వరద తాకిడికి ధ్వంసమైన హనుమకొండలోని వంద ఫీట్ల రోడ్డు
మూడురోజులైనా నీటిలోనే వరంగల్ కాలనీలు
ఇళ్లనిండా బురద.. దుర్గంధంతో సమస్యలు
మున్నేరు శాంతించటంతో ఊపిరి పీల్చుకున్న ఖమ్మంవాసులు
కొన్ని కాలనీల్లో నీరు, బురదతో ఇబ్బందులు
హైదరాబాద్–శ్రీశైలం హైవేపై కొనసాగుతున్న మరమ్మతులు
వరంగల్ అర్బన్/హన్మకొండ: సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్కన్నపేట(హుస్నాబాద్): డిండి: వరంగల్ నగరంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. వర్షం తగ్గి మూడు రోజులు గడిచినా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండటం వల్ల తాము ఏమీ చేయలేమని బల్దియా అధికారులు చేతులెత్తేయడం పట్ల కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌లో మోంథా తుపానుతో 45 కాలనీలు నీట మునిగాయి. అందులో 39 కాలనీల్లో నీటి ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో బాధితులు ఇళ్లల్లోకి చేరుకున్నారు. కానీ, ఇళ్లన్నీ బురదతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురద మేటలను తొలగించి ఇళ్లను శుభ్రం చేసుకునే పనుల్లో నిమగ్నయ్యారు.
హనుమకొండ పరిధిలోని వివేక్‌నగర్, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, కుడా కాలనీ, నందితా నగర్, రాంనగర్, రాజాజీ నగర్‌లో ఏ ఇంటిని చూసినా పేరుకు పోయిన ఒండ్రు మట్టిని తొలగిస్తూ కనిపించారు. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు బయట ఆరబెట్టారు. వరంగల్ ఎగువన ఉన్న చెరువులు మత్తళ్లు పోస్తుండటంతో వరద కొనసాగుతోంది. దీంతో హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ నగర్ కాలనీ, సంతోషిమాత కాలనీ, బృందవన కాలనీ, అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్‌ఎన్ నగర్, బీఆర్ నగర్ కాలనీల్లో ఇళ్లు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. సూమారు 300 కుటుంబాలు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నాయి. వరద తాకిడికి నగరంలోని పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. హనుమకొండలోని 100 ఫీట్ల రోడ్డు గోపాల్‌పూర్ చెరువు నుంచి సమ్మయ్య నగర్ క్రాస్ వరకు పూర్తిగా పాడైంది.

శాంతించిన మున్నేరు: మోంథా తుపాను కారణంగా ఖమ్మంలో ఉప్పొంగి ప్రవ హించిన మున్నేరు వాగు శుక్రవారం శాంతించింది. గురు వారం రాత్రి ఖమ్మం కాల్వొడ్డు సమీపాన 26 అడుగుల మేర ప్రవహించగా, శుక్రవారం 15 అడుగులకు తగ్గింది. దీంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. మున్నేరు పరీవాహకంలో ఖమ్మం నగరంలోని కాలనీలతోపాటు ఖమ్మంరూరల్ మండలం జలగం నగర్ లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.
బ్యాక్ వాటర్‌తో పలు కాలనీలు నిండిపోయాయి. మరోపక్క ఆకేరు నదికి భారీగా వరద చేరింది. గురువారం తిరుమలాయపాలెం మండలం రాకాసితండా వద్ద సీతారామ అక్విడక్ట్‌ను ఆనుకుని నది ప్రవహించింది. వరద తగ్గినా కాలనీల్లోని రోడ్లు, ఇళ్లలో బురద చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా ఖమ్మం జిల్లాలో వరి, పత్తితో పాటు ఇతర పంటలు దాదాపు 62,400 ఎకరాల్లో దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమి కంగా అంచనా వేశారు. అనధికారికంగా మరో 15 వేల ఎకరాలపై ప్రభావం చూపినట్లు సమాచారం.
శ్రీశైలం హైవేపై బ్రిడ్జికి మరమ్మతు
నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై కోతకు గురైన బ్రిడ్జి పునురుద్ధరణ పనులు శుక్రవారం కొనసాగాయి. వరద ప్రవాహం తగ్గటంతో అధికారులు రోడ్డు మరమ్మతు పనులను వేగవంతం చేశారు. ఈ మార్గం గుండా నాలుగు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో హైదరాబాద్, దేవరకొండ, కల్వకుర్తి, శ్రీశైలం, మద్ది మడుగు, ఉమామహేశ్వరం, అచ్చంపేట, తెల్కపల్లి, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం
‘అమ్మ, చెల్లితో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొందామని భర్తతో కలిసి బైక్‌పై బయలుదేరి, సిద్దిపేట జి ల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి శివారులో వా గు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయిన దంపతులు ప్రణయ్, కల్పన మృతదేహాలు శుక్రవారం ల భించాయి. దీంతో మృతదేహాల వద్ద బంధువులు, కు టుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కల్పన పుట్టిన రోజే డేత్‌డేగా మారడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషా దాన్ని నింపింది. ఘటనపై ప్రణయ్ తండ్రి ఇసంపల్లి ప్ర భాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ తెలిపారు.


