంగానే తీరం దాటినప్పటికీ, కుండపోత వర్షాలతో ఉమ్మడి ఉభ­య­గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్ర మొదలు బాపట్ల వరకు.. ఒంగోలు నుంచి తిరు­పతి వరకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. తీర ప్రాంత జిల్లాల్లో లక్ష­లాది ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. పలు జి­ల్లా­ల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కోతకొచ్చిన పంట ఇలా నీటి పాలవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. భా­రీ­గా తగ్గనున్న దిగుబడులతో వందల కోట్ల రూపాయల విలువై­న ఉత్పత్తి నష్టం రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది.    

నంద్యాల జిల్లా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నీటమునిగిన మొక్కజొన్న రాశులు  

ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి.. 
ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం నుంచి అడుగడుగునా కూటమి ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యానికి తోడు అతివృష్టి–అనావృష్టి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి రైతులు పంటలు సాగు చేశారు. ప్రభుత్వం అదునుకు విత్తనాలతోపాటు యూరియా అందించలేకపోయింది. ఆగస్టు 7వ తేదీ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, ఆ తర్వాత కురిసిన అధిక వర్షాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఓ వైపు పెట్టుబడులు తడిసి మోపెడైనా.. మరోవైపు ప్రభుత్వం పట్టించు కోకపోయినా మొక్కవోని పట్టుదలతో ఖరీఫ్‌ సాగు చేశారు. 

ఈ ఏడాది సాగు లక్ష్యం 86.32 లక్షల ఎకరాలు కాగా, అతికష్టమ్మీద 72.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. లక్ష్యానికి మించి ఇప్పటి వరకు వరి, మొక్కజొన్న పంటలు మాత్రమే సాగయ్యాయి. 38.97 లక్షల ఎకరాల్లో వరి, 11 లక్షల ఎకరాల్లో పత్తి, 5 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగయ్యాయి. వరి, మొక్కజొన్నకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, పత్తికి రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే మోంథా తుపాను వల్ల దాదాపు 8 లక్షల ఎకరాలకు పైగా వరి, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో ఉద్యాన.. ఇతర పంటలకు నష్టం వాటిల్లింది.   

వరి పంటపై 30 శాతం ప్రభావం 
సాగైన వరి విస్తీర్ణంలో 30 శాతం పంటను తుపాను దెబ్బ తీసిందని తెలుస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో దాదాపు 6–10 లక్షల ఎకరాలకు పైగా పంట ముంపునకు గురైనట్టుగా అంచనా. ఇతర పంటలన్నీ కలిపి మరో నాలుగైదు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్టు సమాచారం. లేటుగా నాట్లు వేసిన చోట పంట నిలదొక్కుకున్నప్పటికీ ముందుగా సాగైన చోట మాత్రం పంట చాలా వరకు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని సెంట్రల్‌–ఈస్ట్రన్‌ డెల్టా పరిధిలో పంటలు ఎక్కువగా దెబ్బతినగా, ఉత్తరాంధ్ర, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కుండపోత వర్షాల వల్ల అపార నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. 

నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని భవనాశి వాగు వెంట నీట మునిగిన మొక్కజొన్న తోట  

కృష్ణా, గోదావరి లంకల్లో అరటి, బొప్పాయి పంట దెబ్బతినగా.. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మిరప పంట దెబ్బతింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా 396 మండలాల పరిధిలో 2,320 గ్రామాల్లో 1.38 లక్షల మంది రైతులకు సంబంధించి 2.82 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగాప్రాథమికంగా అంచనా వేసింది. దాంట్లో ప్రధానంగా 1.79 లక్షల ఎకరాల్లో వరి, 75 వేల ఎకరాల్లో పత్తి, 15 వేల ఎకరాల్లో మినుము, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్టుగా చెబుతోంది. నంద్యాల యార్డులో కొనేవారు లేక విక్రయానికి సిద్ధంగా ఉంచిన మొక్క జొన్న రాసులు తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు.   

తగ్గనున్న దిగుబడులపై అన్నదాత గుబులు 
అధిక వర్షాల కారణంగా లక్షలాది ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. వర్షాలు పూర్తిగా తెరిపినిచ్చి, ముంపు నీరు కాస్త దిగినా ముంపునకు గురైన ప్రాంతాల్లోని పంట ఆశించిన దిగుబడి వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవంటున్నారు. గతేడాది హెక్టారుకు 5,578 కిలోలు చొప్పున దిగుబడి రాగా, ఈ ఏడాది 5,543 కిలోలకు మించి రాదని మొదటి ముందస్తు అంచనాలను బట్టి లెక్కగట్టారు. కానీ ఈ తుపాను ప్రభావం వల్ల దిగుబడి కాస్త 4,000–­4,500 కిలోలకు పడిపోతుందని తాజా అంచనా. 

మొదటి ముందస్తు అంచనా ప్రకారం 81.87 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, తుపాను ప్రభావం వల్ల 65 లక్షల టన్నులకు మించదని తెలుస్తోంది. మరొక వైపు గతేడాది పత్తి హెక్టార్‌కు 442 కిలోలు రాగా, ఈ ఏడాది 357 కిలోలు, మొక్కజొన్న గతేడాది 4,710 కిలోలు రాగా, ఈసారి 4,259 కిలోలు, కంది గతేడాది 171 కిలోలు రాగా, ఈసారి 117 కిలోలు, వేరుశనగ గతేడాది 258 కిలోలు రాగా, ఈ ఏడాది 149 కిలోల చొప్పున దిగుబడులొస్తాయన్నది మొదటి ముందస్తు అంచనా. అయితే తుపాను ప్రభావంతో కనీసం 20–30 శాతం మేర పంటల దిగుబడులు తగ్గి పోతాయని తెలుస్తోంది. 

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో నేలకొరిగిన వరి పైరును నిలబెడుతున్న రైతు 

పంట నష్ట పరిహారం పరిస్థితీ అంతే  
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉండగా ఏ సీజన్‌కు సంబంధించిన పంట నష్టపరిహారాన్ని అదే సీజన్‌ ముగిసేలోగా అందజేసేవారు. ఇప్పుడా పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. నిర్ణీత గడువులోగానే వ్యవసాయ, ఉద్యాన శాఖలు తుది అంచనాలు తయారు చేస్తున్నప్పటికీ పరిహారం మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వం  పట్టించుకోవడం లేదు. కరువు సాయంతో పాటు పంట నష్ట పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎగ్గొడుతూనే వస్తోంది. 
 


గడిచిన 17 నెలలుగా పెండింగ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు 5.50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.595 కోట్లకు పైగానే ఉన్నాయి. వీటిలో గతేడాది వరదలతో పాటు అకాల వర్షాలకు సంబంధించి 76.75 కోట్లు ఉండగా, ఖరీఫ్‌ 2024, రబీ 2024–25 సీజన్‌లకు సంబంధించి దాదాపు రూ.100 కోట్లకు పైగా కరువు సాయం రూ.వంద కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో నిలిచిన ఖరీఫ్‌ 2023, రబీ 2023–24 సీజన్‌లకు సంబంధించి మరో రూ.311.39 కోట్లు  కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది.  

బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంక–పోతార్లంక రోడ్డులో నేలమట్టమైన అరటి తోట 

కదిలిస్తే కన్నీరే.. 
మోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దాదాపు రాష్ట్రంలోని సగం జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రైతులను కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక్క నంద్యాల జిల్లాలోనే 1.05 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాల్లో వాణిజ్య, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వేరుశనగ, వరి, టమాటా, ఉద్యాన పంటలు నీట మునిగాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు 33వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. 


పల్నాడు జిల్లాలో ప్రధానంగా 43,375 ఎకరాల్లో పత్తి, 5,250 ఎకరాల్లో వరి, 3,048 ఎకరాల్లో మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. బాపట్ల జిల్లాలో వరి, పత్తి, మినుము, సోయాబీన్, మిర్చి, అరటి, బొప్పాయి పంటలు.. మొత్తంగా 12,293 ఎకరాల్లో నెలకొరిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి పంటతోపాటు బొప్పాయి, అరటి, కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. 1,15,892 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు రూ.73.45 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా. ఎన్టీఆర్‌ జిల్లాలోని 17 మండలాల్లో 42,483 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లాలో రూ.60 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. 

శ్రీకాకుళం జిల్లాలో 6 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. వేలాది కొబ్బరి చెట్లు పడిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 10,309 ఎకరాల్లో పంట నీట మునగ్గా, ఈదురు గాలుల ధాటికి 16,072 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వేలాది ఎకరాల్లో ఆక్వా పంటకు నష్టం వాటిల్లింది. నల్లి క్రిక్‌ సముద్రపు ఆటుపోట్లతో చెరువుల గట్లు తెగి ముంపు బారిన పడ్డాయి. ఏలూరు జిల్లాలో 15 వేల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. వర్షాలు, చలిగాలుల ప్రభావంతో చెరువుల్లో ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గిపోతుండటం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 16,092 హెక్టార్లలో వరి నేలకొరిగింది. వేలాది హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయి.  
నెల్లూరు జిల్లా పాతదేవరాయపల్లిలో నీటిలో తేలియాడుతున్న వరి పైరు 

ఉచిత పంటల బీమా ఉండి ఉంటే..
కూటమి ప్రభుత్వంలో పంటలకు ఈ–క్రాప్‌ లేదు.. ఇన్సూ్యరెన్సూ లేదు.. ఇన్‌పుట్‌ సబ్సిడీ అంతంతే.. పెట్టుబడి సాయం రూ.40 వేలకు గాను తూతూ మంత్రంగా కొద్ది మందికే రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఉల్లి, టమాటా పంటలకు కూలి కూడా దక్కక పశువులకు వదిలేస్తున్న దీన స్థితి. కూటమి ప్రభుత్వం ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు అందకుండా చేసింది.  

⇒ ఉచిత పంటల బీమా పథకం ఉండి ఉంటే ఇలాంటి విపత్తు వేళ రైతులకు అక్కరకొచ్చేది. నూరు శాతం కవరేజీతో నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా రక్షణ లభించేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించి స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రీమియం భారం కావడంతో ఈ పథకంలో చేరేందుకు రైతులెవ్వరూ ముందుకు రాలేదు.  

⇒ ఉచిత పంటల బీమా పుణ్యమా అని ఖరీఫ్‌–2024లో 84.80 లక్షల మంది రైతులు 69.51 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు బీమా రక్షణ పొందగలిగారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో రబీ 2024–25 సీజన్‌లో 9.93 లక్షల ఎకరాలకే పరిమితం కాగా, 7.65 లక్షల మంది రైతులు మాత్రమే బీమా కవరేజ్‌ పొందలిగారు. ఖరీఫ్‌ 2024–25 సీజన్‌లో 19.60 లక్షల ఎకరాల్లో మాత్రమే బీమా కవరేజ్‌ లభించగా, 19.51 లక్షల మంది బీమా చేయించుకోగలిగారు.

⇒ 2024 జూన్‌లో చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టడంతో 2023–24 సీజన్‌కు సంబంధించి రూ.1,385 కోట్లు నేటికీ రైతులకు అందని పరిస్థితి నెలకొంది. మరొక వైపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్‌ 2024 సీజన్‌కు రూ.894.62 కోట్లు, రబీ సీజన్‌కు రూ.758.74 కోట్లు, ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.774.87 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, ఒక్క పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదు. ఫలితంగా పంటల బీమా పరిహారం అందని ద్రాక్షగా మారింది.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి– పట్లంట్ల రోడ్డులోని ఓ తోటలో విరిగిపడిన బొప్పాయి చెట్లు
 
ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి
పంట నష్టం అంచనాలు పక్కాగా రూపొందించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గతంలో మాదిరిగా తూతూ మంత్రంగా చేపట్ట­డం కాకుండా, పక్కాగా చేపట్టి సాధ్యమైనంత త్వరగా రైతుల ఖాతాకు పరిహారం జమ చేయాలని, పెండింగ్‌ బకాయిలు కూడా చెల్లించాలని కోరుతున్నాయి. ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా విపత్తుల్లో దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారని, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆ మాటను నిలబెట్టు కోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. 

ఉచిత పంటల బీమాను కొనసాగించి, నూరు శాతం పంటల బీమా వర్తింప చేయాలని, దెబ్బతిన్న ప్రతి ఎకరాకు ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని పంటల బీమా పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తుపాను అనంతరం పంటలను కాపాడుకునేందుకు పంటను బట్టి ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు రైతులకు ఖర్చవుతుందని అంచనా. ఇందు కోసం ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి, లేబరు ఖర్చును పూర్తిగా ఈ పథకం కింద ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
గుంటూరు జిల్లా తాడికొండలో పత్తి పొలంలోకి చేరిన వరద నీరు 

ప్రభుత్వం ఆదుకోకపోతే మేం బతకలేం
నాలుగెకరాల్లో పత్తి, రెండెకరాల్లో కంది పంటలను సాగు చేశాను. పత్తి తీతలు ప్రారంభమయ్యే దశలో తుపాను కారణంగా కాయలు కుళ్లిపోయాయి. ఎకరాకు 3–5 క్వింటాళ్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కంది పంట పూర్తిగా నేలవాలింది. తీవ్రంగా నష్టపోయాను. నాలాంటి రైతులు ఎంతో మంది నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మేం బతకలేం. 
– బొల్లా మాలకొండయ్య, నాదెండ్ల, పల్నాడు జిల్లా

పంట పూర్తిగా నేలకొరిగింది 
నాకు ఉన్న రెండు ఎకరాలతో పాటు మరో ఎనిమిది ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాను. రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాను. తుపాను వల్ల పంట పూర్తిగా నేలకొరిగింది. ప్రభుత్వం న్యాయం చేసి మాలాంటి రైతులను ఆదుకోవాలి. 
– కాళా వెంకటరావు, ఊలపల్లి గ్రామం, బిక్కవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా

నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి 
వరి పంట సాగు చేయడానికి పోసుకున్న నారుమళ్లు తుపానుతో పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 20 రోజుల్లో నాట్లు వేయాల్సి ఉంది. అయితే పూర్తిగా దెబ్బతింది. మళ్లీ నార్లు పోసుకోవాల్సి ఉంది. మరోసారి విత్తనాలు కొనుగోలు చేయడానికి ఆర్థిక స్తోమత లేదు. ప్రభుత్వం విత్తనాలు రైతులకు ఉచితంగా అందించాలి. 
– కృష్ణయ్య, రైతు, వాకాడు మండలం, తిరుపతి జిల్లా  

పంట పూర్తిగా నానిపోయింది 
ఈ ఏడాది చోడి (రాగులు) పంట వేసిన సమయంలో విపరీతమైన ఎండ వల్ల పంట ఎండిపోయింది. కొద్దో­గొప్ప మి­గి­లిన పంట చేతికందే సమయంలో తుపాను ­కారణంగా చేనంతా నేలకొరిగింది చోడి కంకులు పూర్తిగా నానిపోయాయి. ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. 
– పి.విశ్వనాథ్, గిరిరైతు, బోసుబెడ గ్రామం, అరకులోయ  

చివరికి కన్నీళ్లే మిగిలాయి

మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాం. పంట బాగా పండిందని సంబరపడ్డాం. తుపాను ఉందని తెలియడంతో కల్లాల్లో ఉంచితే మొక్కజొన్నలు తడిచి పోతా­యని భయపడ్డాం. వ్యవసాయ మార్కెట్‌ యార్డు­లో నిల్వ ఉంచితే తడవకుండా గట్టెక్కుతామని కూలీలను పిలిపించుకుని మొక్క­జొన్నను ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్‌కు తరలించాం. గంట గంటకు వరద నీరు వచ్చి చేరింది. కళ్ల ముందే మొక్కజొన్నలు కొట్టుకుపోతుంటే కాపాడుకోలేకపోయాం. ఏడు రోజులు తిప్పలు పడుతూ పంటను కాపా­డుకుంటే కష్టమంతా వర్షం పాలైంది. 
– శ్రీదేవి, క్రిష్ణాపురం, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా

ఈ అప్పు ఎలా తీర్చుకోవాలయ్యా?

కూలీనాలీ చేసుకుంటూ మాకున్న పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేశాం. నారు పోసిన సమయం నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.1.30 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాం. తీరా‡ కోతకు వచ్చి కోసుకునే సమయంలో తుపాను దెబ్బకు పైరు మొత్తం నేలకు వాలిపోయింది. వర్షం అలానే కురుస్తుండడంతో ధాన్యానికి మొలకలు వచ్చాయి. ప్రస్తుతం కోసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. చేసిన అప్పు ఎలా తీర్చాలో దిక్కు తోచడం లేదు. 
– పి.రాజమ్మ, ఉప్పలపాడు , నెల్లూరు జిల్లా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement