కూరగాయల అమ్మకాల్లో ఇష్టారాజ్యం
ఆన్‌లైన్ బిల్లింగ్ శ్రేయస్కరమంటున్న వినియోగదారులు
సాక్షి,హైదరాబాద్: రైతులకు గిట్టుబాటు ధర... కొనుగోలుదారులకు సరసమైన ధరలకే నాణ్యమైన కూరగాయలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన రైతు బజార్లపై పర్యవేక్షణ కరువైంది. తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి అన్నట్లుగా గ్రేటర్ పరిధిలోని రైతుబజార్లకు ఎస్టేట్ ఆఫీసర్లను నియమించి చేతులు దులుపుకుంది మార్కెటింగ్ శాఖ. హోల్‌సేల్ మార్కెట్‌లో కూరగాయల ధరలకు అనుగుణంగా ఏ రకం ఎంతకు అమ్మాలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్ణయిస్తుంది. అన్ని రకాల కూరగాయలకు ధరలను నిర్ణయించి, ఏ రోజుకారోజు అన్ని రైతుబజార్లలోని ఎస్టేట్ ఆఫీసర్‌కు వాటి వివరాలను పంపుతారు. అయితే ఇది రైతుబజార్లలో ఎక్కడా అమలు కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అన్ని రైతు బజార్లలో ఒకే ధరలు అమలు చేయాలని నిబంధలు ఉన్నా నగరంలోని రైతుబజార్లలో ఈ తరహా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుగుతున్నాయి.
ధరల్లో వ్యత్యాసం దేనికి..?
సామాన్యంగా రైతులు పొలం నుంచి తెచి్చన పంటను ఎంతో కొంతకు అమ్ముకు వెళ్లిపోతారు. రైతుబజార్లలో రైతుల పేరిట తిష్ట వేసిన దళారులు... వినియోగదారులను దగా చేస్తున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు కూరగాయల నాణ్యతను పరిశీలించి, ధరలు నిర్ణయిస్తారు.
రైతు బజార్లలో ఏర్పాటు చేసిన బోర్డులపైన వాటి వివరాలను పేర్కొంటారు. అయితే ఆ ధరలు తమకు గిట్టుబాటు కావని దళారులు తెగేసి చెబుతున్నారు. ఎవరైనా వినియోగదారులు ధరల విషయమై ప్రశి్నస్తే... వారిని నానా మాటలు అని అవమానించి పంపేస్తుంటారు.
పర్యవేక్షణ కరువు..
ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన రైతుబజార్లలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి దళారులకు అడ్డాలుగా మారిపోయాయి. రైతుల స్థానంలో ఒక్కొక్కరుగా నగరానికి చెందిన వారే రైతుల అవతారం ఎత్తుతున్నారు. నగరం నలువైపులా ఉన్న జిల్లాల నుంచి వచ్చే రైతులకు ఇక్కడ స్థానం లేకుండా పోతోంది. రైతు బజార్లలో దళారులను ఏరి వేసేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయా రైతుబజార్ల ఎస్టేట్ అధికారులు చెబుతున్నా.. అది తూతూ మంత్రంగానే ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామాల నుంచి తెచ్చుకున్న కూరగాయలను ఒకప్పటి మాదిరిగా అమ్ముకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోయిన్‌పల్లి, గుడి మల్కాపూర్ లాంటి పెద్ద మార్కెట్లలో హోల్‌సేల్‌గా కొనుగోలు చేసిన కొందరు ఇక్కడికు తెచ్చి రైతుల పేరుతో విక్రయిస్తున్నారు.
తమకంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నా వారిని అడిగే వారు కరువయ్యారని రైతులు పేర్కొన్నారు. పేరుకే రైతు బజార్లు వాటినిండా దళారులు, బినామీలే తిష్ట వేసి రైతులను రాకుండా చేస్తున్నారు. వీరి ఎస్టేట్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్ల అండ ఉండటంతో వారి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. క్షేత్ర స్థాయిలో రైతు బజార్లలో తనిఖీలు నిర్వహించే ఉన్నతాధికారి లేకపోవడంతో మధ్య దళారులు పెరిగిపోతున్నారు. ఇప్పటికైనా నిజమైన రైతులే రైతు బజార్లలో కూరగాయాలు విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు.


