అత్యధికంగా 83,407 ఎకరాల్లో దెబ్బతిన్న వరి, తర్వాత పత్తి 30,144, మొక్కజొన్నకు 2,097 ఎకరాలలో నష్టం
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ తుది నివేదిక.. త్వరలో ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం
ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద కేంద్రం నుంచి పరిహారం కోరాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ చివరి వారంలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మోంథా తుపాను కారణంగా జరిగిన నష్టం తుది నివేదికను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అందించింది. ఈ తుపాను కారణంగా 27 జిల్లాల్లోని 1,22,242 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరాలలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆ నివేదికలో వెల్లడించింది. తుపాను అనంతరం వ్యవసాయ శాఖకు చెందిన క్షేత్రస్థాయి ఏఈవోలు 4,47,864 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించారు.
కాగా, వరి పొలాలు, పత్తి చేనుల్లో నిలిచిన నీటిని బయటకు పంపించిన అనంతరం జరిపిన సర్వే ద్వారా ఆయా జిల్లాల్లో జరిగిన నష్టంపై తుది నివేదికను వ్యవసాయ శాఖ రూపొందించింది. ఇందులో అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 21,408 మంది రైతులకు చెందిన 23,580 ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు తేల్చారు.
ఆ తరువాత వరంగల్‌లో 19,736 ఎకరాలు, కరీంనగర్‌లో 11,473 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే వరంగల్ పూర్వ జిల్లా పరిధిలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో కలిపి సుమారు 40వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అత్యల్పంగా గద్వాల జిల్లాలో 12 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొన్నారు.
83,407 ఎకరాల్లో వరి పంటకు నష్టం
మోంథా తుపాను కారణంగా పొట్ట దశ, కోతల దశలో ఉన్న వరి అధికంగా దెబ్బతిన్నది. 27 జిల్లాల్లో వరి పంటకు 83,407 ఎకరాల్లో నష్టం వాటిల్లగా, పత్తి 30,144 ఎకరాలు, మొక్కజొన్న 2,097 ఎకరాలలో దెబ్బతిన్నది. ఇదిలా ఉండగా పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా ఎకరాకు రూ.10 వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ప్రభుత్వం రూ.117.76 కోట్లు చెల్లించాల్సి ఉంది.
కాగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద పంట నష్టానికి పరిహారం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద ఎకరం విస్తీర్ణంలో ఇసుక మేటలకు రూ.7,285, నీటిపారుదల కింద సాగైన పంటలకు రూ.6,880, వర్షాధార పంటలకు రూ.3,440, తోటలకు ఎకరానికి రూ. 9,106 చొప్పున మొత్తం రూ.70 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మేరకు మోంథా తుపాను నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పంట నష్టం వివరాలను కేంద్రానికి పంపించనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.


